Menu

Oracle’s layoffs Explained: 30వేల ఉద్యోగాలు ఊస్ట్.. దిగ్గజ కంపెనీ నిర్ణయంతో టెన్షన్‌లో ఐటి సెక్టర్!

Praja Dhwani Desk 2 months ago
oracle layoffs explained

లాభాలు పెరుగుతున్న కంపెనీ.. రికార్డ్ స్థాయిలో ఆదాయం.. అయినా ఒకేసారి వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చేపట్టింది. మొత్తం సంఖ్యపై స్పష్టత లేకపోయినా.. దాదాపు 30,000 వరకు ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా.

ఇందులో భారత్‌లోనే సుమారు 12,000 మంది ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. ఇంత పెద్ద కంపెనీ, ఇంత మంచి ఆదాయం ఉన్న సమయంలో ఎందుకు ఇలా ఉద్యోగాలను తగ్గిస్తోంది? ఇంతకీ ఒరాకిల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

ఒరాకిల్ ఇప్పుడు భారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లపై దృష్టి పెడుతోంది. ఈ రంగంలో ముందుండాలంటే భారీ పెట్టుబడులు అవసరం. అందుకే కంపెనీ తన ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే భారీ స్థాయిలో డేటా సెంటర్ల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల స్థాయిలో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన టెక్నాలజీ కోసం లక్షల సంఖ్యలో ప్రత్యేక చిప్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో కంపెనీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఒరాకిల్‌పై భారీ అప్పులు కూడా ఉన్నాయి. మొత్తం అప్పు లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో కంపెనీకి క్యాష్ ఫ్లోను మెయింటైన్ చేయడం చాలా కీలకం అవుతుంది. అందుకే ఉద్యోగాల కోతల ద్వారా ఖర్చులను తగ్గించి, ఆ డబ్బును కొత్త పెట్టుబడులకు మళ్లించాలని చూస్తోంది. ఈ లేఆఫ్స్ వల్ల కంపెనీకి వేల కోట్ల రూపాయల వరకు సేవ్‌ అవుతుందని అంచనా. ఆ డబ్బును తిరిగి డేటా సెంటర్ ప్రాజెక్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఉపయోగించాలనే ప్లాన్ ఉంది.

మరోవైపు ఫైనాన్షియల్ ఒత్తిడి కూడా పెరుగుతోంది. కంపెనీ అప్పులపై ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయి. కొన్ని బ్యాంకులు రిస్క్ ఎక్కువగా ఉందని భావించి రుణాలు ఇవ్వడంలో జాగ్రత్త పడుతున్నాయి. ఇది కూడా కంపెనీ నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది.

అటు పెద్ద క్లయింట్లు కొత్త టెక్నాలజీల వైపు మళ్లే అవకాశం ఉండటంతో ఇప్పటికే నిర్మిస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఉపయోగపడుతుందా లేదా అన్నది అర్థంకావడంలేదు. అయితే ఈ సమయంలో కంపెనీ ఆదాయం మాత్రం పెరుగుతోంది. కానీ స్టాక్ ధర మాత్రం గత గరిష్ట స్థాయిలతో పోలిస్తే తగ్గింది. అంటే మార్కెట్‌లో కూడా కొంత అనిశ్చితి ఉందన్న మాట.

మొత్తానికి ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది. భవిష్యత్ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. అదే సమయంలో ప్రస్తుత వ్యవస్థలో ఖర్చులను తగ్గిస్తున్నాయి. దానికి లేఆఫ్స్‌ తప్ప వారికి ఇంకో మార్గం కనిపించడంలేదని చెబుతున్నాయి.

ALSO READ: ఒక చిన్న దేశం అగ్రరాజ్యం అమెరికాను ఎలా ఓడించింది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *