ప్రశ్నించే గొంతుకలను చరిత్ర ఎప్పుడూ ప్రేమించదు.. కానీ చరిత్రను ముందుకు నడిపింది కూడా ఆ గొంతుకలే. రాజులను ప్రశ్నించినవారిని శిక్షించారు. మతాలను ప్రశ్నించినవారిని బహిష్కరించారు. కులవ్యవస్థను ప్రశ్నించినవారిని అవమానించారు. అధికారాన్ని ప్రశ్నించినవారిని దేశద్రోహులుగా చిత్రీకరించారు. అయినా ప్రశ్నలు ఆగాయా? ప్రశ్నించే గొంతుకలు ఆగాయా.. ఒక గొంతును మూయించిన తర్వాత వేయి గొంతులు పుట్టుకొచ్చాయి. విప్లవాల కోసం, అణగారిన వర్గాల కోసం ప్రశ్నలనే అస్త్రాలుగా మార్చుకున్న వారు అరుదుగా ఉంటారు. అందులో 24ఏళ్ల జర్నలిస్టు శ్రీనిధివిప్లవశ్రీ ఒకరు. అందుకే విప్లవశ్రీ పేరు వినగానే బలిసినకులాలకి, విద్వేష బానిసలకు ఎక్కడో కనిపించని మంట..! ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక.. ఇంట్లో, ఏసీ రూమ్‌ల్లో కూర్చొని ఆమె ఫొటోలు మార్ఫింగ్‌లు చేసి తృప్తి పడడం, శాడిజం ప్రదర్శించడం, సోషల్‌మీడియాలో షేర్ చేయడం దిక్కుమాలినతనం.
విద్యార్థి దశలోనే అన్యాయాన్ని ప్రశ్నించడం నేర్చుకున్న విప్లవశ్రీని మతోన్మాద గుంపులు నిత్యం టార్గెట్ చేస్తూనే ఉంటాయి. సోషల్‌మీడియాలో అడ్డమైన వాగుడు వాగడం, ఆమెకు ఏదో ఒక కులాన్ని, మతాన్ని అంటగట్టడం కొత్తగా చూసిందేమీ కాదు. ఈసారి అది కాస్త తీవ్రరూపం దాల్చి తీవ్రవాదం నుంచి ఉగ్రవాదం స్థాయికి వెళ్లింది. ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలను వినడం నేర్చుకున్న జర్నలిస్టును ఎదుర్కోలేక ఆమె వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దుర్మార్గమైన విషయం.
చరిత్రలో ప్రతి రాజకీయ శక్తి ఇదే చేసింది. వాదనలో గెలవలేకపోయినప్పుడు వ్యక్తిత్వ హననాన్ని ఆశ్రయించింది. నిజాలను ఎదుర్కోలేకపోయినప్పుడు అబద్ధాలను ప్రచారం చేసింది. అయితే అవమానాలతో ఆలోచనలను చంపగలిగిన ఉదాహరణ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. విప్లవశ్రీ ఫొటోను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఆమెపై అసభ్య ప్రచారం చేయవచ్చు. ఆమెను భయపెట్టాలని ప్రయత్నించవచ్చు కానీ.. ఆమె అడిగిన ప్రశ్నలను చెరిపేయలేరు. ఆమె నిలబెట్టిన అంశాలను మాయం చేయలేరు. ఆమె వెనుక నిలిచే లక్షలాది యువత గొంతులను ఆపలేరు.
పోలీసులు ఏం చేస్తున్నారు?
మరోవైపు పోలీసులు ఏం చేస్తున్నారో ఏమో..! ట్విట్టర్‌లో వీడియోలు పెట్టుకుంటున్నారు కావొచ్చు. ఒక సెలబ్రిటీకి అన్యాయం జరిగితే గంటల్లో కదిలే వ్యవస్థ, ఒక మహిళా జర్నలిస్టు గౌరవంపై దాడి జరిగితే అదే వేగంతో స్పందించదు. గతంలో తులసీ చందు లాంటి జర్నలిస్టులతో పాటు మరికొందరు మహిళా జర్నలిస్టులు కూడా ఇదే ఆన్‌లైన్ అబ్యూజ్‌కి గురయ్యారు. ఆ సమయంలో మహిళా జర్నలిస్టులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ని కలిసి కంప్లైంట్ కూడా చేశారు.
ఇక్కడ జర్నలిజం చరిత్రను కూడా ఓసారి తిరగెయ్యాలి. అధికారానికి అత్యంత ప్రమాదకరమైన ఆయుధం తుపాకీ కాదు.. ప్రశ్న. రాజ్యాలకు భయాన్ని కలిగించింది యుద్ధాలు కాదు.. నిజాలు. సింహాసనాలను కదిలించింది కత్తులు కాదు.. కలాలు. అందుకే చరిత్రలో ప్రతి ఆధిపత్యం ముందుగా దాడి చేసింది జర్నలిస్టులపైనే. ప్రతి నిరంకుశత్వం ముందుగా భయపడింది ప్రశ్నించే గొంతుకలకే. ప్రతి విద్వేష రాజకీయానికి మొదటి శత్రువు కూడా స్వతంత్ర ఆలోచనే. ఈ రోజు విప్లవశ్రీపై జరిగిన దాడిని కూడా అదే కోణంలో చూడాలి.
ఇదేనా సంస్కృతి?
ఇటు స్త్రీని దేవత అంటున్న సమాజమే ప్రశ్నించే స్త్రీని సహించలేకపోతోంది. అమ్మను ఆరాధిస్తామని చెప్పే సంస్కృతే మాట్లాడే మహిళను అవమానిస్తోంది. శక్తి స్వరూపిణి అని ఉపన్యాసాలు ఇచ్చే మనస్తత్వమే మైక్ పట్టుకున్న యువ జర్నలిస్టును లక్ష్యంగా చేసుకుంటోంది. పూజించే మహిళకు పూలు. ప్రశ్నించే మహిళకు దాడులు. ఇదేనా సనాతన సంస్కృతి? ఇదేనా వారు గర్వించే నాగరికత?
అయితే ఇక్కడ వారంతా ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. చరిత్రలో అవమానాలకు గురైన వారే ఉద్యమాలుగా మారారు. అణచివేతకు గురైన వారే ప్రవాహాలుగా మారారు. మౌనం చేయాలనుకున్న గొంతులే పిడుగుల్లా ప్రభుత్వాలను వణికించాయి. ఒక విప్లవశ్రీని లక్ష్యంగా చేసుకుంటే ఆమెకు మద్దతుగా లక్షలాది కొత్త విప్లవశ్రీలు బయటకొస్తారు. ఎందుకంటే చరిత్ర ఒక సత్యాన్ని పదేపదే నిరూపించింది. ప్రశ్నలను ద్వేషించే శక్తులు కొంతకాలం గెలవవచ్చు కానీ చివరికి గెలిచేది ప్రశ్నే. గెలిచేది నిజమే. గెలిచేది భయానికి తలవంచని గొంతులే. ఓ 24ఏళ్ల అమ్మాయి గొంతు ఓ మతాన్మోద గుంపును భయపెట్టిందంటే అది విప్లవశ్రీ సాధించిన విజయమే అవుతుంది!
ALSO READ: టైటిల్ పెట్టడంలేదు.. ఎందుకంటే మాకు తెలుగు జర్నలిస్టుల్లా థంబ్‌నెయిల్ పెట్టడం, మాట్లాడడం రాదు..!

Kondapalli Ganesh: దొంగలు పడ్డ 6నెలలకు కుక్కలు మొరిగాయట.. కొండపల్లి గణేశ్ ఎపిసోడ్లో మీడియా తీరు ఇది!
‘ప్రశ్నించడం తప్పే అయితే నేను ఆ తప్పును మళ్లీ మళ్లీ చేస్తా.. ప్రశ్నించడమే నేరమైతే నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తా’
ప్రశ్నను భరించలేకపోతేనే కాదు.. ప్రశ్నించడం చేతకాకపోయినా ప్రజాస్వామ్యం కూలిపోతుంది!
“మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…” సమాజాన్ని న్యాయస్థానంలో నిలబెట్టిన ‘LGBT: A Legal Battle’
Sudan Civil War: యుద్ధభూములుగా మారిన నగరాలు.. మానవతా సంక్షోభానికి దారితీసిన సూడాన్ సివిల్ వార్!