Menu

Kondapalli Ganesh: దొంగలు పడ్డ 6నెలలకు కుక్కలు మొరిగాయట.. కొండపల్లి గణేశ్‌ ఎపిసోడ్‌లో మీడియా తీరు ఇది!

Tri Ten B (Triya) 29 minutes ago
kondapally ganesh scam media

సరిగ్గా ఆరు నెలల క్రితం.. ఇదే కొండపల్లి గణేశ్‌ గురించి ‘ప్రజాధ్వని’లో తొలిసారి ఎండగట్టాం. G7 ఛానెల్‌ పెట్టి జర్నలిస్టులను గణేశ్‌ ఎంతలా మోసం చేశాడో పాయింట్‌ టు పాయింట్‌ వివరించాం.. వెంటనే ఛానెల్‌లోని వాడి తొత్తుల నుంచి ప్రజాధ్వనిలో వార్తలు పబ్లిష్‌ చేసే ఓ మహిళా సబ్‌ఎడిటర్‌కి కాల్‌ వచ్చింది.. ఆర్టికల్‌ డిలీట్ చేయాలని సదరు తొత్తుగాడు ఆ మహిళ దగ్గర బాగా ఓవరాక్షన్ చేశాడు. ఆర్టికల్‌ డిలీట్ చేసేదేలేదని ఖరాఖండీగా చెప్పేసరికి ఆ ముష్టి మోటివేషన్లు ఇచ్చే షఫీ అంకుల్‌ రంగంలోకి దిగాడు. అతగాడు ఆ టైమ్‌లో G7 ఛానెల్‌లో CEOగా ఊడపొడుస్తున్నాడు. ఆ మహిళా సబ్‌ఎడిటర్‌కి వాట్సాప్ మెసేజీ చేశాడు. డిలీట్ చేయాలని కోరాడు..! సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్లకు ఆ తొత్తుగాడితో పాటు ఈ షఫీ అంకుల్‌ జాబ్‌ని కూడా గణేశ్‌ పీకిపడేశాడు.

సరిగ్గా 5నెలల క్రితం.. ఇదే ‘ప్రజాధ్వనిలో G7లో జరుగుతున్న ఘోరాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అవమానాలు, శ్రమ దోపిడి, శాలరీలు ఎగ్గొడుతున్న తీరు గురించి వివరించాం. ఆ వెంటనే G7లో అలజడి రేగింది. ఉద్యోగులు ఎదురుతిరిగారు.. అయితే తర్వాత అయినా సీన్ మారిందా అంటే లేదు.. కొందరికి అరకోర జీతాలు ఇచ్చి గణేశ్‌ చేతులుదులుపుకున్నాడు. ఆ తర్వాత ఛానెల్‌ మూతపడింది. ఇదంతా జరిగిందని సదరు మీడియా ఛానెల్స్‌కి తెలియనది కాదు.. ఆ మధ్యలో గణేశ్‌ రూ.33కోట్ల IP వ్యవహారం కూడా తెలియనది కాదు.. అయినా కూడా మన తెలుగుమీడియా తాగిన మత్తులో మొద్దు నిద్రపోయినట్టుంది. ఇప్పుడు మాత్రం రూ.3.45 కోట్ల రూపాయల ఫ్రాడ్‌ కేసు గురించి మీడియా తెగ ఓవరాక్షన్ చేస్తోంది. అతనో దొంగ అని ఇప్పుడు హెడ్‌లైన్స్‌లో ఊదరగొడుతుంది. సైబరాబాద్ EOW (ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్) విభాగపు పోలీసులు గణేశ్‌పై నమోదు చేసిన కేసును హైలెట్ చేస్తోంది. అతను ఒక ఐదుగురు డబ్బున్న బడాబాబులను మోసం చేశాడని మీడియా తెగ బాధపడిపోతోంది. మరి నెలవారీ జీతాల కోసం మీ తోటి జర్నలిస్టులనే మోసం చేసినప్పుడు మీరంతా గణేశ్‌ గురించి ఎందుకు మాట్లాడలేదు? డబ్బున్నవాళ్లని మోసం చేస్తే మాత్రం మాట్లాడతారా? ఇది గణేశ్‌పై పడిన తొలి కేసు కాదు కదా.. మరి ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడమన్నారు? జర్నలిస్టులకు అన్యాయం జరిగి.. వారి ఇళ్లలోతల్లీ, పిల్ల ఇబ్బందులు పడినప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారు?

గణేశ్‌కి పంగనామాలు పెట్టడం కొత్తమీ కాదు.. ఆయనో వెంకటేశ్వరస్వామి భక్తుడట.. అందుకే కాబోలు ఇంతలా దోచుకోని తర్వాత గుండు గీకించుకుంటాడు. వినాయక వేలం పాటలో లక్షలు తగలేసి లడ్డూను కొంటాడు. ఆ వెంటనే పనికిమాలిన మీడియా వాడ్ని హీరో చేస్తుంది. కూడు లేక పస్తులుండే కోట్లాది కుటుంబాలు ఉండే దేశంలో.. ఒక బలిసినోడు లడ్డూకి లక్షలు తగలేస్తే అదో ఘనకార్యమా? పేదల కడుపు నింపే మనుషుల గురించి మీడియా ఏనాడైనా కవర్ చేసిందా? ఈ గణేశ్‌ని హీరో చేసింది మీడియా కాదా? మీడియాలో నాలుగుసార్లు కనిపించేసరికి..వాటిని ఆధారంగా చేసుకొని గణేశ్‌ అందినకాడికి దోచుకున్నది నిజం కాదా? గణేశ్‌ దోపిడికి మీడియా పరోక్షంగా సాయంచేసినట్టు కాదా? మరి ఇప్పుడేందుకు ఈ ఎక్స్‌ట్రాలు?

ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన గణేశ్ హైదరాబాద్‌లోని బలిసినోళ్ల అడ్డాగా ఉండే హైటెక్ సిటీ-మైహోంభూజా గేటెడ్‌ కమ్యూనిటిలో ఉంటాడు(ఇప్పుడు అక్కడ లేడనుకుంటా..ఏ బొక్కలోనో దాక్కొని ఉంటాడు). 2025, సెప్టెంబర్ 4న కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని లడ్డూ ప్రసాదాన్ని వేలంలో గెలుచుకోని ఇతగాడు వార్తల్లో నిలిచాడు. ఏకంగా 51 లక్షల 77 వేల 777 రూపాయలకు లడ్డూను గెలుచుకున్నాడు గణేశ్‌. అయితే ఈ డబ్బులు ఇప్పటివరకు కమ్యూనిటికి ఇచ్చాడో లేదో అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. కమ్యూనిటిలోని కొంతమంది ప్రకారం ఇతగాడు దేవుడు డబ్బులు కూడా ఎగ్గొట్టాడు. అయితే ఇదేమీ పట్టించుకోని పలు మీడియా ఛానెల్స్‌ గణేశ్‌ని స్టూడియోకి పిలిచి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. అక్కడ మనోడు చేసిన ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. 1000 కుటుంబాలను దత్తత తీసుకుంటానని, దేవుడు కోసం ఏదైనా చేస్తానని బోయపాటి సినిమాలో హీరో చేసినంత అతి చేశాడు.

మరోవైపు మీడియా ఫేమ్‌ ముసుగులో రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఎన్నో దారుణాలకు తెరలేపాడు గణేశ్‌. ఎంతోమంది దగ్గర కోట్లకు కోట్లు డబ్బులు తీసుకున్నాడు. అప్పు పేరిట అబద్ధాలు చెబుతూ అందినకాడికి దోచుకోని లగ్జరీలకు అలవాటు పడ్డాడు. చుట్టూ బౌనర్లను పెట్టుకోని అప్పు ఇచ్చినవారిని భయపెట్టేవాడు. వ్యాపార భాగస్వాములను కూడా నట్టేటా ముంచాడు. అతను మోసం చేశాడని బాధితులకు తెలియడానికి కూడా కాస్త టైమ్‌ పట్టింది. ఎంతైనా ఈ జనాలు కూడా బుస్‌ బుస్‌ అని విషాన్ని చిమ్మే ఇలాంటోళ్లనే ఎక్కువగా నమ్మి చివరకు మునుగుతారు కదా! అందుకే మోసపోయామని లేట్‌గా తెలుసుకోని లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ల గడప తొక్కడం మొదలుపెట్టారు. అయితే గణేశ్‌కు ఇవేవి కొత్త కాదు.. అందుకే చట్టంలోని లోసుగులను ఉపయోగించుకోని కోర్టు గడప తొక్కాడు. గతంలోనే ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. ఇది జరిగి నెలలు దాటింది.. అయినా కూడా మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో నిన్నటివరకు చలనం కనిపించలేదు. ఇప్పుడెందుకో కళ్లు తెరిచింది..ఎందుకంటే మోసపోయిన ఆ ఐదుగురు బాగా బలిసినోళ్లు కావచ్చు..లేదంటే ఇప్పుడు కూడా కళ్లు, నోరు.. మిగిలిన రంధ్రాలూ ముసుకొని ఉండడం తెలుగుమీడియాకు కొత్తేమీ కాదు కదా..!

ఈ విధంగా చూస్తే రేపు మరో గణేశ్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పాత్రలను వ్యక్తులు పుట్టించరు.. డబ్బుకి గౌరవం ఇచ్చి, శ్రమకి విలువ ఇవ్వని మీడియా వ్యవస్థ పుట్టిస్తుంది. మూలధనం ఎంత పెద్దదైతే మనిషి అంత పెద్దవాడిగా కనిపించే సమాజంలో.. కూలీ చేతిలోని చెమటకు విలువ ఉండదు, అతని కడుపులోని ఆకలికి వార్త ఉండదు. డబ్బు చుట్టూ తిరిగే కెమెరాలు ఒక వర్గానికి ప్రతిష్టను తయారు చేస్తుంటే.. మరో వర్గం తన శ్రమతో ఆ ప్రతిష్టకు పునాదులు వేస్తూనే ఉంటుంది. చివరికి దోపిడీ చేసే చేతికి మైక్ దొరుకుతుంది.. దోపిడీకి గురైన మనిషి గొంతు మాత్రం ఆ మైక్‌కి అందనంత దూరంలో ఉండిపోతుంది.

ఇలాంటి వ్యవస్థలో డబ్బున్నవాడు ఎంత ఆర్భాటం చేస్తే అంత గొప్పవాడిగా కనిపిస్తాడు. ఎంత ఖరీదైన ప్రదర్శన చేస్తే అంత గౌరవం దక్కుతుంది. కానీ ఆ సంపద వెనుక ఎంతమంది శ్రమ ఉంది, ఎంతమంది బతుకులు నలిగాయన్న ప్రశ్న మాత్రం తెరపైకి రాదు. అందుకే రేపు గణేశ్‌ పేరు మారొచ్చు, ముఖం మారొచ్చు, కథ మారొచ్చు.. కానీ డబ్బునే గౌరవంగా, దోపిడీని విజయంగా చూపించే ఈ మీడియా వేదిక అలాగే ఉంటే మాత్రం ఇలాంటి కథలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి.

-: త్రియా (PRAJADHWANI NEWS)

ALSO READ: Media Files: గణేశా.. చూస్తున్నావా? “G”old star ⭐.. “G”ole mall

 ALSO READ: ఉద్యోగులకు రియల్‌ఎస్టేట్ గణేశ్‌, షఫీ పంగనామాలు పెట్టారా?


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *