Menu

Queer Strories: నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లు.. ట్రాన్స్‌విమెన్‌ అభినేత్రి జీవితం చెబుతున్న పాఠం

Tri Ten B (Triya) 19 minutes ago
who is abhinetri transwomen

“నేను చదువుకున్నాను… మరి నేను ఎందుకు భిక్షాటన చేయాలి?”

హైదరాబాద్ వీధుల్లో చేయి చాచి నిలబడిన ప్రతిసారీ ఈ ప్రశ్న ఆమె మనసులో మళ్లీ మళ్లీ వినిపించేది. ఎదురుగా వెళ్తున్న వాళ్లు కొందరు డబ్బులు ఇచ్చేవారు. కొందరు ముఖం తిప్పుకునేవారు. ఇంకొందరు అదో రకంగా చూసి వెళ్లిపోయేవారు. కానీ ఆమె పోరాటం ఆకలి కోసం మాత్రమే సాగలేదు. తన జీవితాన్ని ఎక్కడో కోల్పోయిన ఒక మనిషి… మళ్లీ తనను తాను వెతుక్కునే ప్రయాణంగా మార్చుకుంది.

ఆ యువతి పేరు అభినేత్రి. ఆమె ఒక ట్రాన్స్‌విమెన్. ఈరోజు అభినేత్రి హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

అభినేత్రి చిన్నతనం కూడా అందరి పిల్లల్లాగే మొదలైంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ… తనలో జరుగుతున్న మార్పులు తన చుట్టూ ఉన్న వాళ్లకు కనిపించడం మొదలైంది. స్కూల్లో కొందరు పిల్లలు వెక్కిరించేవారు. ఆటపట్టించేవారు. తనతో చదివే పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఆమెకు అర్థమయ్యేది కాదు. రోజులు గడిచే కొద్దీ స్కూల్‌కు వెళ్లడం కంటే… ఆ రోజును ఎలా గడపాలా అనే ఆలోచనే ఎక్కువగా వెంటాడేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఎనిమిదో తరగతిలో స్కూల్లో నిర్వహించిన ఒక జెండర్ అవగాహన కార్యక్రమంలో తొలిసారి LGBTQIA+ గురించి తెలిసింది. ఎన్నాళ్లుగానో మనసులో పేరులేకుండా ఉన్న భావాలకు… ఆరోజు ఒక గుర్తింపు దొరికింది. అయితే ఆ నిజాన్ని ఎవరికీ చెప్పే ధైర్యం ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె పెరిగింది అలాంటి విషయాల గురించి మాట్లాడడానికే భయపడే కుటుంబంలో.. అందుకే తన మనసులోని మాటను… తనలోనే దాచుకుంది.

డిగ్రీ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అభినేత్రి జీవితంలో మొదటిసారి కొంత స్వేచ్ఛ దొరికింది. ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న భావాలను అర్థం చేసుకునే మనుషులు కూడా బయట ప్రపంచంలో ఉన్నారని తెలుసుకుంది. అదే సమయంలో తనలాంటి వాళ్ల పరిచయాలు పెరిగాయి. జీవితానికి ఒక దారి దొరికిందనుకున్న ఆమె… రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో హిజ్రా కమ్యూనిటీలో చేరింది.

మొదట్లో అంతా కొత్తగా అనిపించింది. తనను అర్థం చేసుకునే మనుషులు దొరికారనే సంతోషం కలిగింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ జీవితంలోని మరో కోణం కనిపించడం మొదలైంది. జీవనం కోసం వీధుల్లో భిక్షాటన చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర… దుకాణాల ముందు… చేయి చాచడం రోజువారీ జీవితంలో భాగమైంది.

ప్రతి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఒకే ప్రశ్న ఆమెను వెంటాడేది.

“నేను చదువుకుంటున్నాను… మరి నేను ఎందుకు భిక్షాటన చేయాలి?”

ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకలేదు. కానీ ఆ ప్రశ్నే ఒక నిర్ణయానికి దారి తీసింది. ఈ జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని… తనకు మరో అవకాశం వెతుక్కోవాలని అభినేత్రి నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం అంత సులభంగా ఏమీ రాలేదు. ఆమె విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆమె అమ్మాయిగా మారాలనుకుంటున్న వార్త కుటుంబాన్ని కుదిపేసింది. ఫోన్ చేసినా ఎవరూ మాట్లాడలేదు. ఒకరోజు తన నంబర్ బ్లాక్ అయిందని తెలిసింది. ఒక్కోసారి బంధాలు పెద్ద గొడవలతో ముగియవు. మౌనంతోనే ముగుస్తాయి. అభినేత్రి జీవితంలో కూడా అలాంటి మౌనమే మిగిలింది.

ఆ తర్వాత హైదరాబాద్ ఆమెకు ఇంకా కొత్తగా అనిపించింది. జనంతో నిండిపోయిన నగరంలో… తన కోసం ఎదురుచూసే ఒక్క మనిషి కూడా లేడు. ఉదయం లేచినా… రాత్రి పడుకున్నా… తన గురించి అడిగే ఒక ఫోన్ కాల్ కూడా వచ్చేది కాదు. అయినా జీవితం ఆగలేదు. రోజంతా ఎదురైన మాటలు… చూపులు… అవమానాలే కళ్ల ముందు తిరిగేవి.

కొన్నిసార్లు పుస్తకం మూసేసి చాలా సేపు అలాగే కూర్చుండిపోయేది. “ఇంకెంతకాలం ఇలా?” అనే ప్రశ్నకు సమాధానం కనిపించేది కాదు. అయినా మరుసటి రోజు మళ్లీ అదే ఉదయం… అదే ట్రాఫిక్ సిగ్నల్… అదే జీవితం.

అలాంటి రోజుల్లోనే అభినేత్రి జీవితంలో సబ్‌రంగ్ క్లినిక్ పరిచయమైంది. అక్కడ తొలిసారి తన గురించి ఎలాంటి భయం లేకుండా మాట్లాడగలిగింది. తనలాంటి జీవితాలను గడిపిన ఎంతోమందిని కలిసింది. వారి కథలు విన్న కొద్దీ… తాను ఒక్కదాన్నే కాదని అర్థమైంది. ఇన్నాళ్లూ మనసులో మోస్తున్న భయం కాస్త కాస్తగా తగ్గడం మొదలైంది.

కొంతకాలం తర్వాత హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించింది. అద్దంలో కనిపిస్తున్న రూపం కంటే… తన మనసులో ఎన్నాళ్లుగానో చూసుకుంటున్న రూపానికి దగ్గరవుతున్నాననే భావన ఆమెకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఆ నిర్ణయం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. డబ్బు సమస్యలు… ఆరోగ్య సమస్యలు… సమాజం చూపించే వివక్ష. అయినా ఆమె అడుగులు ఆగలేదు.

తర్వాత జెండర్ అఫర్మేషన్ సర్జరీ కూడా చేయించుకుంది. ఆ రోజు కోసం ఆమె చాలా సంవత్సరాలు ఎదురుచూసింది. శరీరంలో వచ్చిన మార్పు ఒక్కటే కాదు… తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించే హక్కు కూడా ఆ రోజుతో మరింత బలపడిందని అభినేత్రి చెబుతుంది.

అయితే ఒక్క వ్యక్తి జీవితంలో మార్పు వచ్చినంత మాత్రాన సమాజం వెంటనే మారిపోదు. ఉద్యోగం కోసం వెళ్లిన ప్రతిచోటా కొత్త ప్రశ్నలు ఎదురయ్యాయి. సర్టిఫికెట్లలో ఒక పేరు… జీవితంలో మరో పేరు. ప్రతి ఇంటర్వ్యూలో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ముందు… తన ఉనికినే వివరించాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్‌ల కోసం ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అభినేత్రి కూడా దరఖాస్తు చేసింది. ఎంపికైన రోజు… ఆమెకు ఉద్యోగం వచ్చిన రోజు మాత్రమే కాదు. ఎన్నేళ్లుగా తనను తాను నమ్ముకున్న నిర్ణయం వృథా కాలేదనే రోజు కూడా.

ఈరోజు హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ కనిపించే అభినేత్రిని చూసి చాలా మంది ఆమె గతాన్ని ఊహించలేరు. ఒకప్పుడు అదే రోడ్లపై చేయి చాచి నిలబడిందని కూడా తెలియదు. అయితే అభినేత్రి తన కథను ఉద్యోగంతో ముగించదు. భిక్షాటన చేయాలని ఏ ట్రాన్స్‌విమెన్ కోరుకోదు. అవకాశం లేక… దారి కనిపించక చాలామంది ఆ పరిస్థితిలోకి వెళ్తారు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తే… వాళ్ల జీవితాలు కూడా మారతాయని ఆమె చెబుతుంది.

ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్‌లకు విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సేవల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఆమె కోరుతోంది. రిజర్వేషన్లు అవసరమని కూడా చెబుతోంది. ఎందుకంటే ఒక అవకాశం… ఒక జీవితాన్ని ఎంతగా మార్చగలదో తన జీవితమే సాక్ష్యమని ఆమె నమ్ముతుంది.

ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేయి చాచిన ఆ యువతి… ఈరోజు అదే సిగ్నల్ దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రిస్తోంది. కానీ అభినేత్రి కథలో అసలు మార్పు ఉద్యోగం కాదు. ఒకప్పుడు తనను తాను దాచుకుని జీవించిన అమ్మాయి… ఈరోజు తలెత్తుకుని తన పేరుతో, తన గుర్తింపుతో, తన జీవితాన్ని జీవిస్తోంది. అదే ఆమె నిజమైన విజయం.

ALSO READ: ఒక చిన్న గులాబీ త్రిభుజం… ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన LGBTQ గుర్తు!


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *