జూన్ 28, 1969. అర్ధరాత్రి. అమెరికాలోని న్యూయార్క్ నగరం. క్వీర్ కమ్యూనిటితో స్టోన్‌వాల్ ఇన్(బార్) నిండిపోయి ఉంది. ఉన్నట్టుండి పోలీసులు దాడి చేశారు. నిజానికి అలాంటి దాడులు కొత్తగా ఏమీ జరగలేదు. అవమానాలు, అరెస్టులు కూడా కొత్త కాదు. ప్రతి దాడి తర్వాత తలదించుకుని వెళ్లిపోవడం… ప్రతి అవమానాన్ని మౌనంగా మింగేయడం…అప్పటి వరకు వాళ్ల జీవితంలో భాగమే. కానీ… ఆ రాత్రి చరిత్ర దారి మళ్లింది.
ఎప్పటిలాగే తలదించుకుని వెళ్లిపోవాలని ఎవరూ అనుకోలేదు. మొదటిసారి భయం వెనక్కి తగ్గింది. కోపం వీధుల్లోకి వచ్చింది. మౌనం నినాదాలుగా మారింది. ఇన్నాళ్లు సమాజం అంచుల్లో నిలబెట్టిన మనుషులు… అదే సమాజాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. పోలీసుల దాడికి ఎదురుగా నిలిచిన ఆ ప్రతిఘటన కొన్ని గంటలకే పరిమితం కాలేదు. ఒక నగరాన్ని దాటింది. ఒక దేశాన్ని దాటింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను తాకిన ఉద్యమంగా మారింది. ఆ రాత్రి చరిత్ర ఒక తేదీని గుర్తుపెట్టుకోలేదు… ఒక తిరుగుబాటును గుర్తుపెట్టుకుంది.
ఆ తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఇప్పటికి 57 ఏళ్లు గడిచిపోయాయి. ఒక బార్ బయట మొదలైన ఆ ప్రతిఘటన… ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పౌరహక్కుల ఉద్యమాల్లో ఒకటిగా మారింది. అందుకే ప్రతి ఏడాది జూన్ నెలను ప్రపంచవ్యాప్తంగా ప్రైడ్ మంత్‌గా నిర్వహిస్తారు. జూన్ 28ను ఇంటర్నేషనల్ LGBTQ ప్రైడ్ డేగా గుర్తు చేసుకుంటారు.
నిజానికి ఆ రాత్రి ఎవరూ ఉద్యమాన్ని ప్లాన్ చేయలేదు. ప్రపంచాన్ని మార్చేయాలని ఎవరూ రోడ్లపైకి రాలేదు. పోలీసుల దాడి మొదలైంది. సంవత్సరాలుగా పేరుకుపోయిన అవమానం ఒక్కసారిగా పేలిపోయింది. భయంతో తలవంచిన తలలు మొదటిసారి తల ఎత్తుకొని పోరాడాయి. దీన్నే స్టోన్‌వాల్ తిరుగుబాటుగా చరిత్ర చెబుతోంది. ఇదే ఆధునిక LGBTQ హక్కుల ఉద్యమానికి తొలి అధ్యాయంగా నిలిచింది.

పేర్లను, ప్రేమను దాచుకోవాల్సిన రోజులు:
1969కు ముందు ప్రపంచం చాలా భిన్నంగా ఉండేది. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించిన దేశాలు ఎన్నో. క్వీర్ కమ్యూనిటిపై పోలీసుల దాడులు, అరెస్టులు, ఉద్యోగాల నుంచి తొలగింపులు, కుటుంబాల నుంచి బహిష్కరణ లాంటివి రోజువారీ జీవితంలో భాగమే. చాలామంది తమ పేర్లను, తమ ప్రేమను, తమ గుర్తింపునే దాచుకుని బతకాల్సి వచ్చేది.
స్టోన్‌వాల్ తిరుగుబాటు తర్వాత ప్రపంచం నెమ్మదిగా మారడం మొదలైంది. 1970లో మొదటి ప్రైడ్ మార్చ్ జరిగింది. ఆ తర్వాత అమెరికా వీధుల నుంచి మొదలైన ఆ ఉద్యమం యూరప్‌ను చేరింది. ఆసియాను చేరింది. ఆఫ్రికాను చేరింది. నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది నగరాల్లో కోట్లాది మంది ప్రైడ్ మార్చ్‌లలో పాల్గొంటున్నారు. రంగుల జెండా ఒక కమ్యూనిటీకి మాత్రమే గుర్తుగా మిగలలేదు. అంగీకారం, సమానత్వం, గౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తుగా మారింది.
థర్డ్ జెండర్‌గా గుర్తింపు.. సెక్షన్ 377 రద్దు:
భారత్ కూడా ఈ ప్రయాణానికి మినహాయింపు కాదు. 2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్‌గా గుర్తిస్తూ చారిత్రాత్మక నాల్సా తీర్పు ఇచ్చింది. 2018లో సెక్షన్ 377లోని స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే నిబంధనను రద్దు చేసింది. తర్వాత ట్రాన్స్‌జెండర్ హక్కులకు సంబంధించిన చట్టం కూడా వచ్చింది. చట్టాలు మారాయి. హక్కులు విస్తరించాయి. చరిత్ర కొత్త పేజీలు తెరిచింది. అయినా ప్రతి పోరాటం ముగిసిపోయిందని చెప్పే పరిస్థితి ఇంకా రాలేదు. ఒక ట్రాన్స్‌జెండర్ ఉద్యోగానికి వెళ్తే అక్కడ అనుమానాల చూపులు వెంటాడుతున్నాయి. ఒక గే తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి ఇప్పటికీ భయపడుతున్నాడు. ఒక లెస్బియన్ తన జీవితాన్ని తనే ఎంచుకుంటే సమాజం ఇప్పటికీ ప్రశ్నిస్తోంది. చట్టాలు మారుతున్నాయ్ కానీ మనుషుల ఆలోచనల్లో మాత్రం మార్పు చాలా తక్కువే కనిపిస్తోంది.
స్టోన్‌వాల్ ఇన్ ఇప్పుడు ఉందా? సందర్శించవచ్చా?
అవును. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న స్టోన్‌వాల్ ఇన్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది అమెరికా జాతీయ చారిత్రక స్మారకంగా గుర్తింపు పొందింది. ప్రపంచం నలుమూలల నుంచి LGBTQ+ చరిత్రను తెలుసుకోవాలనుకునే వారు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.
ప్రపంచంలో ఏ దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి?
బ్రూనై, ఇరాన్, మౌరిటానియా, నైజీరియా (ఉత్తర రాష్ట్రాలు), సౌదీ అరేబియా, యుగాండా యెమెన్ లాంటి 60కు పైగా దేశాల్లో స్వలింగ సంపర్కంపై క్రిమినల్ చట్టాలు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో జైలు శిక్షలు ఉండగా, మరికొన్ని దేశాల్లో అత్యంత కఠినమైన శిక్షలు కూడా అమలులో ఉన్నాయి.
అందుకే ప్రైడ్ అంటే రంగురంగుల జెండాలు, రోడ్లపై జరిగే ర్యాలీలు మాత్రమే కాదు. ప్రతి మనిషి తన గుర్తింపును దాచుకోకుండా జీవించే స్వేచ్ఛ. తాను ప్రేమించిన వ్యక్తి చేయి పట్టుకుని నడిచే ధైర్యం. సమాజం తీర్పులకు భయపడకుండా తన జీవితాన్ని తనే ఎంచుకునే హక్కు. ప్రపంచం నలుమూలలా జరిగే ప్రతి ప్రైడ్ మార్చ్… ప్రతి ప్రైడ్ ఈవెంట్… ప్రతి ప్రైడ్ జెండా ఇదే సందేశాన్ని వినిపిస్తోంది.
స్టోన్‌వాల్ ఇన్ బయట మొదలైన ఆ రాత్రి తిరుగుబాటు… 57 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నడుస్తూనే ఉంది. రూపం మారింది. దేశాలు మారాయి. తరాలు మారాయి. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ప్రతి మనిషిని… మనిషిగానే చూడాలని ప్రపంచాన్ని అడగడం. అందుకే జూన్ 28కి ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. మౌనాన్ని నినాదంగా మార్చుకున్న రోజు ఇది. చరిత్ర అంచుల్లో నిలబెట్టిన జీవితాలు… తమ కథను తామే రాయడం మొదలుపెట్టిన రోజు కూడా.
ఇలా 57 ఏళ్ల క్రితం స్టోన్‌వాల్ ఇన్ బయట మొదలైన ఆ నినాదం… ఈరోజు హైదరాబాద్ వీధుల్లోనూ, ఢిల్లీ ప్రైడ్ మార్చ్‌లోనూ, ప్రపంచంలోని ప్రతి ప్రైడ్ వేడుకలోనూ వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ప్రతి తరం మళ్లీ మళ్లీ గుర్తు చేయాల్సిన ఒక సత్యం ఉంది. మనిషి తనలా బతకడానికి అనుమతి అవసరం లేదు… గౌరవం మాత్రమే అవసరం…జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వడానికి మనిషి బాధ్యత కూడా.
ALSO READ: “మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…” సమాజాన్ని న్యాయస్థానంలో నిలబెట్టిన ‘LGBT: A Legal Battle’

Sexual Orientation: స్వలింగ ఆకర్షణ సహజమేనా? దశాబ్దాల పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Queer Strories: నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లు.. ట్రాన్స్‌విమెన్ అభినేత్రి జీవితం చెబుతున్న పాఠం
Rudolf Brazda: ఒక చిన్న గులాబీ త్రిభుజం… ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన LGBTQ గుర్తు!
Satyagraha: నాడు స్వామి జ్ఞాన్ స్వరూప్..నేడు సోనమ్ వాంగ్‌చుక్.. ప్రభుత్వాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత భయం?
‘ప్రశ్నించడం తప్పే అయితే నేను ఆ తప్పును మళ్లీ మళ్లీ చేస్తా.. ప్రశ్నించడమే నేరమైతే నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తా’
Pronouns: ఎవరిని ఎలా పిలవాలి? ‘ఆమె’… ‘అతను’… ఈ చిన్న పదాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?