Menu

ప్రపంచంలోని తల్లులందరికీ ఆమె ‘కూతురే’ ..! ‘ముత్తుమణి’ పాటలో ఇళయరాజా పలికించిన ప్రేమ ఇదే!

Tri Ten B (Triya) 43 seconds ago
muthumani song

ఒక ట్రాన్స్ మహిళను అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు ఒక పాట చాలు. ఆమె జీవితాన్ని, ఆమె మనసులో దాచుకున్న బాధను, తనను తానుగా గుర్తించమని ప్రపంచాన్ని అడుగుతున్న ఆమె మౌనాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఇళయరాజా రాసి, కంపోజ్ చేసి, శ్వేతా మోహన్ పాడిన ‘ముత్తుమణి’ పాట వింటుంటే నాకు అలాంటి భావమే కలిగింది. డొరోథీ సినిమాలో సుబ్బు కోసం వెతుకుతున్నప్పుడు వినిపించే ఈ పాటను ఒక ప్రేమకథగా మాత్రమే వింటే ఒక అర్థం కనిపిస్తుంది. కానీ సుబ్బు జీవితాన్ని, ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనుషులను గుర్తుచేసుకుంటూ వింటే, ఈ పాటలో ట్రాన్స్ మహిళల జీవితాలను కూడా చూడగలుగుతాం.

ఈ పాటలోని ఒక భావం నన్ను బాగా కదిలించింది. ప్రపంచంలోని తల్లులందరికీ కూతురిగా పుట్టిన అమ్మాయి అనే అర్థం వచ్చే లిరిక్స్ మనసులో ఎన్నో ప్రశ్నలను రేపుతాయి. ఒక ట్రాన్స్ మహిళను తన కుటుంబం కూతురిగా అంగీకరించకపోవచ్చు. ఆమె తనను తాను ఎవరో చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. తన బిడ్డగా చూడటానికి నిరాకరించవచ్చు. అప్పుడు ఆమెకు ఈ ప్రపంచంలో చోటు లేదా? ఒక ఇంటి తలుపులు ఆమె కోసం మూసుకుపోతే, ప్రపంచంలోని తలుపులన్నీ కూడా మూసుకుపోవాలా? ఆమె కూడా ఈ ప్రపంచపు కూతురే కదా!

ఒక తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్టే, ఆమెను కూడా ఎవరో ఒకరు అక్కున చేర్చుకోవచ్చు. ఒక కుటుంబం ఆమెను అర్థం చేసుకోలేకపోయినా, మరొక కుటుంబంలాంటి మనసు ఆమెకు తోడుగా నిలవచ్చు. తన ఇంట్లోనే పరాయిదానిలా మారిన ఒక అమ్మాయికి, ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట తనను కూతురిగా చూసే మనిషి దొరికితే ఎంత బాగుంటుందో కదా! ఆమె తన ఉనికిని ప్రతిసారీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని ప్రపంచం ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా!

డొరోథీ సినిమాలో కూడా ఈ భావానికి దగ్గరగా అనిపించే ఒక మానవీయమైన కోణం ఉంది. సుబ్బును ఆదుకోవడానికి, ఆమెకు సహాయం చేయడానికి కార్తీ తల్లి ప్రయత్నిస్తుంది. ఆమెకు సుబ్బు తన కన్నకూతురు కాకపోవచ్చు. అయినా ఆమె బాధను అర్థం చేసుకోవడానికి, ఆమెకు తోడుగా నిలవడానికి ప్రయత్నిస్తుంది. ఒక తల్లి హృదయానికి ప్రేమించడానికి రక్తసంబంధమే ఆధారం కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భం గుర్తుచేస్తుంది. కీర్తి సురేష్ పోషించిన డొరోథీ పాత్ర కూడా అంతే. మనసుతో చూస్తే వాళ్లందరిలోనూ మనం ఒక కూతురిని చూడగలం. మనకు జన్మనిచ్చిన తల్లే కాకుండా, మన బాధను చూసి చలించిపోయే ప్రతి స్త్రీలోనూ అమ్మ లాంటి ఒక ఆప్యాయత ఉంటుంది.

ఒక కుటుంబం అంగీకరించకపోయినా, ప్రపంచం అంగీకరించగలదు. ఒక తల్లి తన బిడ్డను అర్థం చేసుకోలేకపోయినా, ఇంకొక తల్లి ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు. మనకు సంబంధం లేని ఒక మనిషి కోసం మనసు కదలవచ్చు. ఆమెకు సహాయం చేయాలని అనిపించవచ్చు. ఆమెను కూతురిగా చూడాలని అనిపించవచ్చు. మనుషుల మధ్య ఇంతకంటే అందమైన బంధం ఇంకేముంటుంది?

ఇక ఈ పాటలో నాకు మరింత లోతుగా తాకిన భావం మరొకటి ఉంది. పక్కనే ఉన్నప్పుడు ఆమెను చూడలేకపోయానని.. ఇప్పుడు ఆమె కోసం వెతుకుతున్నప్పుడు గుండె బరువెక్కిపోతోందంటూ ముత్తుమని పాట సాగుతుంది.

సుబ్బు పక్కనే ఉన్నప్పుడు అతనిలో ఉన్న ఆమెను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన కార్తి.. చివరిలో ఆమె కోసం వెతుకుతాడు. ఈ భావాన్ని ట్రాన్స్ మహిళల జీవితాల నుంచి చూస్తే.. మన చుట్టూ ఉన్న మనుషులను మనం ఎలా చూస్తున్నామనే ప్రశ్న ఎదురవుతుంది. మన పక్కనే ఒక ట్రాన్స్ మహిళ ఉండవచ్చు. వారితో రోజూ మాట్లాడుతూ ఉండవచ్చు . వారి నవ్వును చూడవచ్చు. వారితో కలిసి నడవవచ్చు. కానీ వారిలో ఉన్న అమ్మాయిని నిజంగా గుర్తించగలుగుతున్నామా?

మన కళ్లకు కనిపించే వ్యక్తిని చూడటం సులభం కానీ వారి మనసులోని బాధను చూడటం అంత సులభం కాదు. తనను తాను అర్థం చేసుకోవడానికి ఆమె ఎన్ని రాత్రులు ఏడ్చిందో మనకు తెలియకపోవచ్చు. తన కుటుంబానికి తన గురించి చెప్పడానికి ఎంత ధైర్యం కూడగట్టుకుందో తెలియకపోవచ్చు. తనను ప్రేమించే మనిషి కూడా తనలోని నిజమైన వ్యక్తిని గుర్తించలేకపోతున్నాడని ఆమె ఎంత బాధపడిందో తెలియకపోవచ్చు.

ఆమె మన పక్కనే ఉన్నా, ఆమె ప్రపంచంలో మనం లేకపోవచ్చు. మనం ఆమెతో మాట్లాడుతున్నా, ఆమె చెప్పాలనుకున్న అసలు మాటను వినకపోవచ్చు. ఆమెను చూస్తున్నా, ఆమె ఎవరో గుర్తించలేకపోవచ్చు. ఒక మనిషిని నిజంగా చూడటం అంటే కళ్లతో చూడటం మాత్రమే కాదు కదా.. మనసుతో కదా చూడాలి.. మరి ఈ ప్రపంచం ప్రతీ మనిషిని ఇంకా కళ్ళతోనే ఎందుకు చూస్తుంది?

ఇక ఇళయరాజా ఈ పాట రాయడం గురించి మొదటి నుంచే చాలా పెద్ద చర్చ జరిగింది. చనిపోయిన తన కూతురు కోసం ఈ పాటలో చాలా లిరిక్స్ ఉన్నాయని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు . అయితే సినిమా పరంగా ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలికోసం వెతుకుతున్న క్రమంలో వచ్చిన పాటగానే ఈ లిరిక్స్ చాలా మందికి అర్ధమై ఉండచ్చు . అయితే లోతుగా ఆలోచిస్తే మన పక్కనే ఉన్న మనిషిని సరిగ్గా గుర్తించలేకపోయిన పశ్చాత్తాపాన్ని కూడా మనం వినగలుగుతాం.

బహుశా ఈ పాటలోని ఆ బాధ ప్రతి ఒక్కరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు కానీ.. ఒక ట్రాన్స్ మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న తిరస్కరణను, తనలోని అమ్మాయిని గుర్తించమని కోరుకున్న క్షణాలను, తనను నిజంగా అర్థం చేసుకున్న ఒక మనిషి కోసం ఎదురుచూసిన రోజులను గుర్తుచేసుకుంటే, ఈ పాట ట్రాన్స్ మహిళలకు మరింత దగ్గరగా అనిపించవచ్చు.

‘ముత్తుమణి’ పాట నాకు గుర్తుచేసేది ఇదే. కొన్ని పాటలు మనకు తెలియకుండానే మన జీవితాలను ప్రతిబింబిస్తాయి. మనం ఎప్పటికీ ఎవరికీ చెప్పలేని బాధలను, మనసులోనే దాచుకున్న కన్నీళ్లను మనకు తెలియకుండానే బయటకు తీసుకొస్తాయి. ఎందుకంటే జెండర్ ఐడెంటిటీ అంటే శరీరం ఎలా ఉందన్నది కాదు, బయటికి ఎలా కనిపిస్తున్నామన్నది కూడా కాదు.. మనసు తనను తాను ఎవరిగా గుర్తించుకుంటుందన్నది. ఆ మనసును అర్థం చేసుకోలేకపోయిన ప్రపంచం, చివరికి ఆమె ఎవరో తెలుసుకునేలోపే, ఆమె గుండె ఎన్నిసార్లు ముక్కలై ఉంటుందో.. ఆ ముక్కలను ఏరుకుంటూ ఆమె ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడ్చి ఉంటుందో.. బహుశా ఆమెకు కూడా గుర్తుండకపోవచ్చు.

:- త్రియా


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *