Menu

“మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…” సమాజాన్ని న్యాయస్థానంలో నిలబెట్టిన ‘LGBT: A Legal Battle’

Tri Ten B (Triya) 2 months ago
LGBT a legal battle review telugu

“మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…”

‘LGBT: A Legal Battle’ సినిమాలో వినిపించే ఈ ఒక్క డైలాగ్‌ వేల సంవత్సరాలుగా వినిపించని ఎన్నో గొంతుల వేదన..!

అనాగరికతనే నాగరికతగా భావిస్తూ గొప్పలకు పోయే ఈ సమాజంలో.. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచే ఈ దేశంలో.. మచ్చుకైన మనిషితత్వం లేకపోయినా మానవత్వమే తమ మతంగా చెప్పుకునే ఈ పవిత్ర భారతదేశంలో అడగడుగునా అణచివేతకు గురవుతున్న LGBT కమ్యూనిటి ఆవేదనను కళ్లకు కట్టిన సినిమా ‘LGBT: A Legal Battle’

నిజానికి LGBT థీమ్‌తో ఇండియాలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. ఇలాంటి అంశాలపై సినిమాలు వస్తే చప్పట్లు కొట్టించుకోవడానికి కొన్ని సీన్లు, సానుభూతి పుట్టించడానికి కొన్ని డైలాగులు, సంచలనం కోసం కొన్ని పాత్రలు సరిపోతాయి. కానీ ‘LGBT: A Legal Battle’ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. సమాజం నిత్యం విసిరే ప్రశ్నలకే ఈ సినిమా ప్రశ్నలు సంధించింది. ట్రాన్స్‌జెండర్ అంటే ఎవరు? గే అంటే ఎవరు? లెస్బియన్‌ అంటే ఎవరు అనే స్థాయి దాటి.. ఒక మనిషిని మనిషిగా గుర్తించడానికి ఈ సమాజానికి ఇంకా ఎన్ని చట్టాలు కావాలి? ఎన్ని సుప్రీంకోర్టు తీర్పులు కావాలి? ఎన్ని జీవితాలు బలికావాలనే డిబెట్‌ను ప్రేక్షకుడి ముందుంచింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు సునీల్ కుమార్‌ రెడ్డి ఎంత హోమ్‌వర్క్‌ చేశారో, ఎంత రీసెర్చ్ చేశారో క్లియర్‌గా అర్థమవుతుంది.

ఈ సినిమాకు అసలైన బలం కథలో లేదు. కథను నడిపించిన ఆలోచనలో ఉంది. సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లను థర్డ్‌ జెండర్‌గా గుర్తించిన తీర్పు, సెక్షన్‌-377ను రద్దు చేస్తూ స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించిన చారిత్రక నిర్ణయం లాంటి అంశాలను దర్శకుడు కేవలం సమాచారంగా చెప్పలేదు. పాత్రల జీవితాలతో ముడిపెట్టాడు. చట్టం మారిన ప్రతిసారీ కొందరి జీవితాల్లో ఆశ ఎలా పుడుతుందో, అదే చట్టం ఆలస్యంగా రావడం వల్ల ఇంకొందరి జీవితాలు చీకట్లో ఎలా మగ్గిపోయాయో తెరపై చూపించాడు. చట్టం ఇచ్చిన గుర్తింపుకు, సమాజం ఇంకా నిరాకరిస్తున్న అంగీకారానికి మధ్య ఉన్న అగాధాన్ని క్రిస్టల్‌ క్లియర్‌గా చూపించాడు.

“నాది కాని శరీరంలో ఇరుక్కుపోయినట్టు ఉంది.. ఊపిరి ఆడనట్టుంది అమ్మా.”

ఈ ఒక్క డైలాగ్‌ మోహిని(హిమా రాథోడ్‌) పాత్రనే కాదు… ట్రాన్స్‌జెండర్ జీవితంలోని అత్యంత క్రూరమైన వాస్తవాన్ని చెబుతుంది. ట్రాన్స్‌జెండర్లను సమాజం శరీరంతో గుర్తిస్తుంది. వారి మనసు గురించి అడిగే తీరిక ఎవరికీ ఉండదు. ఆడుకోవాల్సిన వయసులో అవమానాలు… చదువుకోవాల్సిన వయసులో వివక్ష… గౌరవంగా ఉద్యోగం చేసుకోవాలనుకున్నా అడ్డంకులు. ఈ ప్రయాణంలో మోహిని ఎక్కడా జాలి అడగదు. ఒక అవకాశాన్ని మాత్రమే అడుగుతుంది.

“వాష్‌రూమ్‌కి వెళ్లాలంటే కూడా భయం సర్…”

ఈ ఒక్క డైలాగ్‌ విన్న తర్వాత ట్రాన్స్‌జెండర్ల జీవితాన్ని కొత్త కోణంలో చూడక తప్పదు. స్కూల్‌ వాష్‌రూమ్‌లో మొదలైన భయం… పెద్దయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటుందని దర్శకుడు చూపించిన తీరు గుండెను తాకుతుంది. స్కూల్‌లో అవమానించిన పిల్లలు, ప్రశ్నించాల్సిన టీచర్లు, తర్వాత ఉద్యోగం… చివరకు కోర్టు. ఇలా స్థలం మారుతుంది. మనుషులు మారుతారు. వివక్ష మాత్రం మారదు. సమాజం ఒక మనిషి గౌరవాన్ని ఎంతలా దోచుకుంటుందో ఈ ఒక్క సీన్ చెప్పేస్తుంది.

“నా కాళ్ల మధ్య ఏముందో వాళ్లకి ఎందుకు సర్… మనసులో ఏముందో అక్కర్లేదా?”

ఈ ప్రశ్నకు సినిమా సమాధానం చెప్పదు. సమాధానం చెప్పాల్సింది సమాజమే. ఒక మనిషిని వారి ఆలోచనలతో కాకుండా శరీరంతో కొలిచే మనస్తత్వంపై దర్శకుడు వేసిన అత్యంత బలమైన ప్రశ్న ఇదే. అందుకే ఈ డైలాగ్ థియేటర్‌లో చప్పట్లు కొట్టించదు. కొంతసేపు అంతులేని ఆవేదనను తీసుకొస్తుంది.

“It’s the most vulnerable community.”

పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఈస్టర్ నొరొన్హా చెప్పిన ఈ ఒక్క డైలాగ్ కోర్టు వాదనకు ప్రాణం పోస్తుంది. సమాజంలో చిట్టచివరి వర్గానికి న్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత అంటూ ఈస్టర్ వాదించే విధానం ఈ సినిమాకే అసెట్‌గా చెప్పవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో గే వ్యక్తిని పెళ్లి చేసుకుని, నిజం తెలియక ఒక బంధాన్ని కోల్పోయిన మహిళ… అదే బాధను కోపంగా మార్చుకోకుండా.. కోర్టులో చట్టం, రాజ్యాంగం, మానవత్వం వైపు నిలబడి వాదించడం ఆమె పాత్రకు ప్రత్యేకత.

“రోడ్డుపై అడుక్కునే ప్రతి ట్రాన్స్‌జెండర్ వెనుక ఒక తండ్రి చేసిన పాపం ఉంటుంది.”

మోహిని తండ్రి ఆనంద్ చక్రపాణి పాత్ర మొత్తం ఈ ఒక్క డైలాగ్‌లో ఉంటుంది. మొదట తన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన తండ్రి… చివరికి తన తప్పును ఒప్పుకుని సమాజం ముందే తలవంచుతాడు. ట్రాన్స్‌జెండర్లను రోడ్డుమీద చూసి అసహ్యించుకునే సమాజం… వాళ్లను ఆ రోడ్డుమీదికి ఎవరు నెట్టారనే ప్రశ్నను మాత్రం ఎప్పుడూ అడగదు. ఆ ప్రశ్నను ఈ సినిమా నేరుగా కుటుంబాల ముందుంచుతుంది.

ఇక ఎల్.బీ. శ్రీరామ్ పోషించిన జడ్జి పాత్ర ఈ సినిమాకు మరో పెద్ద బలం. తీర్పు చెప్పేముందు ట్రాన్స్‌జెండర్ల జీవితాలను తెలుసుకోవడం, వారితో కలిసి నడవడం, వారి బాధను అర్థం చేసుకోవడంలో ఎల్‌.బీ.శ్రీరామ్‌ జడ్జి పాత్రలో జీవించేశారు. న్యాయం పుస్తకాల నుంచి మాత్రమే పుట్టదని.. మనుషులను అర్థం చేసుకున్నప్పుడే పుడుతుందని దర్శకుడు చెప్పిన అందమైన ఆలోచన ఈ పాత్రకు రూపం ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ కనిపిస్తే మొదట కార్ విండో మూసేసిన వ్యక్తి… చివరికి “డాడీ” అని పిలిపించుకునే స్థాయికి చేరుకోవడం ఈ సినిమాలో ఎల్‌.బీ.శ్రీరామ్‌ పాత్రను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

27 లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘LGBT: A Legal Battle‘ సినిమా.. సమాజం ఇన్నాళ్లుగా చూడటానికి ఇష్టపడని జీవితాలను తెర మధ్యలో నిలబెట్టిన సినిమా. నిజజీవిత ట్రాన్స్‌జెండర్లకు తెరపై చోటివ్వడం చిన్న విషయమేమీ కాదు. ఇక సినిమా చివర్లో కోర్టు తీర్పును వినిపించకుండా ఆపేస్తారు. ఎందుకంటే ఈ కథలో చివరి తీర్పు చెప్పాల్సింది కోర్టులు కాదు.. సమాజం. పార్ట్‌-2లో న్యాయస్థానం తన తీర్పు చెప్పొచ్చు. అయితే ట్రాన్స్‌జెండర్లను, ‘గే’ను, లెస్బియన్‌ను..ఇలా ప్రతి జెండర్‌ను సమాజం అంగీకరించినప్పుడే ఈ కథకు నిజమైన ముగింపు దొరుకుతుంది.

ALSO READ: ఓ 24 ఏళ్ల అమ్మాయి గొంతు మతోన్మాదులను భయపెడితే..? విప్లవశ్రీ పేరు వింటే వారికి ఎందుకంత మంట?


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *