Menu

Pronouns: ఎవరిని ఎలా పిలవాలి? ‘ఆమె’… ‘అతను’… ఈ చిన్న పదాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Tri Ten B (Triya) 2 months ago
what are pronouns LGBTQ explained

ప్రపంచం మనిషిని మనిషిగా చూడదు. ముందుగా గుర్తింపునే చూస్తుంది. పేరు అడుగుతుంది. మతం అడుగుతుంది. కులం అడుగుతుంది. ఆ తర్వాత అబ్బాయా… అమ్మాయా అని చూస్తుంది. వీటి ఆధారంగానే ఆ మనిషిని ఎలా చూడాలో కూడా నిర్ణయించేస్తుంది. అయితే ప్రపంచం పట్టించుకొని మరో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచానికి జెండర్‌తో పనిలేదు. ప్రపంచం రాసుకున్న నిర్వచనాల కంటే… తమను తాముగా గుర్తించుకున్న జీవితాలే వారికి ముఖ్యం.

ప్రతి మనిషి జీవితంలో ఒక కనిపించని కోరిక ఉంటుంది. ప్రపంచం నన్ను నేను చూసుకున్నట్టే చూస్తే చాలు అనే కోరిక. ఆ కోరికకు చప్పట్లు అవసరం ఉండవు. గుర్తింపును గౌరవించే ఒక చూపు… మనసును అంగీకరించే ఒక పిలుపు చాలు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక జీవితాన్ని మార్చేది పెద్ద నిర్ణయాలు కావు. రోజూ మనం పలికే చిన్న చిన్న పదాలే. అక్కడి నుంచే ‘ప్రొనౌన్స్‘ కథ మొదలవుతుంది. ఇప్పుడు ఎవర్ని ఎలా పిలవాలి అనేది గౌరవానికి, అంగీకారానికి సంబంధించిన అంశంగా మారిపోయింది. ఉదాహరణకు ఒక మనిషి తనను తాను అమ్మాయిగా గుర్తించుకుంటున్నాడా..అబ్బాయిగా గుర్తించుకుంటున్నాడా అన్నదానిబట్టి వారిని ఏమని పిలవాలో నిర్ణయించుకోవాలి.

ప్రొనౌన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి?

భాష పుట్టినప్పటి నుంచి మనుషులు ఒకరినొకరు ఆమె, అతను లాంటి పదాలతోనే పిలుచుకుంటూ వచ్చారు. అయితే మారింది భాష కాదు. మనుషులను చూసే చూపు. గత శతాబ్దంలో LGBTQ హక్కుల ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వేగం పుంజుకున్న తర్వాత… ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లు, నాన్ బైనరీ వ్యక్తులు తమ జీవితాల గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. “మేము ఎవరో… మమ్మల్ని కూడా అలాగే చూడండి” అనే వారి గొంతు క్రమంగా యూనివర్శిటిలకు చేరింది. అక్కడి నుంచి కార్యాలయాలకు చేరింది. తర్వాత సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ వరకు వచ్చింది. ఈరోజు He/Him, She/Her, They/Them లాంటి పదాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి గుర్తులుగా మారాయి. సోషల్‌మీడియాలోనూ చాలామంది తమ ప్రొనౌన్స్‌ను బయోలో పెట్టుకుంటున్నారు.

He/Him, She/Her, They/Them అంటే ఏమిటి?

ఇవి ఇంగ్లిష్‌లో వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ప్రొనౌన్స్. He/Him సాధారణంగా పురుషులకు, She/Her మహిళలకు ఉపయోగిస్తారు. They/Themను కొందరు నాన్-బైనరీ వ్యక్తులు లేదా తమ జెండర్‌ను పురుషుడు లేదా మహిళగా మాత్రమే నిర్వచించుకోని వారు ఇష్టపడవచ్చు. ఒక వ్యక్తి చెప్పిన ప్రొనౌన్స్‌ను గౌరవించడం మర్యాదగా భావిస్తారు.

ఎవరైనా తమ ప్రొనౌన్స్ చెప్పకపోతే ఎలా సంబోధించాలి?

ఒక వ్యక్తి తమ ప్రొనౌన్స్‌ను చెప్పకపోతే, గౌరవంగా వారి పేరుతో సంబోధించడం లేదా మర్యాదపూర్వకంగా వారు ఏ ప్రొనౌన్స్‌ను ఇష్టపడతారో అడగడం మంచిది. తప్పుగా సంబోధించినట్లు తెలిసితే సరిదిద్దుకుని ముందుకు సాగడం సరైన విధానం.

ప్రతి మనిషి తన పేరు చెప్పుకున్నట్టే… తన గుర్తింపును కూడా చెప్పే హక్కు కలిగి ఉంటాడు. ఆ హక్కును గౌరవించే మొదటి అడుగే ప్రొనౌన్స్. అందుకే ఒక చిన్న పదం కొందరికి చిరునవ్వును ఇస్తుంది. అదే పదం తప్పుగా వినిపిస్తే… గుండెల్లో దాచుకున్న గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. బయటివాళ్లకు అది ఒక పిలుపు మాత్రమే. ఆ వ్యక్తికి మాత్రం తన ఉనికిని ప్రపంచం అంగీకరించిన క్షణం. ఈరోజు చాలా సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగుల పేర్లతో పాటు వారి ప్రొనౌన్స్‌ను కూడా నమోదు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. ప్రతి వ్యక్తి తనను తాను ఎలా గుర్తించుకుంటాడో… అదే గౌరవంతో పలకరించాలని ఆలోచిస్తున్నాయి.

చరిత్రలో కొన్ని విప్లవాలు రోడ్లపై మొదలైతే.. ఇంకొన్ని మనం రోజూ వాడే పదాల్లో మొదలవుతాయి. ప్రొనౌన్స్ కూడా అలాంటి మార్పులో భాగమే. ఒక చిన్న పిలుపు… ఒక చిన్న అంగీకారం… ఒక చిన్న గౌరవం.. జీవితానికి పెద్ద విజయంగా మారవచ్చు.. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లు కోరుకునేది గెలుపు కాదు.. అంగీకారం!

ALSO READ: “మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…” సమాజాన్ని న్యాయస్థానంలో నిలబెట్టిన ‘LGBT: A Legal Battle’


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *