Menu

EJS-Ramoji Rao: మీ బిల్డప్‌లు తగలెట్ట..! నాస్తిక రామోజీరావుని దేవుడిగా ఆరాధించే జర్నలిస్టుల గురించి సైకాలజీ ఏం చెబుతోంది?

Triya (Tri Ten B🏳️‍🌈) 15 hours ago
who is ramoji rao in telugu

రామోజీరావు తొక్క రాతల గురించి, తొక్కుడు పచ్చళ్ల గురించి, తొక్కుడు రాజకీయాల గురించి నేను మాట్లాడడంలేదు. ఈనాడు అనే సంస్థ తెలుగు జర్నలిజాన్ని ఎలా భ్రష్టు పట్టించిందో నేను చెప్పాలనుకోవడంలేదు. ఈ ఆర్టికల్‌ కేవలం ఈనాడు జర్నలిజం స్కూల్‌ పేరు చెప్పుకోని ప్రివిలేజ్‌గా ఫీల్ అవుతూ రామోజీరావుని వ్యక్తిగతంగా పూజించేవారి కోసమే. ఈ బానిస మనస్తత్వం లేనివారికి ఈ ఆర్టికల్‌లో విమర్శలు వర్తించవు.

ఒక వ్యక్తిని పూజించవచ్చా? పోని రాళ్లని రప్పలని పూజించవచ్చా? లేదంటే పరలోకంలో ఎవరో ఉన్నారనుకోని ఎవరో ఒకర్ని ఊహించుకోని పూజించవచ్చా? మీ పూజలు మీ ఇష్టమే కావచ్చు కానీ అసలు దేవుడే లేడని నమ్మే నాస్తిక రామోజీరావుని పూజించడం మాత్రం ఎంత విడ్డూరమో అనిపిస్తోంది. ఇలా పూజించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కమ్మోన్మాదం కారణమైతే.. కొందరు ఈనాడు జర్నలిజం స్కూల్‌(EJS) పూర్వ విద్యార్థులకు మాత్రం బానిసోన్మాదమే కారణం.

ఈనాడు జర్నలిస్టులు ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో చదివారు. అందులో తప్పేమీ లేదు. అక్కడ మీకు కొన్ని స్కిల్స్ నేర్పించి ఉండవచ్చు. దాని కారణంగా మీకు వృత్తిపరమైన నైపుణ్యాలు వచ్చి ఉండవచ్చు. మీ కెరీర్‌కి తొలి అడుగు అక్కడే పడి ఉండవచ్చు. నిజానికి ఉద్యోగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడోక్కడా తొలి కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో కొందరు గైడ్‌ చేసేవారూ ఉంటారు. ఇది ప్రతీ ఒక్కరికి జీవితంలో జరుగుతుంది. వారి పట్ల గౌరవం ఉండడం సహజమే కావచ్చు కానీ మీరేదో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినంత గొప్పగా ఫీలవుతూ, అక్కడ చదవని వాళ్లకంటే మీరేదో ప్రత్యేకమైన మేధావులమని భావించే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? ఈనాడు జర్నలిజం స్కూల్‌లో చదివినంత మాత్రాన మీరు ఆకాశం నుంచి ఊడిపడలేదు. మార్స్ నుంచి దిగిరాలేదు. జర్నలిజం అనేది ఒక సంస్థ ఇచ్చే బ్రాండ్‌తో నిర్ణయించే వృత్తి కూడా కాదు కదా. ఇప్పుడు 10టీవీలో ట్రైనీగా జాయిన్ అయిన వాళ్లంతా మై హోమ్ రామేశ్వరావుని దేవుడికి కొలవడంలేదు కదా..!

ఇంతకీ మీరంతా ఏ పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేస్తున్నారో మీకు తెలుసా? ఒక పెట్టుబడిదారుడు సంస్థను స్థాపిస్తాడు. తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉద్యోగులను నియమించుకుంటాడు. వాళ్లకు జీతాలు చెల్లిస్తాడు. మీరు మీ శ్రమను అమ్ముకుంటారు. కంపెనీ మీ శ్రమను ఉపయోగించుకుని వారి వ్యాపారాన్ని నడుపుకుంటుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో జరిగే సాధారణ ఆర్థిక లావాదేవీ. అంబానీ, అదానీ చేసే పని కూడా ఇదే. కానీ లక్‌ బాగుండడంతో మోదీ ఇప్పటివరకు అంబానీ బర్త్‌డేని దేశ పండుగగా ప్రకటించలేదు. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి సీఎం పదవి పొందిన సమయంలో తనకు అన్ని విధాల సహకరించిన రామోజీ కోసం చంద్రబాబు ఏదో ఒకటి చేయాలనుకున్నారు.

అందులో భాగంగానే రామోజీరావు కోసం మరో కమ్మ సోదరుడు కీరవాణితో ఒక పాట పాడించారు. అక్కడితో ఆగకుండా రామోజీరావు పుట్టినరోజును రాష్ట్ర ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని..ఆయన బర్త్‌డేని రాష్ట్ర పండుగగా ప్రకటించారు.

చంద్రబాబు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ.. EJSలో చదివినంతా మాత్రానా కొందరు జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించడమేంటి? గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు లాంటివారికే ఇలాంటి గౌరవం దక్కలేదు కదా.. వారి పేరు మీద రాష్ట్ర వేడుకలే ఉన్నాయి కానీ రాష్ట్ర పండుగలు లేవు. మీకు కనీసం ఈ ఆలోచన కూడా రాలేదా? మీ పనికి మీరు జీతం తీసుకుంటారు కానీ ప్రపంచంలో ఏ పెట్టుబడిదారుడు కూడా ఉచితంగా ఏమీ చేయడనే కనీస అవగాహన కూడా లేదా? ఈ విషయాన్ని మీకు EJSలో నేర్పించి ఉండకపోవచ్చు.. కేవలం తెలుగు భాషలో తప్పొప్పుల గురించే క్లాసులు పీకి ఉండవచ్చు. మన తోటి వారి దగ్గర చెట్టు పేరు చెప్పి కాయలు ఎలా అమ్ముకోవాలో వివరించి ఉండవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా స్పెల్లింగ్ మిస్టెక్స్‌ రాస్తే వారిని అవమానించేలా, అందరికీ కనపడేలా మెసేజీలు పెట్టాలని కూడా బోధించి ఉండవచ్చు.. సరే..ఇదంతా ఈనాడు స్కూల్‌ ట్రేడ్ మార్క్ టీచింగే కావచ్చు. అయితే ఈ వ్యక్తిపూజ సంగతేంటి?

సైకాలజీలో ఇలాంటి ప్రవర్తనను అథారిటీ బయాస్ (Authority Bias), హాలో ఎఫెక్ట్ (Halo Effect), హీరో వర్షిప్ (Hero Worship) లాంటి భావనలతో విశ్లేషిస్తారు. ఒక వ్యక్తి మనకు ఏదో ఒక సందర్భంలో అవకాశం ఇచ్చాడని, మన కెరీర్‌లో తొలి మెట్టు వేయడానికి కారణమయ్యాడని అతడిలోని ప్రతి చర్యను గొప్పగా చూడటం, అతడి నిర్ణయాలను ప్రశ్నించకుండా సమర్థించడం ఈ మానసిక ధోరణిలో భాగం. ఒక సంస్థతో ఉన్న అనుబంధం క్రమంగా ఆ సంస్థ యజమాని పట్ల వ్యక్తిగత విధేయతగా మారుతుంది.

సైన్స్‌లో దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన భావన కాగ్నిటివ్ డిసొనెన్స్ (Cognitive Dissonance). మనం బలంగా నమ్మిన వ్యక్తి లేదా సంస్థ గురించి మనకు వ్యతిరేకమైన వాస్తవాలు ఎదురైనప్పుడు, మన నమ్మకాన్ని మార్చుకోవడానికి బదులుగా ఆ వాస్తవాలను తిరస్కరించడం లేదా సమర్థించుకోవడం ఈ మానసిక సంఘర్షణలో కనిపిస్తుంది. అందుకే వ్యక్తిపూజ కొన్నిసార్లు విమర్శించాలనుకునే ఆలోచనను చంపేస్తుంది.

అయినా ఈ సైకాలజీ గోల మాకేందుకులే కానీ బీజేపీని భాజాపా అని, టీడీపీని తేదేపా అని రాసే మేధావి వర్గాలు రామోజీ రావుని రారా అని ఎప్పుడు పిలుస్తాయో చూడాలి మరి. ఇక ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా పేర్లను కూడా ట్రాన్స్‌లేట్ చేసే విద్యని నేర్పించిన రామోజీరావు స్కూల్‌కి కూడా ఏదో ఒక రోజు భారతరాత్న రావాలని ఆశిస్తూ…

:- త్రియా (PRAJADHWANI NEWS)

ALSO READ: ఆ ఛానెల్‌లో జీతాలు ఇవ్వరు…పైగా క్యాస్ట్ పిచ్చి..! పేరుకేమో IAS..చేసేదేమో దగా బిజినెస్..!


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *