ప్రశ్నించడం ఎప్పటి నుంచి నేరమైంది? ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నిస్తే ప్రత్యర్థి పార్టీ మనిషి అంటారు. మరో నాయకుడిని ప్రశ్నిస్తే అధికార పార్టీకి అమ్ముడయ్యాడంటారు. ఒక అంశంపై మాట్లాడితే కులం అంటగడతారు. ఇంకో అంశంపై మాట్లాడితే మతం అంటగడతారు. చివరికి ప్రశ్న వెనక్కి వెళ్లిపోతుంది. ప్రశ్నించిన మనిషే చర్చగా మారిపోతాడు. అందుకే ఇప్పుడు సమాధానాల కంటే తీర్పులు వేగంగా వస్తున్నాయి. వాదనల కంటే వ్యక్తిగత దాడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలోచనల కంటే ట్యాగులు బలంగా పనిచేస్తున్నాయి. అసలు ప్రశ్నను పక్కన పెట్టి, ప్రశ్నించిన వ్యక్తిని నిలబెట్టి విచారణ చేసే సంస్కృతి మన చుట్టూ సాధారణంగా మారిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల తరుఫున గళమెత్తే కొందరు ఇండిపెండెంట్ యూట్యూబర్లకు మత, కుల, ప్రాంత ట్యాగులు వేసే పని మొదలై సంవత్సరాలు దాటింది. ఇప్పుడా పైశాచికత్వం మరో మెట్టు ఎక్కి ఫొటో మార్ఫింగ్‌లు, దేశద్రోహ ముద్రలు వేసే స్థాయికి చేరింది
సబ్ఎడిటర్లు, రిపోర్టర్లు, ట్రాన్స్‌లేటర్లు, కెమెరామ్యాన్లు, యాంకర్లు తప్ప మచ్చుకైనా జర్నలిస్టులు కనిపించిన తెలుగు మీడియాలో ఇండిపెండెంట్ యూట్యూబర్లు చేస్తున్న వీడియోలను కూడా సహించలేని, భరించలేని స్థితిలో అటు పాలకులు, ఇటు ప్రజలూ ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను, తప్పిదాలను పూసగుచ్చినట్టు, ఆధారాలతో వివరించడం కూడా పాపంగా మారిపోయింది.
పార్టీలకు, భావజాలాలకు అతీతంగా బాధితుల పక్షాన మాత్రమే నిలబడుతూ వార్తలను రిపోర్ట్ చేసే తులసీ చందు, శ్రీనిధివిప్లవశ్రీ లాంటి జర్నలిస్టులను ‘ల’కారాలతో దూషించడం, వారికి మత, కుల గుర్తింపులు అంటగట్టడం రొటీన్‌గా మారిపోయింది. తులసీ చందు పేరు కెథరీన్ అంట..ఈ విషయం ఆమె తల్లికి, భర్తకు అయినా తెలుసో లేదో కానీ సోషల్‌మీడియా మేధావులు మాత్రం తులసీ పేరును అనేక రకాల క్రిస్టియన్ పేర్లగా మార్చి మార్చి ప్రచారం చేస్తున్నారు.
ఈ బాధ సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టులకే కాదు.. బాధితుల పక్షాన గొంతెత్తి గ్రౌండ్ రిపోర్టులు చేసే యువ జర్నలిస్టు విప్లవశ్రీని కూడా వెంటాడుతోంది. ఆమె చెప్పిన మాటలు అవసరం లేదు.. ఆమెది ఏ కులమో, ఏ మతమో అన్నదే అవసరంగా మారిపోయింది. మోదీని, రేవంత్‌రెడ్డిని ఓకే స్థాయిలో విమర్శించే విప్లవశ్రీకి విడ్డూరంగా సనాతన వ్యతిరేకి అంటూ ముద్రవేశారు. దళితుల పక్షాన, సమాజంలో చిట్టచివరి వర్గాల పక్షాన, పేదల పక్షాన ఆమె చేసిన వీడియోలు చూసి ఆమెకు ఒక కులం కార్డు అంటగట్టడం ఏనాడో జరిగిపోయింది. అయితే ఈ ఐడెంటీలు ఇచ్చే మహా మేధావులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే.. మీరు వాళ్లని క్రిస్టియన్లు అని పిలిచినా ముస్లింలు అని ముద్రవేసినా అది వారికి తిట్టుగా కనిపించదు.. ఎందుకంటే వారి జర్నలిస్టు మూలాలు సమానత్వం నుంచి పుట్టుకొచ్చాయి. మరి ఈ ట్యాగులు వేసే సోషల్ వారియర్స్‌కి దళితులన్నా, క్రిస్టియన్లు అన్నా అంత చిన్నచూపు దేనికో? వారి మతం ఈ వివక్షనే నూరిపోసి ఉండొచ్చు.
ప్రశ్నించడం తప్పే అయితే నేను ఆ తప్పును మళ్లీ మళ్లీ చేస్తా.. ప్రశ్నించమే నేరమైతే నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తా: విప్లవశ్రీ
నిజానికి ప్రశ్నలను అనుమానంతో చూడటం ఈ తరం కనిపెట్టిన అలవాటు కాదు. చరిత్ర పుటలు తిరగేస్తే ప్రతి యుగంలో అధికారాన్ని నిలదీసిన గొంతులపై ఏదో ఒక ముద్ర పడింది. రాజులను ప్రశ్నించిన వారిపై రాజద్రోహ ముద్ర పడింది. వలస పాలనను ఎదిరించిన వారిపై దేశద్రోహ కేసులు నమోదయ్యాయి. కాలం మారింది. రాజ్యాలు మారాయి. ప్రభుత్వాలు మారాయి. పదాలు కూడా మారాయి. అయితే ప్రశ్నించిన మనిషికి ఒక గుర్తింపు అంటగట్టాలనే మనస్తత్వం మాత్రం తరతరాలుగా ప్రయాణిస్తూనే ఉంది.
జర్నలిస్టులు చెప్పే ప్రతీ మాట నిజమని కాదు. ప్రతీ ప్రశ్న సరైందేనని కూడా కాదు. నిజానికి ఆ ప్రశ్న సరైందా, తప్పా అనే చర్చ ఎప్పుడూ జరగాలి. ఆధారాలతో ఖండించాలి. వాస్తవాలతో విభేదించాలి. కానీ ప్రశ్నను పక్కన పెట్టి ప్రశ్నించిన వ్యక్తినే విచారణకు నిలబెట్టే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.. ఎందుకంటే ట్యాగులు సత్యాన్ని నిరూపించవు. ముద్రలు వాస్తవాలను మార్చవు. వ్యక్తిగత దాడులు ప్రశ్నలను చెరిపేయవు. అవి తాత్కాలికంగా గొంతులను భయపెట్టవచ్చు కానీ ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయేది ఎప్పుడూ ప్రశ్నలేనని మర్చిపోవద్దు.

Kondapalli Ganesh: దొంగలు పడ్డ 6నెలలకు కుక్కలు మొరిగాయట.. కొండపల్లి గణేశ్ ఎపిసోడ్లో మీడియా తీరు ఇది!
Satyagraha: నాడు స్వామి జ్ఞాన్ స్వరూప్..నేడు సోనమ్ వాంగ్‌చుక్.. ప్రభుత్వాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత భయం?
Pronouns: ఎవరిని ఎలా పిలవాలి? ‘ఆమె’… ‘అతను’… ఈ చిన్న పదాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
ప్రశ్నను భరించలేకపోతేనే కాదు.. ప్రశ్నించడం చేతకాకపోయినా ప్రజాస్వామ్యం కూలిపోతుంది!
Indian Coming Out Day: ‘నేను నాలాగే ఉంటాను..’ భారతీయ LGBTQ చరిత్రలో చెరిగిపోని రోజు!
Explainer: నిర్లక్ష్యం… అవినీతి…పేరుకుపోయిన వైఫల్యాలు! ఇండియాలో ప్రాణాలకు విలువ లేదా?