Menu

Explainer: నిర్లక్ష్యం… అవినీతి…పేరుకుపోయిన వైఫల్యాలు! ఇండియాలో ప్రాణాలకు విలువ లేదా?

Praja Dhwani Desk 2 months ago
telugu explainers prajadhwani news

✨ Quick Read

  • నివారించగల ప్రమాదాల్లో వేలాది మరణాలు
  • రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద ప్రాణహాని
  • భద్రతలో వ్యవస్థ వైఫల్యాలపై ప్రశ్నలు

AI-assisted summary, newsroom reviewed

‘నాన్న… నన్ను కాపాడండి…!’ అవి ఆ కొడుకు చివరి మాటలు. మంటలు క్షణక్షణాన దగ్గరవుతున్నాయి. పొగ ఊపిరిని బంధిస్తోంది. బయటపడే దారి కనిపించడం లేదు. చివరి ఆశతో తండ్రికి ఫోన్ చేశాడు. ఆ తండ్రి చేతిలో ఫోన్ ఉంది… కానీ తన బిడ్డ చేతిని పట్టుకుని కాపాడే అవకాశమే లేదు. ఆ క్షణంలో ఆ యువకుడిని రక్షించాల్సిన వ్యవస్థ పూర్తిగా చేతులెత్తేసింది.

లక్నోలోని ఎనిమేషన్‌ స్టూడియో బిల్గింగ్‌లోకి తమ భవిష్యత్తు కోసం అడుగుపెట్టిన 15 మంది యువకులు… శవాలుగా బయటకు వచ్చారు. నిర్లక్ష్యం… అవినీతి… నిబంధనలను పట్టించుకోని వ్యవస్థ… సంవత్సరాలుగా పేరుకుపోయిన వైఫల్యాలు వారి చావుకు కారణాలుగా నిలుస్తున్నాయి. కేవలం లక్నో ఘటనే కాదండి.. ఇండియాలో మనిషి ప్రాణానికి ఏ మాత్రం విలువలేదని చెప్పే లెక్కలు చాలానే ఉన్నాయి.

NV స్టాట్స్ లెక్కలు ఏం చెబుతున్నాయ్?

ప్రతిరోజూ మనం చదివే వార్తల్లో ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం… మరోచోట అగ్నిప్రమాదం… ఇంకెక్కడో భవనం కూలిన ఘటన… పరిశ్రమల్లో పేలుళ్లు… రైలు ప్రమాదాలు… ప్రకృతి విపత్తులు… ఇలా ఏదో ఒక రూపంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. వీటిలో చాలా ప్రమాదాలను ముందే అడ్డుకునే అవకాశం ఉన్నవే. అయినా ప్రతి ఏడాది వేలాది కుటుంబాలు శాశ్వతంగా తమ వాళ్లను కోల్పోతున్నాయి.

వీటన్నింటిలో అత్యంత భయంకరమైనది రోడ్డు ప్రమాదాలు. ఎందుకంటే అగ్నిప్రమాదాలు, భవనాలు కూలిపోవడం, పరిశ్రమల ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు… ఇవన్నీ కలిపినా రోడ్లపై కోల్పోతున్న ప్రాణాల సంఖ్యకు దగ్గర కూడా రావు. 2024లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో లక్షా 77 వేల మంది చనిపోయారు. అంటే ప్రతి రోజూ సగటున 485 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు దాదాపు 20 మంది.. ఇది అంతకముందు ఏడాదితో పోలిస్తే 2.3శాతం ఎక్కువ. ఒకరోజు కాదు… ఒకవారం కాదు… సంవత్సరాలుగా ఇదే కథ కొనసాగుతోంది.

హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (HDI) అంటే ఏమిటి?

హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది ఒక దేశంలోని ప్రజల ఆరోగ్యం, విద్య, ఆదాయం, జీవన ప్రమాణాలు, సగటు ఆయుష్షు వంటి అంశాల ఆధారంగా ఐక్యరాజ్యసమితి రూపొందించే సూచీ. దేశ అభివృద్ధిని ఆర్థిక వృద్ధితో పాటు మానవ అభివృద్ధి కోణంలో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

‘వాల్యూ ఆఫ్ స్టాటిస్టికల్ లైఫ్’ (VSL) అంటే ఏమిటి?

వాల్యూ ఆఫ్ స్టాటిస్టికల్ లైఫ్ (VSL) అనేది ఒక వ్యక్తి ప్రాణానికి ధర నిర్ణయించడం కాదు. రోడ్డు భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల నివారణ వంటి చర్యల ద్వారా ముందస్తు మరణాలను తగ్గించడానికి ఒక దేశం లేదా సమాజం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందో అంచనా వేయడానికి ఉపయోగించే ఆర్థిక ప్రమాణం.

మరోవైపు ప్రకృతి విపత్తుల గణాంకాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన NV-స్టాట్స్ ఇండియా నివేదిక ప్రకారం 2023-24లో తీవ్ర ప్రకృతి ఘటనల్లో 2,616 మంది మరణించారు. 2024-25లో ఈ సంఖ్య 3,080కి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 18 శాతం పెరుగుదల కనిపించింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం.

మరోవైపు 2025 జూలై, ఆగస్టు నాటికే హైడ్రో మెటిరియోలాజికల్ విపత్తుల్లో 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కలు కూడా అదే చిత్రాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతి శక్తుల కారణంగా 2023లో 6,444 మంది చనిపోగా… 2024లో ఈ సంఖ్య 7,903కి పెరిగింది. వీటిలో అత్యధిక మరణాలకు కారణం పిడుగులు. ఇక వడదెబ్బతో చనిపోతున్న వారి సంఖ్య మాత్రం ఒక్క ఏడాదిలోనే రెట్టింపుకు పైగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో వెనకబడిన ఇండియా:

ఒక దేశం తన ప్రజల జీవితాలను ఎంత బాగా కాపాడుతోందనేది తెలుసుకోవడానికి మరో కొలమానం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్. ఆరోగ్యం, విద్య, ఆదాయం, జీవన ప్రమాణాలు, ఆయుష్షు లాంటి అంశాల ఆధారంగా రూపొందించే ఈ సూచీలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన 2025 నివేదిక ప్రకారం… 193 దేశాల్లో భారత్ 130వ స్థానంలో ఉంది.

నిజానికి ఆయుష్షు కూడా ఒక ముఖ్యమైన సూచికే. ఎందుకంటే మంచి వైద్యం, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, జీవన ప్రమాణాలు… ఇవన్నీ ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడో ప్రభావితం చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ సగటు ఆయుష్షు 71 సంవత్సరాలు ఉండగా.. భారతీయుల సగటు ఆయుష్షు 67.3 సంవత్సరాలుగా ఉంది. ఇటు ఆర్థిక శాస్త్రంలో వాల్యూ ఆఫ్ స్టాటిస్టికల్ లైఫ్ అనే ఒక భావన ఉంది.

ఒక మనిషి ప్రాణానికి ధర కట్టడం దీని ఉద్దేశం కాదు. ముందస్తు మరణాలను తగ్గించడానికి ఒక సమాజం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది… సురక్షితమైన రోడ్లు, కఠినమైన భవన నిర్మాణ నిబంధనలు, మెరుగైన వైద్య సదుపాయాలు, సమర్థవంతమైన భద్రతా వ్యవస్థల కోసం ఎంత ఖర్చు చేస్తోందనే విషయాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రమాణం.

ఈ లెక్కల్లో కూడా ఇండియా చాలా చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉంది. కేవలం 0.9 మిలియన్ డాలర్లే ఖర్చు చేస్తుంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఇలాగే జరుగుతుందని చాలామంది అంటుంటారు. కానీ అదే వాదన చైనా దగ్గర నిలబడదు. జనాభాలో భారత్‌కు దాదాపు సమానంగా ఉన్న చైనా… మెరుగైన ఆయుష్షును నమోదు చేసింది. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లోనూ భారత్ కంటే ముందుంది. అంటే సమస్య జనాభా పరిమాణంలో లేదు. ఆ జనాభాకు తగిన స్థాయిలో వ్యవస్థలు ఎదగకపోవడంలో ఉంది.

లక్నోలో తన తండ్రికి చివరిసారి ఫోన్ చేసిన ఆ యువకుడు కథ లక్షలాది భారతీయుల కథను గుర్తు చేస్తోంది. నివారించగల ప్రమాదాలు మళ్లీ మళ్లీ ప్రాణాలను బలితీసుకుంటున్నాయంటే… అది విధి రాసిన తీర్పు అని చెప్పే కంటే, వ్యవస్థ రాసుకున్న వైఫల్యాలనే నిజాన్ని ఒప్పుకోవడం ఎంతో ఉత్తమం.

ALSO READ: మహిళల ఆరోగ్యాన్ని కుటుంబాలు ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నాయా? కొత్త సర్వేలో బయటపడ్డ నిజాలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *