Menu

Health News: మహిళల ఆరోగ్యాన్ని కుటుంబాలు ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నాయా? కొత్త సర్వేలో బయటపడ్డ నిజాలు!

Praja Dhwani Desk 2 months ago
indian health women survey

✨ Quick Read

  • మహిళల్లో అనారోగ్యం.. చికిత్సలో వెనుకబాటు
  • వృద్ధ మహిళల ఆస్పత్రి చేరిక అత్యల్పం
  • ప్రైవేట్ చికిత్సతో భారీ ఆర్థిక భారం

AI-assisted summary, newsroom reviewed

అనారోగ్యం ఒకటే… కానీ చికిత్స ఒకేలా లేదు. బాధ ఒకటే… కానీ ఆస్పత్రి గుమ్మం అందరికీ ఒకేలా తెరుచుకోవడం లేదు. శరీరం ఇచ్చే సంకేతాలు ఒకటే… కానీ వాటికి లభించే వైద్యం మాత్రం లింగాన్ని బట్టి మారుతోంది. డియాలో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు కానీ ఆస్పత్రి పడకలపై కనిపించేది మాత్రం ఎక్కువగా పురుషులే. దేశ ఆరోగ్య వ్యవస్థలో దాగి ఉన్న లింగ వివక్షకు అద్దం పట్టేలా కొన్ని లెక్కలు బయటకొచ్చాయి. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన హెల్త్ సర్వే చూస్తే భారత్‌లో మహిళల పట్ల ఉన్న వివక్ష ఎంత ఘోరంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

భారత ప్రభుత్వ జాతీయ గణాంకాల కార్యాలయం నిర్వహించిన హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ హెల్త్ సర్వే-2025 ప్రకారం దేశవ్యాప్తంగా మహిళల్లో 14.4 శాతం మంది తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో పురుషుల్లో ఈ సంఖ్య 11.8 శాతం మాత్రమే. అంటే ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 14 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వారు స్వయంగా చెప్పారు.

మహిళలు అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రికి ఎందుకు వెళ్లడం లేదు?

కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యాన్ని చివరి ప్రాధాన్యంగా చూడడం, నిర్ణయాధికారం లేకపోవడం వంటి సామాజిక కారణాల వల్ల చాలా మంది మహిళలు చికిత్సను ఆలస్యం చేస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో ఆరోగ్య సేవల్లో లింగ అసమానత తగ్గాలంటే ఏం చేయాలి?

మహిళలకు సమయానికి వైద్య పరీక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సేవలు, ఆరోగ్య బీమా విస్తరణ, కుటుంబాల్లో మహిళల ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు కీలకమని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఆస్పత్రిలో చేరికల విషయానికి వస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. దేశవ్యాప్తంగా పురుషుల ఆస్పత్రి చేరిక రేటు 3శాతం ఉండగా మహిళల్లో అది 2.8 శాతమే నమోదైంది. అంటే అనారోగ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు ఆస్పత్రి సేవలను తక్కువగా వినియోగిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. గ్రామాల్లో పురుషుల ఆస్పత్రి చేరిక రేటు 2.9 శాతం ఉండగా మహిళల్లో అది 2.6 శాతంగా నమోదైంది.

పట్టణాల్లో వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా డిఫరెన్స్‌ పూర్తిగా తగ్గలేదు. పట్టణాల్లో పురుషుల చేరిక రేటు 3.3 శాతం ఉండగా.. మహిళల్లో 3.2 శాతంగా ఉంది. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రి చేరిక రేటు 2.7 శాతం ఉండగా పట్టణాల్లో అది 3.2 శాతంగా నమోదైంది. వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల లభ్యత, రవాణా సౌకర్యాలు పట్టణాల్లో మెరుగ్గా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా సర్వే చెబుతోంది. ఈ లెక్కలు చూస్తే మహిళల వైద్య అవసరాలు పూర్తిగా తీరడం లేదనే విషయం అర్థమవుతుంది.

అనారోగ్యం ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకపోవడం, సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించకపోవడం, వ్యాధిని నిర్ధారించడంలో ఆలస్యం కావడం లేదా చికిత్స పూర్తి స్థాయిలో అందకపోవడం లాంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సర్వే విశ్లేషిస్తోంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిమితులు, సామాజిక పరిస్థితులు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం లాంటి అనేక కారణాలు దీనికి దోహదపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వయస్సు ఆధారంగా చూస్తే 60 ఏళ్లు దాటిన వారిలో ఈ గ్యాప్ మరింత స్పష్టంగా కనిపించింది. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషుల్లో ఆస్పత్రి చేరిక రేటు 9.3 శాతం ఉండగా అదే వయస్సు మహిళల్లో కేవలం 6.9 శాతం మాత్రమే నమోదైంది.

కుటుంబ సభ్యుల ప్రాధాన్యత, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవడం లాంటి కారణాలు దీనికి కారణమై ఉండవచ్చు. మరోవైపు 45 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు, మహిళల్లో ఆస్పత్రి చేరిక రేటు సమానంగా 4.2 శాతంగా నమోదవడం కూడా ఆసక్తికర అంశంగా నిలిచింది. ఆస్పత్రిలో చేరడానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే 60 ఏళ్లు దాటిన వారిలో గుండె సంబంధిత వ్యాధులే మొదటి స్థానంలో ఉన్నాయి.

ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు, కంటి సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక మానసిక, నరాల సంబంధిత వ్యాధులు దాదాపు అన్ని వయస్సుల వారిలో ఆస్పత్రి చేరడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతలో కూడా మానసిక ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని సర్వే హెచ్చరిస్తోంది. ఈ సర్వే మరో కీలక అంశాన్ని కూడా బయటపెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రులనే ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఎంచుకుంటున్నారు. పట్టణాల్లో ఈ సంఖ్య 65శాతానికి చేరింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజల నమ్మకం ఇంకా ప్రైవేట్ రంగంపైనే ఎక్కువగా ఉంది.

అయితే ఈ నిర్ణయం కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకసారి ఆస్పత్రి చికిత్స కోసం కుటుంబం సగటున 6,631రూపాయలు ఖర్చు చేస్తే అదే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో 50 వేల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చు ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఆరోగ్య బీమా లేని కుటుంబాలకు ఇది మరింత భారంగా మారుతోంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా సుమారు లక్షా 40వేల కుటుంబాలను కలుపుకొని నిర్వహించిన ఈ సర్వే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. భారత్‌లో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వారికి సమాన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.

ముఖ్యంగా వృద్ధ మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబాల్లో మహిళల ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఈ లెక్కలు మారే అవకాశం ఉంటుంది. లేదంటే అనారోగ్యాన్ని భరిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది..ఇది కుటుంబానికి ఏ మాత్రం మంచిది కాదు.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *