Menu

Satyagraha: నాడు స్వామి జ్ఞాన్ స్వరూప్..నేడు సోనమ్‌ వాంగ్‌చుక్‌.. ప్రభుత్వాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత భయం?

Tri Ten B (Triya) 16 hours ago
who is sonam wangchuk and GD agarwal

2018లో గంగా నది ప్రక్షాళన కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన జీడీ అగర్వాల్(స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్) ఈ రోజు నాకు మళ్లీ గుర్తొస్తున్నారు. కారణం సోనమ్ వాంగ్ చుక్..! అప్పుడూ ఒక మనిషి తన శరీరాన్నే సత్యాగ్రహంగా మార్చుకున్నాడు. ఇప్పుడూ మరో మనిషి అదే మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడూ రాజ్యం తన దారిలోనే సాగింది. ఇప్పుడూ ప్రభుత్వాల తీరు మారినట్టు అనిపించడం లేదు. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న పుట్టింది. ఇప్పటికీ అదే ప్రశ్న నన్ను వెంటాడుతోంది. ఈ రాజ్యాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత అసహనం? చేతిలో ఆయుధం పట్టిన మనిషి కంటే, ఖాళీ కడుపుతో ప్రశ్నించే మనిషే రాజ్యాలను, రాజులను ఎక్కువ కలవరపెడుతున్నాడా? చరిత్రను తిరగేస్తే నాకు మళ్లీ మళ్లీ ఇదే నిజమనిపిస్తోంది.

జీడీ అగర్వాల్ ఎవరు?

జీడీ అగర్వాల్ అంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది ఒక పర్యావరణ శాస్త్రవేత్త. దేశంలో కాలుష్య నియంత్రణ వ్యవస్థ నిర్మాణానికి సేవలందించిన వ్యక్తి. జీవితంలో ఎన్నో గుర్తింపులు పొందిన తర్వాత గంగా నదిని కాపాడడమే తన చివరి లక్ష్యంగా ఎంచుకున్నారు. గంగా ప్రవాహానికి హాని కలిగించే ప్రాజెక్టులను పునరాలోచించాలని కోరుతూ నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. నిరాహార దీక్ష ఏకంగా 111వ రోజుకు చేరుకుంది. ఆరోగ్యం అప్పటికే క్షీణించింది. పాలకుల్లో చలనం కూడా రాలేదు. చివరకు అక్టోబర్ 11, 2018న ఆయన ప్రాణం ఆ పోరాటానికే అంకితమైంది. ఒక నది కోసం ఒక మనిషి తన జీవితాన్ని అర్పించడం చరిత్రలో అరుదైన ఘటనగా నాకు కనిపిస్తుంది.

జీడీ అగర్వాల్ గురించి చదివినప్పుడల్లా నా ఆలోచనలు పొట్టి శ్రీరాములు దగ్గరకు వెళ్లిపోతాయి. తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఆకాంక్షను తన శరీరంతో మోసిన ఆయన.. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఆర్పించారు. ఆయన మరణం నాటి పాలకుల గుండెల్లో భూకంపాన్ని సృష్టించింది. అది చివరకు దేశ పటాన్నే మార్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. ఒక మనిషి సంకల్పం కోట్ల మంది ఆకాంక్షగా మారినప్పుడు చరిత్ర కూడా దారి మార్చక తప్పదని ఆ ఉద్యమం నిరూపించింది.

అన్నా హజారే ఉద్యమం మరోసారి నిరాహార దీక్ష శక్తిని దేశానికి గుర్తు చేసింది. అవినీతికి వ్యతిరేకంగా బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కావాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన దీక్ష దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన తెచ్చింది. యువత వీధుల్లోకి వచ్చింది. ప్రజల మద్దతు పెరిగింది. చివరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చి హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ప్రతి డిమాండ్ వెంటనే నెరవేరకపోయినా, ఒక వ్యక్తి సంకల్పం దేశవ్యాప్త చర్చగా మారిన అరుదైన సందర్భాల్లో అది ఒకటి.

అందుకే ఈ రోజు సోనమ్ వాంగ్ చుక్‌ను చూస్తుంటే నాకు ఈ చరిత్రలన్నీ ఒకేసారి గుర్తుకొస్తున్నాయి. నీట్ పరీక్షలపై వచ్చిన వివాదాల తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు సమాధానాలు కోరుతూ ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. 20 రోజులుగా(జులై 17నాటికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 10కిలోల బరువు కోల్పోయారు. ఆర్గన్‌ ఫెయిల్యూర్‌ ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కండరాలు బలహీనపడుతున్నాయి. అయినా పాలకుల్లో చలనం లేదు.

నిరాహార దీక్ష గురించి నేను ఎంత ఆలోచించినా ఒక విషయమే నాకు అర్థమవుతోంది. ఈ పోరాటం ఎవరినీ గాయపరచదు. ఎవరి ప్రాణమూ తీయదు. ఎవరి ఇంటిని బుల్డోజర్లతో కూల్చదు. తన బాధను సమాజం ముందుంచుతుంది. తన ప్రశ్నను ప్రజల ముందుంచుతుంది. అందుకే ఈ మార్గం ఎప్పుడూ నాకు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య ఆయుధంగా కనిపిస్తుంది. ఒక మనిషి తన శరీరాన్నే వాదనగా మార్చుకున్నప్పుడు, అతని డిమాండ్లతో ఏకీభవించకపోయినా, అతను లేవనెత్తిన ప్రశ్నలను వినే బాధ్యత సమాజంపైన కూడా ఉంటుంది.

ఈ కథలన్నీ చదివిన తర్వాత నా మనసు చివరకు ఒక్క మనిషి దగ్గరే ఆగిపోతుంది. మహాత్మా గాంధీ. ఈ దేశానికి ఆయన ఇచ్చిన గొప్ప ఆయుధం ‘నిరాహార దీక్ష.’ ఒక మనిషి తన శరీరాన్నే ప్రశ్నగా మార్చగలడని, తన ఆకలినే ఉద్యమంగా మలచగలడని ప్రపంచానికి చూపించిన తత్వం. ఆ మార్గంలోనే పొట్టి శ్రీరాములు నడిచారు. జీడీ అగర్వాల్ నడిచారు. ఈ రోజు సోనమ్ వాంగ్ చుక్ కూడా అదే సత్యాగ్రహాన్ని నమ్మి కూర్చున్నారు. అందుకే నాకు ఇప్పటికీ ఒకే భావన కలుగుతోంది. కాలాలు మారినా, పాలకులు మారినా, సమస్యలు మారినా, మహాత్మా గాంధీ చూపించిన నిరాహార దీక్ష అనే ఆయుధానికి ప్రత్యామ్నాయం ఇంకా ఈ దేశం కనిపెట్టలేకపోయింది.

: త్రియా (Prajadhwani Telugu)


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *