Menu

ప్రశ్నను భరించలేకపోతేనే కాదు.. ప్రశ్నించడం చేతకాకపోయినా ప్రజాస్వామ్యం కూలిపోతుంది!

Tri Ten B (Triya) 2 months ago
who is youtuber prashna raavan

“తీవ్రమైన విప్లవకారుడే, విప్లవం ముగిసిన మరుసటి రోజే సంప్రదాయవాదిగా మారిపోతాడు..”

ఎన్నో దశాబ్దాల క్రితం తత్వవేత్త హన్నా అరెండ్ చెప్పిన ఈ మాట కాలాన్ని దాటి బతుకుతోంది. నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయే ఈ మాట వెనుక ఎంతో లోతైన అర్థం దాగుంది. అధికారాన్ని ఎదిరించినవాళ్లే, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత అదే అధికార భాష మాట్లాడతారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన నాయకులే ప్రశ్నలను సహించలేకపోతారు. పదే పదే అరెస్టులు చేయిస్తారు. దేశద్రోహ చట్టాలను ప్రయోగిస్తారు..చరిత్రలో ఎన్నోసార్లు జరిగిన ఈ రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపిస్తున్నాయి. యూట్యూబర్‌ రావణ్‌ అరెస్టుల ఎపిసోడ్‌ దీనికి అతిపెద్ద ఉదాహరణ.

అధికారం మనిషిని మారుస్తుందా, లేదా మనిషిలో దాగి ఉన్న స్వభావాన్ని బయటకు తీస్తుందా అనే ప్రశ్నకు చరిత్ర ఇప్పటికీ సమాధానం వెతుకుతూనే ఉంది. ప్రతి కాలంలో కొత్త నాయకులు వస్తారు. కొత్త నినాదాలు వినిపిస్తాయి. కొత్త ఆశలూ పుడతాయి.. కానీ అధికారం చుట్టూ తిరిగే స్వార్థపరుల స్వభావం మాత్రం పదేపదే ఒకే పాఠాన్ని గుర్తు చేస్తుంది. అధికారాన్ని సవాలు చేస్తూ ప్రారంభమైన ప్రయాణం, అధికారం నిలబెట్టుకునే ప్రయాణంగా మారిన ఉదాహరణలు ప్రపంచ చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి.

ఈ మానవ స్వభావాన్నే మరో తత్వవేత్త ఫ్రెడ్రిక్ నీషే మరో కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. హన్నా అరెండ్ అధికారం మనిషిని ఎలా మారుస్తుందో హెచ్చరిస్తే, ఫ్రెడ్రిక్ నీషే ఒక గుంపు మనస్తత్వం మనిషిని ఎలా మారుస్తుందో చెప్పాడు. ఒక వ్యక్తి ఒంటరిగా ఆలోచించినప్పుడు తన అభిప్రాయాలకు తూకం వేసుకుంటాడు. తనను తానే ప్రశ్నించుకుంటాడు. అదే వ్యక్తి ఒక గుంపులో భాగమైనప్పుడు ఆలోచన స్థానాన్ని ఆవేశం ఆక్రమించే అవకాశముందంటాడు నీషే.

రావణ్‌ను ఎందుకు అరెస్టు చేశారు?

జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావ సభలో యూట్యూబర్‌ రావణ్‌ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారానికి దారితీశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గతంలో చెప్పిన డైలాగులనే రావణ్‌ ఇమిటేట్ చేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రతీ కేసులోనూ రావణ్‌కు కోర్టులు బెయిల్ మంజురు చేశాయి. ఇక చివరగా UAPA చట్టాన్ని ప్రయోగించారు. గతంలో రావణ్‌ తన ‘ప్రశ్న’ ఛానెల్‌లో మావోయిజంపై చేసిన ఓ వీడియోను చూపిస్తూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.

స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి తన విచక్షణను చాలా తక్కువసార్లు కోల్పోతాడు. కానీ గుంపుల్లో, పార్టీల్లో, జాతుల్లో, కొన్ని యుగాల్లో అవివేకమే ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడే ప్రశ్నల కంటే నినాదాలు వేగంగా ప్రయాణిస్తాయి. ఒక నినాదం వంద ప్రశ్నలను చంపేస్తుంది. జై శ్రీరామ్‌ నినాదమైనా, జై భీమ్‌ నినాదమైనా గొర్రెలనే తయారు చేస్తుంది. ప్రశ్నించడం చేతకాకపోతే మొదటికే మోసం వస్తుంది. అధికారానికి అదే అస్త్రంగా మారుతుంది.

ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడి భావజాలం కాలానుగుణంగా మారవచ్చు. రాజకీయ కూటములు మారవచ్చు. ప్రాధాన్యతలు మారవచ్చు. అయితే నాయకుడి రాజకీయ ప్రయాణాన్ని అనుసరించే మద్దతుదారులు కూడా ప్రతి మార్పును అంగీకరించాలా? నాయకుడి మార్పునే తమ మార్పుగా స్వీకరించాలా? ఒకప్పుడు పెరియర్‌ సిద్ధాంతాలంటూ ఊగిపోయిన వ్యక్తి చివరకు సావార్కర్‌ సిద్ధాంతాలను భుజంపై మోస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సిందిపోయి మీరు గడ్డి తింటే మేమూ గడ్డి తింటామని ఎండి గడ్డి మెస్తారా? దీనికి సమాధానం పవన్‌ కల్యాణ్‌ అభిమానులు చెబితే తనివీతీరా వినాలని ఉంది.


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *