మూడేళ్లుగా కొనసాగుతున్న సూడాన్ సివిల్ వార్ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి మానవతా సంక్షోభంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది తమ నివాసలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు, ప్రతి రోజు ఆకలి, వ్యాధి, భయంతో జీవిస్తున్నారు. ఈ యుద్ధంలో మహిళలు, చిన్నపిల్లలు అత్యంత దారుణమైన హింసను ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆ హింస నుంచి బయటపడ్డ సర్వైవర్స్‌కు అవసరమైన వైద్యం, సహాయం అందక వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ సహాయం తగ్గిపోతూండగా, అవసరాలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బెర్లిన్‌లో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇంతకీ ఈ సమావేవం తర్వాత ఏం జరగనుంది? అసలు ఈ మూడేళ్ల రక్తపాతానికి కారణమేంటి?
ఈ యుద్ధం 2023 ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ప్రారంభమైంది. దేశాన్ని నియంత్రించాలన్న పోరాటంలో సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. మొదట రాజధాని ఖర్తూమ్‌లో మొదలైన ఈ ఘర్షణ క్రమంగా దేశమంతా వ్యాపించింది.
నగరాలు యుద్ధభూములుగా మారాయి, సాధారణ ప్రజలే ప్రధాన బలులుగా మారిపోయారు. ఎల్ ఫషర్ లాంటి ప్రాంతాల్లో తీవ్ర దాడులు జరిగాయి. రోజుల తరబడి బాంబు దాడులు కొనసాగాయి. బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడులు జరిగాయి. అక్కడ చిక్కుకున్న ప్రజలు ఆకలితో, భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు సంవత్సరాల్లో పరిస్థితి ఘోరంగా దిగజారింది. ఇప్పుడు దేశంలో 3 కోట్ల 30లక్షల మందికిపైగా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సహాయం మాత్రం తగ్గిపోతూనే ఉంది. ఆసుపత్రుల్లో సాధారణ మందులు కూడా లేని పరిస్థితి. యాంటీబయోటిక్స్ లేకపోవడంతో ఎవరికీ చికిత్స ఇవ్వాలో నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చేసింది. పోషకాహారం లేక చిన్నపిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం పెరుగుతోంది.
ఒకప్పుడు పనిచేసిన కమ్యూనిటీ కిచెన్లు కూడా ఇప్పుడు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో అత్యంత దారుణంగా ప్రభావితమవుతున్న వారు మహిళలు, చిన్నపిల్లలే. యుద్ధం మధ్యలో లైంగిక హింస తీవ్రంగా పెరిగింది. ఆ దాడుల నుంచి బయటపడ్డ వారికి వైద్యం అందడం చాలా కష్టమైపోయింది.
గ్రామ స్థాయి మహిళా సంఘాలకు వచ్చే నిధులు పూర్తిగా ఆగిపోయాయి. అందుకే అనేక మంది మహిళలు, చిన్నపిల్లలు ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా ఈ బాధను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో లక్షలాది మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పొరుగు దేశాలకు పారిపోతున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షల మందికి పైగా ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. చాద్ వంటి దేశాల్లో ఉన్న శిబిరాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ సరైన విద్య, వైద్యం అందడం లేదు. దివ్యాంగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. నడవలేని వారు టాయిలెట్‌కు వెళ్లడమే ఒక పెద్ద సమస్యగా మారింది. పిల్లలు చదవాలని కలలు కంటున్నారు, కానీ ఆ అవకాశాలు చాలా దూరంగా ఉన్నాయి.
ఇప్పుడు పరిస్థితి కొత్త దశలోకి వెళ్తోంది. కొర్డోఫాన్, బ్లూ నైల్ ప్రాంతాలు కొత్త యుద్ధ కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి నగరాలు పూర్తిగా ముట్టడిలో ఉన్నాయి. బయటకు వెళ్లే మార్గాలు లేవు, సహాయం చేరే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో మళ్లీ భారీ హింసకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎల్ ఫషర్‌లో జరిగిన దారుణాలు మళ్లీ రిపీట్ అయ్యే ప్రమాదం పెరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో స్పందన మాత్రం ఇంకా తక్కువగానే ఉంది. అవసరమైన నిధులు అందడం లేదు. ప్రణాళికలకు సరిపడా డబ్బు రావడం లేదు. సహాయం అందించే సంస్థలు కూడా నిలబడటానికి కష్టపడుతున్నాయి. రేపు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బెర్లిన్‌లో జరుగుతున్న సమావేశం చాలా కీలకం. అయితే ఈ సమావేశం కేవలం మాటలకే పరిమితం అవుతుందా? లేదా నిజంగా మార్పు తీసుకువస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న.
సంపన్న దేశాలు ఇప్పటికైనా ముందుకు వచ్చి సహాయం పెంచితే వేలాది ప్రాణాలు కాపాడవచ్చు. లేకపోతే ఈ సంక్షోభం మరింత లోతుగా మారి, మరింత పెద్ద మానవ విపత్తుగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ: పిఠాపురంలో దళితులపై బలిసిన కులాల దౌర్జన్యం..! సనాతన పవనుడి కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా?

Motherhood: ‘నా లైఫ్ నా చేతుల్లో లేదు..’ ఓ అమ్మ ఆవేదన!
AI Data centres: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. డేటా సెంటర్లతో ప్రపంచానికి ముప్పు!
Oracle’s layoffs Explained: 30వేల ఉద్యోగాలు ఊస్ట్.. దిగ్గజ కంపెనీ నిర్ణయంతో టెన్షన్లో ఐటి సెక్టర్!
Humans are very stupid: ఇతర గ్రహాలకు వెళ్లాల్సిందేనా? భూమిని నాశనం చేస్తున్న మానవుడు!
Workplace Mental Health Crisis: ప్రాణాలకు ముప్పుగా మారుతోన్న ఆఫీస్ వర్క్ కల్చర్!
Satish Chander: జాబితా నుంచి పేరు కాదు.. నిజాన్ని తీసేశారు..!