Menu

Saint Sebastian: ఒక క్రిస్టియన్ సెయింట్ చివరకు LGBTQ+ కమ్యూనిటికి ఐకాన్‌గా ఎలా మారాడు? 1700ఏళ్ల చరిత్ర!

Tri Ten B (Triya) 2 months ago
A Roman soldier who was killed for his Christian beliefs, Sebastian has been a hero for gay men over the centuries – from Oscar Wilde to Keith Haring. Here's why.

✨ Quick Read

  • LGBTQ+ ప్రతీకగా మారిన సెయింట్
  • 1,700 ఏళ్ల చరిత్రలో కొత్త అర్థం
  • కళ, చరిత్ర కలిపిన గే ఐకాన్

AI-assisted summary, newsroom reviewed

మతాలు మనిషికి ఒక గుర్తింపును ఇస్తాయి. సమాజం మరో గుర్తింపును ఇస్తుంది. కాలం మాత్రం ఆ రెండింటినీ తిరగరాస్తుంది. అందుకే చరిత్రలో కొందరు మనుషుల జీవితాల గురించి వారు బతికిన రోజుల్లో కంటే… వారు చనిపోయిన తర్వాతే ఎక్కువగా చర్చకు వస్తాయి. మూడో శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసం కోసం రోమన్ చక్రవర్తి చేతుల్లో చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు కోల్పోయిన ఒక సెయింట్… శతాబ్దాల తర్వాత ప్రపంచ LGBTQ+ కమ్యూనిటీకి ప్రతీకగా మారాడని తెలుసా?ఒకప్పుడు చర్చిల్లో ప్రార్థనలు అందుకున్న ఆ వ్యక్తి… కళాకారుల కాన్వాస్‌లపై, రచయితల ఊహల్లో, గే సమాజపు ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచడంటే నమ్మగలరా? ఆయనే గే ఐకాన్.. సెయింట్ సెబాస్టియన్ (Saint Sebastian)..!

ఎవరీ సెయింట్ సెబాస్టియన్?

క్రైస్తవ మతంలో సెయింట్‌గా పూజలు అందుకుంటున్న వ్యక్తిని ప్రపంచ LGBTQ+ కమ్యూనిటీ గే ఐకాన్‌గా ఎందుకు చూసిందనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే దాదాపు 1,700 ఏళ్ల చరిత్రను తిరగేయాలి. మూడో శతాబ్దంలో రోమన్ సైనికుడిగా పనిచేసిన సెబాస్టియన్ రహస్యంగా క్రైస్తవ మతాన్ని అనుసరించేవాడు. ఆ రోజుల్లో క్రైస్తవులను అత్యంత దారుణంగా హింసిస్తున్న రోమన్ చక్రవర్తి డయోక్లీషియన్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో అతడిని చెట్టుకు కట్టి బాణాలతో చిత్రహింసలు పెట్టించారు. ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ సెబాస్టియన్… తన విశ్వాసాన్ని మాత్రం వదల్లేదు. చివరికి మళ్లీ పట్టుబడి క్రూరంగా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఆయనను క్రైస్తవ ప్రపంచం సెయింట్‌గా గౌరవించింది.

సెయింట్ సెబాస్టియన్‌ను LGBTQ+ గే ఐకాన్‌గా చర్చి అధికారికంగా గుర్తించిందా?

లేదు. సెయింట్ సెబాస్టియన్‌ను LGBTQ+ గే ఐకాన్‌గా కాథలిక్ చర్చి అధికారికంగా ప్రకటించలేదు. కళాకారులు, రచయితలు, LGBTQ+ ఉద్యమకారులు ఆయన జీవితాన్ని తమ అనుభవాలతో అనుసంధానించడంతో కాలక్రమేణా ఈ ప్రతీక ఏర్పడింది.

ప్రపంచ LGBTQ+ చరిత్రలో స్టోన్‌వాల్ ఉద్యమం ఎందుకు మలుపు?

1969లో అమెరికాలో జరిగిన స్టోన్‌వాల్ ఉద్యమం తర్వాత LGBTQ+ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా సంఘటిత ఉద్యమాలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక ప్రైడ్ ఉద్యమానికి ఇదే ప్రారంభ బిందువుగా చరిత్రకారులు భావిస్తారు.

అయితే అసలు చరిత్ర అక్కడి నుంచే మొదలైంది. శతాబ్దాలు గడిచాయి. పునరుజ్జీవన యుగం(Renaissance Era) వచ్చింది. గైడో రెని, ఎల్ గ్రెకో, సాండ్రో బొట్టిచెల్లీ లాంటి మహా చిత్రకారులు బాణాలతో గాయపడిన సెబాస్టియన్‌ను తమ కాన్వాస్‌లపై మళ్లీ మళ్లీ చిత్రించారు. కానీ ఆ చిత్రాల్లో కనిపించింది కేవలం ఓ మత వీరుడు మాత్రమే కాదు. హింసను భరించినా విరగని అందం… సమాజం తిరస్కరించినా వంగని ఆత్మగౌరవం… దాచిపెట్టాల్సి వచ్చిన ఒక గుర్తింపు. కాలక్రమేణా ఆ చిత్రాలను LGBTQ+ కమ్యూనిటీ మరో కోణంలో చదవడం ప్రారంభించింది.

ఆ రోజుల్లో స్వలింగ సంపర్కం గురించి బహిరంగంగా మాట్లాడటం నేరంగా, పాపంగా, అవమానంగా భావించేవారు. ప్రేమను చెప్పుకునే హక్కు లేకపోయినా… కళను మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. అందుకే సెబాస్టియన్ చిత్రాలు ఒక రహస్య భాషగా మారాయి. బయటికి ఒక సెయింట్‌ చిత్రం. లోపల మాత్రం తమలాగే తిరస్కరణను ఎదుర్కొన్న ఒక మనిషి. తన అసలు గుర్తింపును దాచుకుని బతకాల్సి వచ్చిన వారి మనసుల్లో సెబాస్టియన్ మెల్లగా ఒక ప్రతీకగా మారిపోయాడు.

ఆస్కార్‌ వైల్డ్ నుంచి మార్క్‌ వరకు..:

19వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ ప్రతీక మరింత బలపడింది. ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ జైలుశిక్ష అనుభవించి ప్రవాస జీవితంలోకి వెళ్లిన తర్వాత “సెబాస్టియన్ మెల్మోత్” అనే పేరును ఉపయోగించాడు. ఫ్రెంచ్ రచయిత మార్క్-ఆండ్రే రఫాలోవిచ్ కూడా తనకు అత్యంత ఇష్టమైన సెయింట్ పేరు “బ్రదర్ సెబాస్టియన్”గా స్వీకరించాడు. ఆ కాలంలో “సెయింట్ సెబాస్టియన్” అనే పేరు ఒక వ్యక్తి లైంగిక గుర్తింపును బహిరంగంగా చెప్పకుండా… అర్థం చేసుకునే వారికి మాత్రమే అర్థమయ్యే సంకేత భాషగా మారింది.

సెబాస్టియన్‌ను LGBTQ+ కమ్యూనిటీకి దగ్గర చేసింది ఆయన శరీరం కాదు… ఆయన కథ. తాను నమ్మిన విశ్వాసాన్ని దాచుకుని బతకాల్సి వచ్చింది. నిజం బయటపడిన తర్వాత సమాజం ఆయనను శత్రువులా చూసింది. చివరికి తన నమ్మకానికే శిక్ష అనుభవించాడు. ఈ ప్రయాణంలో తమ జీవితాల ప్రతిబింబాన్ని ఎంతో మంది క్వీర్ కళాకారులు చూసుకున్నారు. అందుకే సెబాస్టియన్ వారికి మతపరమైన వ్యక్తి కంటే… ఒంటరితనం, తిరస్కరణ, ప్రతిఘటనకు ప్రతీకగా కనిపించాడు.

1969 స్టోన్‌వాల్ ఉద్యమం తర్వాత ప్రపంచవ్యాప్తంగా LGBTQ+ హక్కుల ఉద్యమం వేగం అందుకున్నప్పుడు సెబాస్టియన్ మరోసారి కొత్త తరానికి పరిచయమయ్యాడు. 1976లో దర్శకుడు డెరెక్ జార్మన్ తెరకెక్కించిన Sebastiane సినిమా ఈ చరిత్రకు కొత్త రూపం ఇచ్చింది. స్వలింగ ప్రేమను భయం లేకుండా, సిగ్గు లేకుండా, మానవ సంబంధంగా చూపించిన ఆ చిత్రం LGBTQ+ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత చిత్రకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు, ఉద్యమకారులు… తరాలు మారినా సెబాస్టియన్‌ను కొత్త కొత్త అర్థాలతో మళ్లీ సృష్టిస్తూనే ఉన్నారు.

చరిత్రలో చాలా మంది మనుషులు తమ జీవితాన్ని ఒక నమ్మకం కోసం అంకితం చేస్తారు. కాలం మాత్రం వారి జీవితానికి కొత్త అర్థాలను రాస్తుంది. సెయింట్ సెబాస్టియన్ కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసం కోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి… శతాబ్దాల తర్వాత ప్రపంచ LGBTQ+ కమ్యూనిటీకి ఆశగా, ఆత్మగౌరవానికి ప్రతీకగా, తమ ఉనికిని గుర్తు చేసే చిహ్నంగా మారిపోయాడు. బహుశా అందుకేనేమో… మనిషి జీవితాన్ని ఒక కాలం నిర్ణయించదు. అతని కథను తర్వాతి తరాలు ఎలా చదువుకుంటాయన్నదే చరిత్రలో అతని అసలైన గుర్తింపును నిర్ణయిస్తుంది.


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *