నమ్ముతారు. వెళ్తారు. తలుపులు మూసుకుపోతాయి. అప్పటివరకు నవ్వుతూ పలకరించిన మనిషి ఒక్కసారిగా మారిపోతాడు. మాటలు బెదిరింపులుగా మారతాయి. కెమెరాలో బంధించిన క్షణాలు బ్లాక్‌మెయిల్‌కు ఆయుధాలవుతాయి. చివరకు డబ్బుల కోసం మొదలైన వేధింపులు, ప్రాణభయాన్ని వెంటాడేంత వరకు వెళ్తాయి. గే, ట్రాన్స్జెండర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి దారుణాల వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది. మనిషి నమ్మకాన్ని వలగా మార్చి, అతని ప్రైవసీని పణంగా పెట్టి, భయంతో డబ్బులు గుంజే ఒక క్రూరమైన మనస్తత్వం ఉంది.
హైదరాబాద్‌కు చెందిన రాకేష్ రాఖీ విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ఆరోపణలే చర్చకు వస్తున్నాయి. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను చూపిస్తూ కొందరు బాధితులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన గదికి పిలిపించుకుని వేధించడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం లాంటి ఆరోపణలు అతనిపై వినిపిస్తున్నాయి. ఒకరిద్దరితో ఆగిపోని ఈ వ్యవహారంలో 20 మందికి పైగా బాధితులు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పోలీసులకు ఫిర్యాదులు చేసినా, ఆ తర్వాత కేసులు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని సమాచారం.

ఇది ఒక్క రాకేష్ రాఖీకి సంబంధించిన ఆరోపణలతోనే ఆగిపోయే వ్యవహారం కూడా కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పటికే బయటపడ్డాయి. హైదరాబాద్‌లోనే 2025 ఫిబ్రవరిలో గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం చేసుకుని ఒక వ్యక్తిని పిలిపించి, కత్తితో బెదిరించి ఏటీఎం నుంచి రూ.40 వేలు వసూలు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ఏడాది పుణెలో 22 ఏళ్ల యువకుడిని రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నోయిడాలోనూ ఇలాంటి పద్ధతిలో 12 మందిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అంటే పరిచయం, నమ్మకం, ప్రైవేట్ మీటింగ్, రహస్య వీడియో, ఆ తర్వాత డబ్బుల డిమాండ్.. ఈ పద్ధతి ఒక్కచోటికే పరిమితం కావడం లేదు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి ట్రాప్ కనిపిస్తోంది.
ఇక ఈ మోసాల్లో మరో ప్రమాదకరమైన కోణం ఫోన్, లోన్ యాప్స్. కొందరి ఫోన్లు లాక్కుని లోన్ యాప్స్ ద్వారా డబ్బులు కాజేయడం, వ్యక్తిగత వివరాలను ఉపయోగించి మరింతగా వేధించడం లాంటి ప్రమాదాలున్నాయి. అంటే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం కూడా ఎంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుందో అర్థం చేసుకోవాలి. డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన వాళ్లలో కొందరు గే, ట్రాన్స్జెండర్లను ప్రైవేట్ రూమ్స్‌కి పిలుపించుకోని బలవంతంగా లోన్ యాప్స్ ద్వారా డబ్బులు గుంజుతున్నారు. అంటే బాధిత వ్యక్తి ఫోన్ నుంచే లోన్ తీసుకుంటారు.. డబ్బులు అప్పటికి అప్పుడే UPI ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. తర్వాత బాధితుడే ప్రతినెలా EMI చెల్లించుకోవాల్సి ఉంటుంది.
అందుకే కొత్త పరిచయాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫొటోల్లో అందంగా కనిపిస్తున్నారని, మంచి బాడీ ఉందని ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మేయొద్దు. డేటింగ్ యాప్స్‌లో పరిచయమైన వ్యక్తిని మొదటిసారి కలవాలంటే పబ్లిక్ ప్లేసెస్‌లోనే కలవండి. ఎక్కడికి వెళ్తున్నారో స్నేహితుడికి చెప్పండి. లైవ్ లొకేషన్ షేర్ చేయండి. ఫోన్‌ను ఇతరుల చేతుల్లో పెట్టకండి. OTPలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ చెప్పకండి. మీ అనుమతి లేకుండా వీడియోలు తీసినా, బెదిరించి డబ్బులు అడిగినా ఆధారాలు భద్రపరచుకుని పోలీసులను ఆశ్రయించండి. ప్రైవసీ బయటపడుతుందనే భయంతో నేరాన్ని భరించాల్సిన అవసరం లేదు. బాధితులు సైలెంట్‌గా ఉన్నంత కాలం పోలీసులు కూడా ఏమీ చేయలేరని మర్చిపోవద్దు.
ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. గే అయినా, ట్రాన్స్‌జెండర్ అయినా వారి వ్యక్తిగత జీవితం వారిది. ఆ జీవితాన్ని బయటపెడతామని బెదిరించి డబ్బులు గుంజే హక్కు ఎవరికీ లేదు. ఒకరి నమ్మకాన్ని దోచుకుని, వారి భయాన్ని సొమ్ము చేసుకునే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదు. కమ్యూనిటీలో ఉన్నామని చెప్పుకుంటూ తోటి వ్యక్తులనే టార్గెట్ చేసే ఇలాంటి దోపిడీ మనస్తత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాలి. బాధితులు కూడా ఒంటరిగా మిగిలిపోకూడదు. మీకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి సహాయం తీసుకోండి. మీ మౌనం వారి తదుపరి లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదు.
ALSO READ: ప్రపంచంలోని తల్లులందరికీ ఆమె ‘కూతురే’ ..! ‘ముత్తుమణి’ పాటలో ఇళయరాజా పలికించిన ప్రేమ ఇదే!

Sexual Orientation: స్వలింగ ఆకర్షణ సహజమేనా? దశాబ్దాల పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Queer Strories: నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లు.. ట్రాన్స్‌విమెన్ అభినేత్రి జీవితం చెబుతున్న పాఠం
Rudolf Brazda: ఒక చిన్న గులాబీ త్రిభుజం… ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన LGBTQ గుర్తు!
Pronouns: ఎవరిని ఎలా పిలవాలి? ‘ఆమె’… ‘అతను’… ఈ చిన్న పదాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
Indian Coming Out Day: ‘నేను నాలాగే ఉంటాను..’ భారతీయ LGBTQ చరిత్రలో చెరిగిపోని రోజు!
International LGBTQ Pride Day: ప్రపంచ చరిత్రను తిరగరాసిన తిరుగుబాటు..కోట్లాది మంది జీవితాలను తాకిన ఉద్యమం!