Menu

Mahaa News: బూతులు, రోత, డబుల్‌ మీనింగ్‌.. మహాన్యూస్‌ థంబ్‌నెయిల్స్‌పై ఫిర్యాదులు!

Praja Dhwani Desk 6 days ago
complaint against mahaa news

దరిద్రానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రోతకు కూడా ఒక పరిమితి ఉంటుంది. కానీ వార్త పేరుతో బూతులు, డబుల్‌ మీనింగ్‌ పదాలు, ఆబ్జెక్టిఫైయింగ్‌ ఫొటోలతో థంబ్‌నెయిల్స్‌ చేసే కొన్ని మీడియా సంస్థలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. మహా న్యూస్‌ యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌పై క్లాడ్‌ ఏఐ సహాయంతో రూపొందించిన ఓ ఆడిట్‌లో ఎన్నో అభ్యంతరకరమైన ఉదాహరణలు వెలుగుచూశాయి. ఈ అంశంపై ఒక స్వతంత్ర మీడియా సంస్థ ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డిజిటల్‌ మీడియా విభాగానికి, జాతీయ మహిళా కమిషన్‌కు, CPGRAMS ద్వారా ఫిర్యాదులు చేసింది. మహిళలను ఆబ్జెక్టిఫై చేయడం, ల్యూరిడ్‌ సెక్స్‌ క్రైమ్‌, ఎఫైర్‌ ఫ్రేమింగ్‌, విక్టిమ్‌ బ్లేమింగ్‌, షేమింగ్‌ వంటి ధోరణులతో పాటు చిన్నపిల్లలు కూడా చూసే యూట్యూబ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి కంటెంట్‌ కనిపించడం, దాని సామాజిక ప్రభావంపై ఫిర్యాదు వెళ్లింది.

అక్టోబర్ 2, 2025 నుంచి అక్టోబర్ 2, 2026 వరకు మహాన్యూస్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియోలను క్లాడ్‌ సాయంతో ఆడిట్‌ చేశారు. ఏడాది వ్యవధిలో మహా న్యూస్‌ యూట్యూబ్‌ ఛానల్‌లోని మొత్తం 67,273 థంబ్‌నెయిల్స్‌ ఉన్నట్టు క్లాడ్‌ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో 45,925 సాధారణ వీడియోలు, 3,387 లైవ్‌లు, 17,961 షార్ట్స్‌ ఉన్నాయి. వీటిలో 399 థంబ్‌నెయిల్స్‌ను సమస్యాత్మకమైనవిగా, మరో 523ను బోర్డర్‌లైన్‌గా క్లాడ్ రిపోర్ట్ గుర్తిస్తోంది. వీటిలో 128 థంబ్‌నెయిల్స్‌లో డబుల్‌ మీనింగ్‌ లేదా లైంగిక సంకేతాలు ఉన్నట్లు ఆడిట్‌ వర్గీకరిస్తోంది. 164 ఆబ్జెక్టిఫైయింగ్‌, 160 ల్యూరిడ్‌ సె*క్స్‌ క్రైమ్‌ లేదా ఎఫైర్‌ ఫ్రేమింగ్‌, 119 విక్టిమ్‌ బ్లేమింగ్‌ లేదా షేమింగ్‌ ధోరణులుగా క్లాడ్ గుర్తిస్తోంది.

కొన్ని చోట్ల నేరుగా బూతు పదాలను థంబ్‌నెయిల్‌ హుక్‌గా పెట్టారు. మరికొన్ని చోట్ల రెండు అర్థాలు వచ్చే మాటలతో ప్రేక్షకుడి ఊహను రెచ్చగొట్టారు. “బో*కే వర్సెస్‌ ల***కొడకా ”* లాంటి థంబ్‌నెయిల్స్‌ కూడా ఉన్నాయి. మరోచోట “కారులో నా జుట్టు పట్టుకుని నాపై ఎ*క్కి…” అంటూ లైంగిక వేధింపుల ఆరోపణకు సంబంధించిన మాటను థంబ్‌నెయిల్‌లో పెట్టారు. మరో ఉదాహరణలో “విప్‌ పదవి ఇస్తే.. విప్పి చూపించాడు” అంటూ పదాల మధ్య ఉన్న టెంపోను పట్టుకుని లైంగిక ఆరోపణను డబుల్‌ మీనింగ్‌ పంచ్‌లైన్‌గా మార్చారు. ఇంకొకచోట “నువ్వు ఆడదానివేనా..?” అనే మాటను నేరుగా థంబ్‌నెయిల్‌ హుక్‌గా ఉపయోగించారు.

ఇదే సమయంలో ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంబంధాలు, లైంగిక ఆరోపణలు కూడా థంబ్‌నెయిల్‌ సరుకుగా మారుతున్న ఉదాహరణలు ఉన్నాయి. “అబార్షన్లు అబద్ధం.. తేల్చేసిన డాక్టర్లు” అంటూ ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వైద్య విషయాన్ని ముందుకు తెచ్చిన ఎగ్జాంపుల్ ఉంది. మరోచోట “నాకు హాస్పిటల్‌లో అబార్షన్‌ అవ్వలేదు”, “ఆరుగురు అమ్మాయిలతో…” లాంటి వ్యక్తిగత అంశాలను థంబ్‌నెయిల్‌లో పెట్టారు. నిజానికి ఒకరిని అవమానించే మాటలు, ఒక వర్గాన్ని ఎగతాళి చేసే భాష, లైంగిక సంకేతాలతో కూడిన బూతులు సాధారణ వార్తా భాషగా మారితే దాని ప్రభావం థంబ్‌నెయిల్‌ చూసి వెళ్లిపోయే ఒక్క ప్రేక్షకుడితో ముగిసిపోదు. అదే భాషను సమాజం మళ్లీ మళ్లీ చూస్తుంది. మళ్లీ వింటుంది. చివరికి అదే భాష సాధారణంగా కనిపించడం మొదలవుతుంది.

ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన వ్యవస్థలే ఇంతలా దిగజారితే ఎలా? ఇది కేవలం ఒక్క ఛానెల్‌కి చెందిన అంశం కూడా కాదు.. చాలా సంస్థలు ఇలానే చేస్తున్నాయి. మరి జర్నలిస్టు విలువలు ఇంత జరుగుతున్నా మీడియా మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? జర్నలిస్టుల సంఘాలు ఏం చేస్తున్నాయి? న్యూస్‌ సంస్థలు వాళ్ల ఇష్టానుసారం థంబ్‌నెయిల్స్‌ పెట్టుకుంటే వాళ్లని కంట్రోల్ చేసే వ్యవస్థలే లేవా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *