దేశం కోసం గట్టిగా అరిచేవాళ్లను మనం చాలామందిని చూశాం. దేశం కోసం ఆకలితో కరిగిపోతున్న వాళ్లను మాత్రం చాలా అరుదుగా చూస్తాం. అందుకేనేమో సోనమ్ వాంగ్‌చుక్ గురించి ఎంత చదివితే అంతగా నా మనసులో ఒకే ఆలోచన తిరుగుతోంది. మీకు ఆయన దేశద్రోహి కావచ్చు. చైనా ఏజెంట్ కావచ్చు.. నాకు మాత్రం ఆయన ఈ తరం గాంధీ. ఎందుకంటే అధికారాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఎంచుకున్న ఆయుధం కోపం కాదు..తుపాకీ కూడా కాదు.. తన సొంత శరీరం. నిరాహార దీక్షతో ప్రతీరోజూ ఆయన బరువు కరుగుతోంది. కండరాలు బలహీనపడుతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తోంది. అయినా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కసారి మాట్లాడండి అని అడుగుతున్న మనిషిని చూసినప్పుడు, ఆకలితో అడిగే ప్రశ్నలకు రాజ్యాలు ఎందుకంత భయపడతాయో అనిపిస్తుంది.
సోనమ్ వాంగ్‌చుక్ గురించి ఎంత తెలుసుకుంటే అంతగా ఒక విషయం నన్ను వెంటాడుతోంది. దేశాన్ని ప్రేమించడం అంటే సరిహద్దులో తుపాకీ పట్టుకోవడం ఒక్కటే కాదేమో. మన భవిష్యత్తును కాపాడే విద్య కోసం నిలబడటం కూడా దేశభక్తే అనిపిస్తోంది. లడఖ్ మంచు కొండల్లో నీటి కోసం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆలోచనలు పుట్టించిన మనిషి, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ రోజు తన ఆకలినే ఒక ఉద్యమంగా మార్చుకోవడం నా మనసును కదిలిస్తోంది.
18 రోజులుగా(జులై 15నాటికి) నిరాహాదదీక్ష కారణంగా ఆయన శరీరం 8కిలోలకుపైగా బరువును కోల్పోయింది. కండరాలు శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రతి ఉదయం అదే సంకల్పంతో దీక్ష కొనసాగుతోంది.
ఈ నిరాహార దీక్షలో నన్ను ఎక్కువగా కలచివేసింది ఆకలి కాదు. ఆ ఆకలి వెనుక ఉన్న ఉద్దేశం. నీట్ పరీక్ష లీక్‌పై దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశ్నలు వినిపించిన సమయంలో, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనను తన భుజాలపై వేసుకుని ఒక వ్యక్తి రాజధానిలో కూర్చోవడం చిన్న విషయంగా అనిపించడంలేదు. పదవి లేకపోయినా బాధ్యత తీసుకోవచ్చని ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు. అధికారం చేతిలో లేకపోయినా సమాజం కోసం నిలబడవచ్చని చూపిస్తున్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఉద్యమం ఒక్కటే కనిపించదు. లడఖ్ యువతకు కొత్త దారి చూపిన విద్యా సంస్కర్త కనిపిస్తారు. ప్రకృతితో కలిసి బతకడం నేర్పిన పర్యావరణ కార్యకర్త కనిపిస్తారు. మంచును నీటి నిల్వగా మార్చిన ఐస్ స్టూపా ఆలోచనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆవిష్కర్త కనిపిస్తారు. ఒక ప్రాంతం సమస్యను ప్రపంచం వినేలా చేసిన సామాజిక నాయకుడు కనిపిస్తారు.
చరిత్ర పుస్తకాలు ఒక మనిషి ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడో మాత్రమే గుర్తుంచుకోవు. ఆ ఆకలి వెనుక ఉన్న కారణాన్ని కూడా గుర్తుంచుకుంటాయి. ఈ రోజు సోనమ్ వాంగ్ అడుగులు నెమ్మదించి ఉండొచ్చు కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం రోజురోజుకూ మరింత బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల కంటే గొప్పదని ఒక మనిషి తన జీవితంతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ ప్రయత్నాన్ని వినడం ఈ దేశం బాధ్యత కూడా. ఒకప్పుడు మహాత్మా గాంధీ కూడా ఇదే చేశారు. కాలాలు మారాయి. తరాలు మారాయి. సమస్యలు మారాయి. కానీ సమాజాన్ని ప్రశ్నించే పోరాటం మాత్రం ఇప్పటికీ అదే తీవ్రతతో నిలిచింది.
ఆయనతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆయన అడిగిన ప్రతి డిమాండ్ అందరికీ ఒకేలా అనిపించకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు ఎప్పుడూ చోటు ఉంటుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఒక మనిషి త్యాగాన్ని చూసి ఒక్క క్షణమైనా ఆలోచించాలి. ఎందుకంటే సోనమ్ వాంగ్‌చుక్‌ను ఒక ఉద్యమకారుడిగా మాత్రమే నేను చూడలేకపోతున్నాను. ఒక విద్యావేత్తగా మాత్రమే గుర్తుంచుకోలేకపోతున్నాను. ఒక పర్యావరణ ప్రేమికుడిగానో, ఆవిష్కర్తగానో మాత్రమే పరిమితం చేయలేకపోతున్నాను. తన శరీరాన్నే ఒక ప్రశ్నగా మార్చి దేశం మన:స్సాక్షి తలుపు తట్టే మనిషిగా చూస్తున్నాను. అందుకే నా హృదయం పదేపదే ఒకే మాట చెబుతోంది.
మీకు ఆయన గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఉండొచ్చు.
నాకు మాత్రం ఆయన ఈ తరం గాంధీ.
: త్రియా (Prajadhwani Telugu)

Satyagraha: నాడు స్వామి జ్ఞాన్ స్వరూప్..నేడు సోనమ్ వాంగ్‌చుక్.. ప్రభుత్వాలకు నిరాహార దీక్షలంటే ఎందుకంత భయం?