Menu

AI Data centres: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. డేటా సెంటర్లతో ప్రపంచానికి ముప్పు!

Praja Dhwani Desk 2 months ago
data centres AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. అయితే అదే సమయంలో భూమిని కూడా స్లోగా వేడెక్కిస్తోంది. అవును..! డేటా సెంటర్లు ఇప్పుడు మరో కొత్త సమస్యకు కారణమవుతున్నాయి.
వేల సంఖ్యలో సర్వర్లు పనిచేసే ఈ భవనాలు.. కేవలం సమాచారాన్ని ప్రాసెస్ చేయడం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న భూమి ఉష్ణోగ్రతను కూడా పెంచుతున్నాయి.

కొత్త అధ్యయనాల ప్రకారం డేటా సెంటర్లు ప్రారంభమైన తర్వాత..వాటి పరిసర ప్రాంతాల్లో సగటు 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇది 9 డిగ్రీల వరకు కూడా చేరింది. అంటే.. ఒక చల్లని ఉదయం ఒక్కసారిగా మండే వేసవిలా మారేంత తేడా వస్తుందని అర్థం. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మందికి పైగా ప్రజలను తాకుతుందని అంచనా. ఇంతకీ ఈ డేటా సెంటర్లు నిజంగా ఎలా వేడి పెంచుతున్నాయి? ఇది ఎంతవరకు ప్రమాదకరం?

ఈ డేటా సెంటర్లు ఎలా పని చేస్తాయో అర్థం చేసుకుంటే ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంఖ్యలో సర్వర్లు ఒకేసారి పనిచేస్తాయి. ఇవి భారీగా కరెంట్‌ను వినియోగిస్తాయి. విద్యుత్ వినియోగంతో పాటు భారీ స్థాయిలో వేడి ఉత్పత్తి అవుతుంది.

ఆ వేడిని తగ్గించడానికి ప్రత్యేక కూలింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఈ ప్రక్రియలో బయటకు విడుదలయ్యే వేడి పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ డేటా సెంటర్లు చాలా పెద్ద భవనాలుగా ఉంటాయి. వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ నిర్మాణాలు నేలపై సహజమైన చల్లదనాన్ని తగ్గిస్తాయి. చెట్లు, గడ్డి లాంటి సహజ వనరులు తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా ఆ ప్రాంతం వేడిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. ఈ పరిస్థితినే శాస్త్రవేత్తలు హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌గా చెబుతున్నారు. అంటే ఒక ప్రత్యేక ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువగా వేడెక్కడం. ఈ ప్రభావం కేవలం డేటా సెంటర్ ఉన్న ప్రదేశానికే పరిమితం కాదు.

దాదాపు 10 కిలోమీటర్ల వరకు పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. ఈ ట్రెండ్ ఒక్క దేశంలో మాత్రమే కనిపించడం లేదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే ఇది ఒక గ్లోబల్ ఫెనామెనాగా మారుతోంది. ఈ వేడి కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాకుండా మన జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్య సమస్యలు పెంచుతాయి. నీటి వినియోగం పెరుగుతుంది. విద్యుత్ అవసరం మరింత పెరుగుతుంది. ఒక విధంగా ఇది మరో సైకిల్‌లా మారి మరింత వేడిని సృష్టించే పరిస్థితి తీసుకువస్తుంది. ఇక ఇండియా విషయానికి వస్తే.. పరిస్థితి మరింత సీరియస్ కావచ్చు.

ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలు ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ఇవి ఇప్పటికే వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలను అనుభవించే ప్రాంతాలు.

ఇప్పుడు ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే స్థానికంగా వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి టెక్నాలజీ చాలా అవసరమే.. అయితే దాని వల్ల వచ్చే పర్యావరణ ప్రభావాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేస్తామన్నది కీలకం. వేగంగా పెరుగుతున్న డిజిటల్ అవసరాల మధ్య సస్టైనబుల్ విధానాలు లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ పరిశోధనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. కొన్ని వర్గాలు ఈ సంఖ్యలకు మరింత పరిశీలన అవసరమని చెబుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

టెక్నాలజీ ఎంత ముందుకెళ్తే దాని ప్రభావం కూడా అంతే లోతుగా పడుతోంది. ఇక అందరూ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ ప్రపంచాన్ని నిర్మించడానికి భూమిని వేడెక్కించడం ఎంతవరకు కరెక్టు? మీరే ఆలోచించండి.. సమాధానం మీకే అర్థమవుతుంది!

ALSO READ: ఇతర గ్రహాలకు వెళ్లాల్సిందేనా? భూమిని నాశనం చేస్తున్న మానవుడు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *