Menu

Humans are very stupid: ఇతర గ్రహాలకు వెళ్లాల్సిందేనా? భూమిని నాశనం చేస్తున్న మానవుడు!

Praja Dhwani Desk 3 months ago
what is a climate change explained in telugu

మనిషి అణువును చీల్చగలిగాడు.. DNAని చదవగలిగాడు.. అంతరిక్షంలోకి యంత్రాలను పంపగలిగాడు.. కానీ తన ముందే జరుగుతున్న నాశనాన్ని ఆపలేకపోతున్నాడు. ఇది అజ్ఞానం కాదు.. తెలిసే చేసి చేస్తున్న తప్పు. ఒక వైపు యుద్ధాలు.. మరో వైపు చమురు కోసం పోరాటాలు.. ఇంకో వైపు వేడెక్కుతున్న భూమి.. ఇవి మూడు వేర్వేరు సమస్యలు కావు..ఇవి ఒకే నిజానికి ఉన్న మూడు ముఖాలు.

ప్రపంచ చమురులో ఐదో వంతు వెళ్లే మార్గం హార్ముజ్‌ దగ్గరే యుద్ధం మొదలైంది.. రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ వెళ్లే హార్ముజ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది.. ఇదే సమయంలో భూమి ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకున్నాయి.. 1.5 డిగ్రీల గీత దాటిపోయింది.. ఇన్ని హెచ్చరికలు కనిపిస్తున్నా మనిషి మారడంలేదు. ఇంతకీ మనిషి సమస్యలను పరిష్కరించే జీవా? లేదా సమస్యలను సృష్టించే జీవా?

యుద్ధం ప్రభావం ఇప్పుడు కేవలం బాంబులు పడుతున్న ప్రాంతానికే పరిమితం కాదు. షిప్పింగ్ వ్యవస్థ మొత్తం ఒత్తిడిలో పడింది. హార్ముజ్ ప్రాంతంలో నౌకల కదలికలు తగ్గడంతో గ్లోబల్ సరఫరా చైన్ దెబ్బతింటోంది. ఇన్సూరెన్స్ ప్రీమియాలు కొన్ని చోట్ల 200 శాతం వరకు పెరిగాయి. అంటే ఒక ట్యాంకర్ ప్రయాణ ఖర్చు ఒక్కసారిగా రెట్టింపు అవుతోంది. అదే ఖర్చు చివరకు ప్రపంచ మార్కెట్‌పై పడుతోంది.

ఇక్కడ మరో పెద్ద ప్రమాదం సముద్ర కాలుష్యం. ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ దెబ్బతింటే లక్షల టన్నుల చమురు సముద్రంలో కలిసే ప్రమాదం ఉంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఇలాంటి సంఘటనల ప్రభావం 10 నుంచి 30 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. పగడపు తీగలు పూర్తిగా నశిస్తాయి. చేపల ఉత్పత్తి తీవ్రంగా పడిపోతుంది. సముద్ర ఆహార గొలుసు కూలిపోతుంది. అంటే ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు… ఆహార భద్రత సమస్య కూడా. ఇది జరుగుతున్న సమయంలో భూమి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది.

గత దశాబ్దంలో నమోదైన ప్రతి ఏడాది అత్యంత వేడిగా ఉన్న సంవత్సరాల జాబితాలోకి చేరింది. 2024లో ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రీ ఇండస్ట్రియల్ స్థాయితో పోలిస్తే 1.5 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగాయి. ఇది వాతావరణ మార్పుల్లో ఒక కీలక మలుపు. ఇక్కడి నుంచి మార్పులు వేగంగా జరుగుతాయి.

అయితే ప్రపంచం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే మరో సీన్ కనిపిస్తుంది. గ్లోబల్ మిలిటరీ ఖర్చులు 2 ట్రిలియన్ డాలర్లను దాటాయి. అదే సమయంలో క్లైమేట్ సమస్యలపై పెట్టుబడులు సరిపోయేలా లేవు. అంటే మనిషి ఏ దిశలో డబ్బు ఖర్చుచేస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ప్రభావం చివరికి సాధారణ మనుషుల మీద పడుతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలు తమ LNG సరఫరాలో పెద్ద భాగాన్ని ఈ ప్రాంతంపైనే ఆధారపడి ఉంటాయి. అక్కడ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 40 నుంచి 50 శాతం మధ్య ఉంటుంది. సరఫరా దెబ్బతింటే విద్యుత్ కొరత, ధరల పెరుగుదల తప్పదు. అంటే యుద్ధం ఎక్కడ జరిగినా.. దాని దెబ్బ ప్రపంచంలోని సామాన్యులనే ముందుగా తాకుతుంది.

నిజానికి ఇలా జరుగుతుందని మనిషికి ముందే తెలుసు.. వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసు. అయినా అదే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నాడు. ఇది ఇలానే కొనసాగితే స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పినట్టు మనిషికి భూమి కాకుండా మరో గ్రహం నీడ కావాల్సి రావచ్చు!

ALSO READ: ప్రాణాలకు ముప్పుగా మారుతోన్న ఆఫీస్‌ వర్క్ కల్చర్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *