మౌనంగా మొదలయ్యే కొన్ని కథలుంటాయి.. వాటికి శబ్దం ఉండదు కానీ వాటి భావాల బరువు మాత్రం మోయలేనంతగా ఉంటుంది..నవ్వుల్లో కనిపించని అలసటలా.. మాటల్లో బయటపడని బాధలా.. మనసులో నెమ్మదిగా చేరి.. చెప్పలేని నిజాలుగా మారే కథలు అవి..! మన చుట్టూ ఉండే అమ్మ కథలు కూడా అలానే ఉంటాయి.
అమ్మ అవ్వడం అనేది కొందరికి కల అయితే.. కొందరికి అది ఒక వల. ఇది ఎవరో చేసిన కామెంట్ కాదు, కొంతమంది మహిళలు తమ అనుభవాల ఆధారంగా చెప్పిన నిజమైన భావన. మన సమాజంలో ‘అమ్మ’ అంటే ప్రేమ, త్యాగం, పవిత్రతకు ప్రతీక. చిన్నప్పటి నుంచే అంతా మనకు నేర్పించేది కూడా అదే. కానీ అందరి అనుభవం ఒకేలా ఉంటుందా? కచ్చితంగా కాదు. చిన్నప్పటి నుంచి మనం విన్న కథల్లో అమ్మ ఎప్పుడూ బలంగానే ఉంటుంది.. కానీ నిజ జీవితంలో ఆమె కూడా ఒక మనిషే.. ఆమె కూడా అలసిపోతుంది.. అయోమయపడుతుంది.. కొన్ని సార్లు తనని తాను అర్థం చేసుకోవడానికే సమయం తీసుకుంటుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం, కొంతమంది మహిళలు తల్లి అయిన తర్వాత తమ జీవితంలో వచ్చిన భారీ మార్పులతో షాక్ అవుతున్నారు. మేము పిల్లల్ని ద్వేషించడం లేదు కానీ తల్లితనం వల్ల వచ్చిన జీవితాన్ని మేం ఊహించలేదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు. వారు ఊహించుకున్న జీవితం, నిజంగా ఎదురైన జీవితం మధ్య గ్యాప్ చాలా పెద్దగా ఉంది.
ముఖ్యంగా పెళ్లి తర్వాత సమాజం నుంచి వచ్చే “గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు?” అనే ఒత్తిడి వాళ్లను త్వరగా నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. చాలామంది నిజంగా రెడీ కాకపోయినా, ఇది లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ అని భావించి తల్లితనంలోకి వెళ్లిపోతున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు తనకు ఉన్న స్వేచ్ఛ, టైమ్, కెరీర్ ఇలా అన్నీ మెల్లగా తగ్గిపోతాయి. “నా లైఫ్ ఇక నా చేతుల్లో లేదు” అని ఒక మహిళ చెప్పిన మాట చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. ఇది కేవలం బిజీ షెడ్యూల్ కాదు, ఒక ఐడెంటిటీ మారిపోవడం. ఇంతకుముందు “నేను” అనిపించిన వ్యక్తి, ఇప్పుడు “అమ్మ” అనే ఒక్క పాత్రలో మాత్రమే పరిమితం అవుతున్న భావన చాలా మందిలో కనిపిస్తోంది.
ఇది ఒక్కసారిగా జరిగిపోదు.. నెమ్మదిగా జరుగుతుంది.. ఒక రోజు గమనిస్తే, తనకోసం ఉన్న సమయం, తనకోసం ఉన్న ఆలోచనలు..ఇలా అన్నీ ఎక్కడో వెనుకపడిపోయినట్టు అనిపిస్తుంది. ఇదికాకుండా మానసిక ఒత్తిడి కూడా పెద్ద కారణమే. తల్లితనం అంటే 24 గంటల బాధ్యత. నిద్రలేమి, నిరంతరం పిల్లల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి, ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం.. ఇవి శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా అలసటకు దారితీస్తాయి. కొంతమంది మహిళలు తమకు ఎప్పుడూ అలసిపోయినట్టే ఉంటుందని.. కానీ ఎవరూ మమ్మల్ని అర్థం చేసుకోరని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. నిద్ర లేకుండా గడిచే రాత్రులు, ఆగని ఆలోచనలు, ఒక క్షణం ప్రశాంతంగా కూర్చోవాలన్న కోరిక కూడా క్రమంగా కలలా మారిపోతుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సపోర్ట్ లేకపోవడం. సమాజం పిల్లలు కనమంటుంది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ బాధ్యత మొత్తం అమ్మపై పడుతుంది. చాలామంది మహిళలు “మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు… అన్నీ మేమే చేయాలి” అని చెప్పడం గమనార్హం. ఇంకా కొంతమంది మహిళలు బాధ్యత లేని భర్తలకు తన పిల్లల బాధ్యత అప్పజెప్పలేక, వారి నుండి దూరంగా ఉంటూ తమ పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు. ఈ బాధ్యతల నడుమ వాళ్ళు పడే వేదన అంతా ఇంతా కాదు. ఇది వాళ్లలో ఒంటరితనాన్ని పెంచుతుంది. ఒకప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్న కనెక్షన్ కూడా తగ్గిపోవడం వాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. మధ్యలో ఎవరూ లేని ఒక ప్రయాణం లాగా మారుతుంది జీవితం… చుట్టూ జనాలు ఉన్నా… లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతూనే ఉంటుంది.
అత్యంత సెన్సిటివ్ విషయం ఏమిటంటే.. కొంతమంది మహిళలు తమ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. “ముందే తెలిసి ఉంటే ఈ నిర్ణయం తీసుకునేదాన్ని కాదు” అని చెప్పడం మన సమాజంలో చాలా అరుదుగా వినిపించే మాట. అది వాళ్ళ జీవితాన్ని కోల్పోవటం వల్ల కావొచ్చు..లేక జీవితంలో అలసిపోయి ఒంటరిగా ఫీల్ అవటం వల్ల కావొచ్చు. అలాంటి మాటలు విన్నప్పుడు తల్లితనం గురించి నెగటివ్‌గా మాట్లాడుతూ ఉంటారు అందుకే చాలా మంది తమ ఫీలింగ్స్‌ను బయటపెట్టలేక మౌనంగా లోపలే బాధపడుతున్నారు. మాటలు బయటకు రావు… కానీ భావనలు ఆగవు… అవి లోపలే తిరుగుతూనే ఉంటాయి… మౌనంగా మనసును నింపేస్తాయి.
అయితే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి అమ్మకు వర్తించదు. చాలా మంది మహిళలు తల్లితనంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ రిపోర్ట్ చూపించింది మరో కోణం.. ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడని సైడ్. తల్లితనం ఒక గొప్ప అనుభవమే… కానీ అది ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం కాకుండా, వ్యక్తిగతంగా సిద్ధమైనప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కావాలి. అప్పుడే ఆ ప్రయాణం అందంగా ఉంటుంది… లేకపోతే అదే ప్రయాణం ఒక భారంగా అనిపించే అవకాశం ఉంటుంది.
చివరిగా ఒక ప్రశ్న … మన సమాజం “అమ్మ అవ్వాలి” అని చెబుతోంది… కానీ “అమ్మగా ఉండే జీవితానికి నిజంగా మీరు రెడీనా?” అని ఎప్పుడైనా అడుగుతుందా? ఇదే ఆలోచించాల్సిన విషయం… ఇదే ఈ కథ మనకు ఇచ్చే మెసేజ్. ఎందుకంటే ప్రతి కొత్త జీవితం మొదలవ్వడానికి ముందు… ఒక మనసు సిద్ధం కావాలి.
ALSO READ: ప్రశ్నిస్తే ఉ*రి! టీనేజర్లపై ఇరాన్ క్రూరత్వం

Sudan Civil War: యుద్ధభూములుగా మారిన నగరాలు.. మానవతా సంక్షోభానికి దారితీసిన సూడాన్ సివిల్ వార్!
AI Data centres: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. డేటా సెంటర్లతో ప్రపంచానికి ముప్పు!
Oracle’s layoffs Explained: 30వేల ఉద్యోగాలు ఊస్ట్.. దిగ్గజ కంపెనీ నిర్ణయంతో టెన్షన్లో ఐటి సెక్టర్!
Humans are very stupid: ఇతర గ్రహాలకు వెళ్లాల్సిందేనా? భూమిని నాశనం చేస్తున్న మానవుడు!
Workplace Mental Health Crisis: ప్రాణాలకు ముప్పుగా మారుతోన్న ఆఫీస్ వర్క్ కల్చర్!
Satish Chander: జాబితా నుంచి పేరు కాదు.. నిజాన్ని తీసేశారు..!