Menu

Queer Fiesta: ప్రేమకు రంగులు..ప్రతిభకు రెక్కలు.. హైదరాబాద్‌లో క్వీర్ ఫియస్టా!

Tri Ten B (Triya) 2 months ago

✨ Quick Read

  • జూన్ 28న హైదరాబాద్‌లో క్వీర్ ఫియస్టా
  • LGBTQ+ టాలెంట్‌కు ప్రత్యేక వేదిక
  • ఎంట్రీ పూర్తిగా ఫ్రీ

AI-assisted summary, newsroom reviewed

పుట్టిన క్షణం నుంచే మనిషి జీవితంపై తీర్పులు మొదలైపోతాయి. పేరు పెడతారు. మతం నిర్ణయిస్తారు. కులం రాస్తారు. సరిహద్దులు గీస్తారు. ఎవరు ఎలా ఉండాలో చెబుతారు. ఎవరిని ప్రేమించాలో కూడా నిర్ణయిస్తారు. ఒక ట్రాన్స్‌జెండర్ తన గుర్తింపుతో గౌరవంగా జీవించాలంటే అనుమానాల చూపులు వెంటాడతాయి. ఒక గే తన ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపరచాలంటే తీర్పులు వెంటపడతాయి. ఒక లెస్బియన్ తన జీవితాన్ని తనే ఎంచుకోవాలంటే తిరస్కారమే ఎదురవుతుంది. గుర్తింపులు వేరు. కలలు మాత్రం ఒక్కటే. ప్రతి మనిషిలాగే ప్రేమించాలనే కోరిక… గౌరవంగా బతకాలనే ఆశ… ఆత్మగౌరవంతో నిలబడాలనే తపన ఒక్కటే.

ప్రతి జూన్ ప్రైడ్ మంత్ ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకరి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క అడుగు ముందుకు వేయడం… ఒకరిని గౌరవంగా పలకరించడం… ఒకరి ప్రతిభను గుర్తించడంతోనే మార్పు మొదలవుతుంది. ఆ మార్పును కళతో, సంగీతంతో, ప్రతిభతో, ఆత్మవిశ్వాసంతో జరుపుకుంటూ.. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో క్వీర్ ఫియస్టా(Queer Fiesta) వేలాది మందిని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. జూన్ 28న మరోసారి ఆ రంగుల ప్రయాణానికి హైదరాబాద్‌ సాక్ష్యం కానుంది.

queer fiesta 202

ఎన్నో అవకాశాలకు వేదిక:

ఎన్నో ఏళ్లుగా మౌనానికి అలవాటు పడిన గొంతులు… ఈసారి వేల మంది ముందు పాట పాడబోతున్నాయి. గుర్తింపు కోసం ఎదురుచూసిన ఎన్నో జీవితాలు… ఒక్కరోజైనా తమలాగే నవ్వే మనుషుల మధ్య నిలబడబోతున్నాయి. క్వీర్ ఫియస్టాలో ఒకరు పాట పాడతారు. ఇంకొకరు డ్యాన్స్ చేస్తారు. మరొకరు తమ ఆర్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఎవరో తమ చిన్న బ్రాండ్‌ను మొదటిసారి జనాల ముందుకు తీసుకొస్తారు. ఇంకెవరో ఎన్నో ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధను ఎంతో ధైర్యంగా బయటకు చెబుతారు. బయటివాళ్లకు ఇవి చిన్న చిన్న క్షణాల్లా కనిపించొచ్చు. ఆ స్టేజ్‌పై నిలబడే ప్రతి ఒక్కరికీ మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వేదిక ఎన్నో జీవితాల ప్రయాణం. ఎన్నో తిరస్కారాల తర్వాత కూడా విరగని ఆత్మవిశ్వాసం. మనిషిని జడ్జ్ చేయడం ఎంత సులభమో… అర్థం చేసుకోవడం అంత గొప్పదని గుర్తు చేసే మరో అవకాశం.

ప్రైడ్ మంత్‌ను జూన్‌లోనే ఎందుకు నిర్వహిస్తారు?

1969లో అమెరికాలో జరిగిన స్టోన్‌వాల్ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జూన్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రైడ్ మంత్‌గా నిర్వహిస్తారు. LGBTQ+ హక్కులు, సమానత్వం, గౌరవం గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం.

క్వీర్ ఫియస్టాకు LGBTQ+ కమ్యూనిటీ సభ్యులే రావాలా?

కాదు. క్వీర్ ఫియస్టా వంటి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్థులు, ఉద్యోగులు, మిత్రులు సహా LGBTQ+ కమ్యూనిటీకి మద్దతు తెలిపే ఎవరైనా పాల్గొనవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు పరస్పర అవగాహన, ఆమోదం, సమానత్వాన్ని ప్రోత్సహించే వేదికలుగా ఉంటాయి.

అందుకే ఈ వేదికకు ఎనిమిదేళ్ల చరిత్ర ఉంది. ఒక కార్యక్రమం ఇంతకాలం కొనసాగాలంటే రంగుల జెండాలు ఒక్కటే సరిపోవు. దాని వెనుక ఒక నమ్మకం ఉండాలి. ప్రతి మనిషిలో దాగి ఉన్న ప్రతిభకు ఒక అవకాశం దొరికితే… సమాజం చూసే చూపే మారుతుందనే నమ్మకం. ఆ ఆలోచనతోనే మొబెరా ఫౌండేషన్( Mobbera Foundation) ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిందని చెబుతున్నారు ఆ సంస్థ ప్రెసిడెంట్‌ శాండి. కమ్యూనిటీకి ఒక సేఫ్ స్పేస్ ఉండాలని… తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించుకునే వేదిక ఉండాలని అంటున్నారు. ఇదే ఆలోచన ప్రతి ఏడాది వేలాది మందిని ఒక్కచోటికి తీసుకొస్తోందంటున్నారు.

Queer Fiesta 2026 in Hyderabad is a major community Pride celebration hosted by the Mobbera Foundation in collaboration with Communitie. The festival takes place on June 28th, 2026.

Queer Fiesta (Representative image)

నిజానికి ఈ వేదికపై వినిపించే చప్పట్లు కేవలం పాటలకు, డ్యాన్స్‌లకు, స్టాల్స్‌ మాత్రమే పడవు. ఎన్నాళ్లుగానో కనిపించకుండా మిగిలిపోయిన ప్రతిభకు పడతాయి. స్టేజ్ మీద వెలుగులు మాత్రమే వెలగవు. ఎన్నో ఆత్మవిశ్వాసాలు వెలుగులోకి వస్తాయి. ఒక చిన్న బిజినెస్‌కు కొత్త కస్టమర్ దొరకొచ్చు. ఒక ఆర్టిస్ట్‌కు కొత్త అవకాశం దొరకొచ్చు. ఒక కంపెనీకి కొత్త టాలెంట్ కనిపించొచ్చు. గతంలో ఒక ట్రాన్స్‌ మహిళ తయారు చేసిన జూట్ బ్యాగ్స్ పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఒక చిన్న స్టాల్ కూడా జీవితాన్ని మార్చే అవకాశంగా మారుతుందనే విషయాన్ని ఇలాంటి ఘటనలు నిరుపిస్తాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ వేదికకు వస్తుంటాయి. ఉద్యోగాలు ఇవ్వాలనే బాధ్యతతో కాదు… టాలెంట్‌ను గుర్తించాలనే ఆలోచనతో ముందుకు వస్తాయి. ఒక అవకాశం దొరికితే తమను తాము నిరూపించుకోవడానికి LGBT కమ్యూనిటీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

క్వీర్ ఫియస్టా ఎక్కడ జరగనుంది?

అందుకే డేట్‌ గుర్తుపెట్టుకోండి. జూన్ 28న మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌లో క్వీర్ ఫియస్టా జరగనుంది. ఎంట్రీ పూర్తిగా ఫ్రీ. మ్యూజిక్, డ్యాన్స్, డ్రాగ్ పెర్ఫార్మెన్స్‌లు, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, లోకల్ బ్రాండ్స్, ఫుడ్ స్టాల్స్, కమ్యూనిటీ ఇంటరాక్షన్స్… ఇలా ఒక్కరోజు మొత్తం రంగులతో నిండిపోనుంది. వాస్తవానికి కొన్ని విజయాలు చట్టాల్లో కనిపిస్తే.. ఇంకొన్ని విజయాలు మాత్రం మనుషుల మనసుల్లో పుడతాయి. క్వీర్ ఫియస్టా అలాంటి విజయాల కథ. ఒక రోజులో సమాజాన్ని మార్చేయకపోవచ్చు. ఒక మనిషి చూపును మాత్రం మార్చగలదు. కొన్నిసార్లు అదే మార్పు… ఒక జీవితాన్ని పూర్తిగా మార్చడానికి సరిపోతుంది.

ALSO READ: “మమ్మల్ని అందరూ మధ్యలో వదిలేసేవాళ్లే…” సమాజాన్ని న్యాయస్థానంలో నిలబెట్టిన ‘LGBT: A Legal Battle’


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *