Menu

G7 News: ఉద్యోగులకు రియల్‌ఎస్టేట్ గణేశ్‌, షఫీ పంగనామాలు పెట్టారా?

Masked Voice 3 months ago
g7 ganesh motivational speaker shafi cheating employees allegations

ఆహా..ఓహో అన్నారు..! ఇక్కడ చేరితే మీ జీవితాలే మారిపోతాయని నమ్మబలికారు. మంచి ఉద్యోగాలు వదిలి చాలామంది జర్నలిస్టులు ‘G7’ బాటపట్టారు. ఇన్‌ఫ్రా చూపించి మరీ మోసం చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆఫర్‌ లెటర్లు కూడా అఫిషియల్‌గా ఇవ్వడంతో మంచి కంపెనీనే కావొచ్చని చాలా మంది నమ్మారు. ఇలా జనవరిలో మొదలైన రియల్‌ఎస్టెట్‌ గణేశ్‌ G7 ఛానెల్‌ తొలి నెల జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను హింసపెడుతోందన్నది ఎంప్లాయిస్‌ మాట. ఇటివలే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న గణేశ్‌ కుటుంబం మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో దుమ్ము రేపింది కూడా. ఎన్నికల కోసం ప్రచారాలు చేసుకోవడానికి సమయమున్న ఆయనగారికి ఆఫీస్‌లో ఉద్యోగులు పడుతున్న బాధలు మాత్రం కనిపించకపోవడం దుర్మార్గమనే వాదన వినిపిస్తోంది.

ఈ ఛానెల్‌ ప్రారంభానికి ముందు V Media అనే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి కొండపల్లి గణేశ్‌ ఇంటర్వూ ఇచ్చారు. ఛానెల్‌కి ఈ పేరు పెట్టడానికి ఓ కారణం చెప్పారు. G అంటే గాడ్‌ అంట.. 7 అంటే ఏడుకొండలు అంట.! 7 అనేది ఆయన లక్కీ నంబర్ అంట..! ఇలా దేవుడు పేరు వాడుకొని జనాలను మోసం చేయడం ఎంత ఘోరమైన విషయం? ఏడుకొండల పేరు వాడుకొని ఉద్యోగులకు పంగనామాలు పెడతారా? ప్రభుత్వ రూల్స్‌ ప్రకారం.. 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని తెలియదా? వీళ్లకి పార్టీలు టికెట్లు ఎందుకు ఇస్తున్నాయి? డబ్బు ఉంటే చాలు.. టికెట్లు ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మీడియా అంటే ఫ్రాంచైజీలు చేసుకుని అమ్ముకునే వ్యాపారం కాదు.

ప్రజల కోసం, పాజిటివ్ కథల కోసం తమ ఛానెల్‌ను చూడాలని చెప్పిన గణేశ్‌.. ఉద్యోగుల కష్టాన్ని చూశారా? ఆ స్టూడియోలో కెమెరాలు తిరిగిన ప్రతిసారీ ఒక ఉద్యోగి రాత్రిళ్లు నిద్ర మానేసి పనిచేసిన ఘటనలున్నాయి. ప్రతీ ఉద్యోగికి ఇల్లు ఉంటుంది.. ఆ ఇంటికి అద్దె ఉంటుంది.. లేదా లోన్‌ ఉంటుంది. పిల్లల స్కూల్ ఫీజు ఉంటుంది. వృద్ధ తల్లిదండ్రుల మందుల ఖర్చులుంటాయి. జీతం అంటే కేవలం డబ్బు కాదు. అది ఒక కుటుంబం గౌరవం.. ఒక ఇంటి భరోసా. కానీ జీతాలే ఇవ్వకుండా ఉంటే ఎలా? పైగా నెల కూడా గడవకముందే చాలా మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేశారు. కారణాలు కూడా సరిగ్గా చెప్పలేదట. డబ్బులు ఇవ్వలేక కావొచ్చు. ఇది శ్రమ దోపిడీకి మొదటి రూపం.

ఈ ఛానెల్‌ నడుపుతున్న వ్యక్తి పేరు షఫీ! ఆయనో మోటివేషనల్‌ స్పీకర్ అట. సెక్యూలర్‌ అట.. అన్ని మతాలను గౌరవిస్తాడట..! ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తూ యూట్యూబ్‌లో పరమ పతివ్రతా డైలాగులు చెప్పడాన్ని హిపోక్రసీ అంటారు. అన్ని మతాలను గౌరవిస్తే మీ పేరును డేవిడ్‌ రామ్‌ షఫీగా మార్చుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..అంతేకానీ మంచి ముసుగులో మనుషులను మోసం చేయకూడదు కదా.

అప్పు గురించి.. రుణ బాధల నుంచి బయట పడటానికి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన ఈ పెద్ద మనిషి.. తాను నిర్వహిస్తున్న కంపెనీ ఉద్యోగులు జీతం రాక అప్పులపాలు అవుతున్నది కనిపించడం లేదా? నీతులు చెప్పే నోటితోనే యాజమాన్యానికి మన ఎంప్లాయిస్‌కి జీతాలు ఇప్పించండి అని చెప్పడానికి నోరు పెగల్లేదా?

నిజానికి మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఈ కాలంలో కొత్త వ్యాపారం. వేదికపై నిలబడి కలలు అమ్మడం సులువు. కష్టపడండి, జీవితాన్ని మార్చుకోండి అంటూ మాటలతో మంటలు రేపడం ఈజీ. కానీ అదే వేదిక వెనుక పనిచేసే ఉద్యోగుల కష్టాన్ని గౌరవించడం మాత్రం కష్టం. స్ఫూర్తి అనే పదాన్ని ప్యాకేజింగ్ చేసి అమ్మే ఈ మార్కెట్‌లో అసలు స్ఫూర్తి ఎవరికీ దక్కడం లేదు. శ్రమ చేసే వాడికి కాదు. రాత్రింబవళ్లు కంటెంట్ తయారు చేసే యువకుడికి, కుటుంబ భవిష్యత్తు కోసం స్థిరమైన ఉద్యోగం కావాలని ఆశించిన యాంకర్లను నట్టేటా ముంచడం ఏ రకమైన మోటివేషన్? మాటలు కోట్లలో తిరుగుతుంటే.. జీతాలు మాత్రం వాయిదాలలో తిరుగుతాయా?

ఆధ్యాత్మికత కూడా ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. దేవుడి పేరు ముందు పెడితే నమ్మకం వస్తుందని తెలుసు. ఏడుకొండలు అన్నా భావోద్వేగం వస్తుందని తెలుసు. విశ్వాసం అనేది ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన మూలధనం. ఆ విశ్వాసాన్ని వ్యాపార మోడల్‌గా మార్చడం ఈ కాలం నేర్పిన కొత్త పాఠం. కానీ దేవుడి పేరు వాడే ముందు ఒకసారి ఆలోచించాలి. దేవుడి పేరుతో ప్రారంభించిన సంస్థలో పని చేసే మనిషికి న్యాయం చేయలేకపోతే ఆ దైవ ప్రతీకకు అర్థమేంటి? విశ్వాసం మీద నిలబడి శ్రమను విస్మరించడం ఏ ధర్మం?

మీడియా అంటే నాలుగో స్థంభం అంటాం. కానీ ఆ స్థంభం లోపల పనిచేసే కార్మికుడి హక్కు బలహీనమైతే ఆ స్థంభం బలంగా నిలబడుతుందా? ప్రజల సమస్యలు చెప్పే వేదిక తనలోని సమస్యలను పరిష్కరించలేకపోతే అది విశ్వసనీయత కోల్పోదా?

నిజానికి శ్రమను గౌరవించని ప్రతి నిర్మాణం చివరికి కూలిపోతుంది. మాటలతో సామ్రాజ్యాలు కట్టొచ్చు. కానీ న్యాయం లేకుండా నిలబెట్టలేరు. ఉద్యోగి కష్టం కేవలం వేతన పట్టికలో ఒక సంఖ్య కాదు. అది ఒక కుటుంబ గౌరవం. అది ఒక తల్లి నమ్మకం. అది ఒక పిల్లవాడి భవిష్యత్తు. ఆ గౌరవాన్ని వాయిదా వేయడం అంటే శ్రమను చిన్నచూపు చూడడం. ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడి పేరు ముందు పెట్టడం కంటే మనిషి శ్రమకు గౌరవం ఇవ్వడం పెద్ద పుణ్యం. కానీ నరానరాన పాపాలే చక్కర్లు కొడుతుంటే ఇక ఆ మనిషిని ఏం అని పిలవాలో ఆ దేవుడికే తెలియాలి!

ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *