Menu

Cockroach Janata Party: కాక్‌రోచ్‌లతో పాటు పెంటపురుగులు కూడా ఏకం కావాల్సిందే! మీ బయాలజీ క్లాసులు తగలయ్యా..!

Tri Ten B (Triya) 2 weeks ago
cockroach janata party explained in telugu

వచ్చారండీ పెద్ద మేధావులు.. బొద్దింకలపై ఉపన్యాసాలు దంచుతున్నారు. బొద్దింకలను చూస్తే అసహ్యమట..అవి పరమనీచంగా కనిపించే జీవులట..! నిజమే..! వాటి ఆకారం వికారంగానే ఉంటుంది కానీ మీ మనుసులో నాటుకుపోయిన విషాన్ని బయటకు తియ్యలంటే మాత్రం మీ శరీరంలో ఎక్కడైనా గొడ్డుకారం కొట్టినా సరిపోదు. ఎందుకంటే మీ మతం, మీ దేశభక్తి, మీ కులాభిమానం కంటే బొద్దింకల గుణమే నయం. అవి చెత్తలో బతుకుతాయి కానీ చెత్త బుద్ధితో బతకవు. ఆ చీఫ్‌ జస్టిస్‌ గారు పరమ చీప్‌గా, నోటికి వచ్చినట్టుగా నిరుద్యోగులను కోక్‌రోచ్‌లతో పోల్చి బొద్దింకలను రెచ్చగొట్టి అగ్నికి ఆజ్యంపోశారు కానీ అసలు కంపును మాత్రం బయటపెట్టింది బీజేపీ సన్యా(న్నా)సులే..! కోక్‌రోచ్‌ జనాతా పార్టీ(CJP) పేరుతో ఓ సెటైరికల్‌ మీమ్‌ పేజీ క్రియేట్ చేసిన పాపానికి 30ఏళ్ల అభిజిత్‌ దీప్కేను చంపుతామని బెదిరించేంత స్థాయికి దిగజారారు సనాతన భక్తులు. ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా CJP మీమ్‌ పేజీకి సపోర్టు చేసినవాళ్లని పాకిస్థాన్‌ యువతతో పోల్చి తమ అంధ దేశభక్తిని చాటుకుంటున్నారు. పనిలో పనిగా బొద్దింకల లక్షణాలను, వాటి స్వభావాన్ని ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్ల తరహాలో, ఇంకా చెప్పాలంటే మహాటీవీ యాంకర్‌ వంశీ లెవల్‌లో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

✨ Quick Read

  • CJPపై సోషల్‌మీడియాలో తీవ్ర రాజకీయ రచ్చ
  • అభిజిత్‌ దీప్కేకు బెదిరింపులు
  • నిరుద్యోగ యువత కోపంపై బిగ్ డిబెట్

AI-assisted summary, newsroom reviewed

యువత బాధ పట్టడంలేదా?

నిజానికి ఈ దేశంలో బొద్దింకల కంటే ఎక్కువగా కనిపించేది నిరాశా నిస్పృహలతో బతికే యువతే . డిగ్రీలు పట్టుకుని ఇంట్లో కూర్చున్న లక్షల మంది యువతలో అసహనం మండుతోంది. ఒకవైపు ఉద్యోగాలు లేక యువత పిచ్చెక్కిపోతుంటే మరోవైపు అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం లైట్లు ఆపండి, పెట్రోల్‌ సేవ్‌ చేయండి, గ్యాస్‌ తక్కువ వాడండంటూ మధ్యతరగతి బతుకుల మీదే ఆర్థిక సంస్కరణల ఎక్స్‌పెరిమెంట్లు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినా, రూపాయి విలువ నేలచూపులు చూసినా, ధరలు ఆకాశాన్ని తాకినా, చదివిన వాళ్లకి ఉద్యోగం దొరక్కపోయినా అసలు సమస్య మాత్రం మీమ్‌ పేజీలా కనిపిస్తుంటే ఏం అనాలో ఏమో. ఎందుకంటే ఆకలితో ఉన్న యువకుడు ప్రశ్న అడిగితే అది ప్రభుత్వానికి దేశద్రోహంలా కనిపిస్తోందట.

నీట్ పరీక్ష నీట్ గా పెట్టడం రాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులగా మార్చి బొద్దింకలు, పరాన్నజీవులు అని అవమానిస్తే తిరగబడటం నేరం. 12 ఏళ్లుగా without స్క్రిప్ట్ press meet కు రాని ప్రధానికి.. మెలోడీ చాక్లేట్లతో selfie వీడియోలు తీసుకునేందుకు టైం ఉంటుందా?? అని క్వశ్చన్ చెయ్యడం ఇంకా ఘోరమైన తప్పు.

మీ బయాలజీ తగలయ్యా:

అసలు కామెడీ ఏంటంటే ఇప్పుడు బీజేపీ భక్తులు బొద్దింకలపై బయాలజీ క్లాసులు ఇస్తున్నారు. అవి ఎంత మురికిగా ఉంటాయో, ఎంత ప్రమాదకరమో, ఎలా చంపాలో దేశానికి అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఈ దేశ గాలి విషపూరితం కావడానికి కారణం బొద్దింకలా? నదులు చచ్చిపోవడానికి కారణం బొద్దింకలా..? అడవులు మాయమవ్వడానికి కారణం బొద్దింకలా..? మతం పేరుతో మనుషులను ఒకరిపై ఒకరిని రెచ్చగొడుతున్నది బొద్దింకలా..? కోట్ల రూపాయల స్కాములు చేసి దేశ సంపద మింగేస్తున్నది బొద్దింకలా..? ప్రకృతిని కాల్చి కాంక్రీట్‌ అడవులు కడుతున్నది బొద్దింకలా..? కాదు కదా..! ఇవన్నీ చేస్తున్నది గొప్ప నాగరిక మనిషే. అందులోనూ వీటిని ప్రోత్సహించేది ఉన్మాద ప్రభుత్వ అధికారులు, నాయకులే!

CJPకి మద్దతు ఇస్తున్నవాళ్లు నిజంగానే రాజకీయ ఉద్యమం చేస్తున్నారా?

ప్రస్తుతం CJP ఎక్కువగా డిజిటల్ నిరసన, మీమ్ కల్చర్ రూపంలోనే కనిపిస్తోంది. అయితే నిరుద్యోగం, జీవన వ్యయం, రాజకీయ అసంతృప్తి వంటి అంశాలపై యువత భావోద్వేగాలను ఇది ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌లో యువ నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉంది?

పలు లేబర్‌ సర్వేలు, మార్కెట్‌ డేటా ప్రకారం 15-29 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం డబుల్ డిజిట్ స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉద్యోగ పోటీ మరింత పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

బొద్దింకలు కనీసం ప్రకృతి చక్రంలో తమ పని చేసుకుంటూ బతుకుతాయి. అవి ఎకోసిస్టమ్‌లో డీకంపోజిషన్‌ ప్రాసెస్‌లో భాగమవుతాయి. చెత్తను కరిగిస్తాయి. కొన్ని జీవులకు ఆహారమవుతాయి. అంటే ప్రకృతికి ఉపయోగపడతాయి. కానీ మనిషి మాత్రం భూమ్మీద అత్యంత తెలివైన జీవినని చెప్పుకుని చివరికి భూమినే నాశనం చేస్తున్నాడు. తీవ్ర వాతావరణ మార్పులకు కారణం బొద్దింకలు కాదు.. యుద్ధాలు చేస్తున్నది బొద్దింకలు కాదు.. మత హింస పెంచుతున్నది బొద్దింకలు కాదు. అధికార దాహంతో సమాజాన్ని విడగొడుతున్నది కూడా బొద్దింకలు కాదు. అయినా అసహ్యంగా కనిపించేది మాత్రం బొద్దింకలేనట..!

ఇంకో గొప్ప విషయం కూడా ఉంది. సోషల్‌ మీడియాలో ఓ సెటైర్‌ పేజ్‌ వైరల్‌ అవుతుంటే దేశ భద్రతకే ముప్పొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక మీమ్‌ పేజ్‌ని చూసి వణికిపోతున్నారంటే అసలు భయం బొద్దింకలపైనా లేదా యువత తలచుకుంటే మీ సీటు కింద కుర్చీ విరిగిపోతుందనా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ అలసిపోయిన తరం లోపల మరిగిపోతున్న అసహనాన్ని చూసి బీజేపీకి నడ్డి విరిగినంత పనైంది. కాంగ్రెస్‌ మేధావులు ఏళ్ల తరబడి తీసుకురాలేని ఐక్యతను ఓ మీమ్‌ పేజ్‌ తీసుకొచ్చింది. అయితే నిరుద్యోగుల బాధను అర్థం చేసుకునే బదులు పాకిస్థాన్‌ ట్యాగులు వేసి, ఫేక్‌ నేరేటివ్‌లు నెట్టేసి, భయపెట్టి నోరు మూయించాలనుకోవడం ఇప్పుడు కొత్త దేశభక్తిగా మారిపోయింది.

అంబానీ, అదానీల ఆస్తులు పెంచుతున్నది బొద్దింకలా?? వాళ్ళ బ్యాంకు రుణాలు, కేసులు మాఫీ చేస్తున్నది బొద్దింకలా? గుండాలు, రేపిస్టులు, అవినీతి పరులను అందలం ఎక్కిస్తున్నది బొద్దింకలా?? నిత్యావసర ధరలు, పన్నులు పెంచుతున్నది బొద్దింకలా? నిరుద్యోగులను పెంచుతున్నది బొద్దింకలా? విద్య, వైద్యం కార్పొరేట్ కబంధ హస్తాలకు అప్పగించి పేదోడిని పీల్చి పిప్పి చేస్తున్న పాలకులు బొద్దింకలా? అడవులు, ఆకాశం, గనులు, గాలి, సముద్రాలు, కొండలు, ఇసుక గుట్టలు తవ్వేసి తొలిచేసి పీల్చి పిప్పిచేసే అవినీతి పందులు, డబ్బాకలి చావని కార్పొరేట్ కంపెనీలు బొద్దింకలా?? బురద పువ్వు పార్టీలో చేరి పవిత్రులుగా తయారవుతున్న అవినీతి నేతలు బొద్దింకలా?? అధికార పార్టీకి జేజేలు కొట్టి అర్హుల ఓటు హక్కు లాగేసేందుకు ఎస్’SIR’ అన్న ఈసీ బొద్దింకా?? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోడం మర్చిపోయి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పదవులకు ఆశపడుతూ పాలకుల తీర్పులను వల్లెవేస్తున్న న్యాయమూర్తులా?? కమలం పార్టీ మత చిచ్చును గుండెల్లో పెట్టుకుని మోస్తున్న అంధ భక్తులా? పైసలు, ప్రయోజనాలే పరమావధిగా మీడియా అంటూ ముసుగేసుకుని నిజాలను సమాధి చేస్తూ.. రాజకీయ పార్టీలా ఎ’జెండా’ కావడిలా మోస్తున్న వాళ్ళా? ఎవరు బొద్దింకలు??

కానీ గుర్తుపెట్టుకోవాలి. బొద్దింకలను స్ప్రేతో చంపొచ్చు. మీమ్స్‌ని రిపోర్ట్‌ చేసి తొలగించొచ్చు. అకౌంట్లు సస్పెండ్‌ చేయొచ్చు. కానీ నిరుద్యోగం వల్ల మండుతున్న ఒక తరం కోపాన్ని మాత్రం ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా నొక్కిపెట్టలేదు. ఎందుకంటే ఈ దేశంలో అసలు కంపు చెత్తలో లేదు. ప్రశ్న అడిగే యువతలో లేదు. అధికార మదంతో ప్రజల బాధను అవమానంగా చూసే మనస్తత్వంలో ఉంది. ఆ మనస్తత్వం కుళ్లు కంపు కొట్టే కాషాయ మెదళ్లలో ఉంది. ఆ కంపు పోవాలంటే కోక్‌రోచ్‌లతో పాటు పెంటపురుగులు కూడా ఏకం కాకతప్పదు!

ALSO READ: 90s కిడ్‌ మొదలుపెట్టిన ‘కాక్‌రోచ్‌’ ఉద్యమం..జెన్‌-Z మద్దతుతో ప్రభుత్వాలను ఎలా వణికిస్తోంది?

ALSO READ: బీజేపీ, కాంగ్రెస్‌లను దాటేసింది..! కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బ మాములుగా లేదు భయ్యా


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *