Menu

Cockroach Janata Party: 90s కిడ్‌ మొదలుపెట్టిన ‘కాక్‌రోచ్‌’ ఉద్యమం..జెన్‌-Z మద్దతుతో ప్రభుత్వాలను ఎలా వణికిస్తోంది?

Tri Ten B (Triya) 3 weeks ago
what is cockroach janata party

బొద్దింక…! ఈ భూమిపై మనిషి అత్యంత అసహ్యించుకునే జీవుల్లో ఒకటి. చూసిన వెంటనే చంపేయాలనిపించే జీవి. ఇంట్లో కనిపిస్తే విషం చల్లేస్తారు. గోడ మూలల్లో దాక్కుంటే స్ప్రెతో తరిమేస్తారు. చంపేశామని భ్రమపడతారు. కానీ మరుసటి రోజు అదే బొద్దింక మళ్లీ ప్రత్యక్షమవుతుంది. అసలు రాజమౌళి ఈగకు ఇచ్చిన ఎలివేషన్లు బొద్దింకకు ఇచ్చి ఉంటే కాస్త సైన్స్‌ పరంగా బాగుండేది. ఎందుకంటే… బొద్దింకకు ఒక గొప్ప లక్షణం ఉంది. దానికి ఎలాగైనా బతకడం తెలుసు. ప్రపంచం మొత్తం తనపై తిరిగినా…దాన్ని అంతం చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి ఒక కాక్‌రోచ్‌ తరం తయారవుతోంది. డిగ్రీలు పట్టుకుని ఉద్యోగాల కోసం తిరిగిన తరం.. పరీక్షలు రాసి వయసు మించిపోయిన తరం. స్కిల్స్ నేర్చుకుని కూడా ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన తరం. జాబ్ కోసం నగరాలకు వెళ్లి… EMIలు, రెంట్లు, ధరల మధ్య నలిగిపోయిన తరం. వాళ్లను ఎవ్వరూ వినలేదు. వాళ్ల ఆకలిని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ వాళ్లను తక్కువ చేయడం మాత్రం మొదలుపెట్టారు. సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా వీరిని బొద్దింకలతో పోల్చారు. పరాన్నజీవులుంటూ అహంకరం ప్రదర్శించారు. దేశానికి భారమంటూ హద్దుమీరి కామెంట్స్ చేశారు. అయితే అదే సీజేఐ సూర్యకాంత్‌ మాటలను అస్త్రంగా మలుచుకోని ఈ తరం ఆయుధంగా మార్చుకుంటోంది. కాక్‌రోచ్‌ జనాతా పార్టీ పేరుతో సోషల్‌మీడియాలో ఉద్యమం ప్రారంభించింది.

✨ Quick Read

  • సోషల్‌మీడియాను ఊపేస్తోన్న కాక్‌రోచ్‌ జనాతా పార్టీ
  • X అకౌంట్‌ ఇండియాలో నిలిపివేత
  • ఇన్‌స్టాలో కోటిమందికిపైగా ఫాలోవర్లు

AI-assisted summary, newsroom reviewed

కాక్‌రోచ్‌ పార్టీ అంటే ఏంటి?

కాక్‌రోచ్‌ జనాతా పార్టీ…! మొదట చాలామందికి ఇది ఒక మీమ్‌ పేజ్‌లా కనిపించింది కానీ కొద్ది రోజుల్లోనే ఇది దేశ యువతలో పేరుకుపోయిన నిరాశకు, కోపానికి, ఆకలికి ప్రతీకగా మారిపోయింది. రాయిటర్స్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం కొన్ని రోజుల్లోనే కోటికు పైగా ఫాలోవర్లను సంపాదించింది. అదే సమయంలో దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే BJP అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఫాలోవర్స్‌ను కూడా దాటేసింది. ఇదే సమయంలో X అకౌంట్‌కు లక్షల ఫాలోవర్లు రావడం మొదలైన కొద్ది గంటల్లోనే ఆ అకౌంట్‌ను ఇండియాలో నిలిపివేశారు. అంటే దేశంలో కనిపించకుండా బ్లాక్‌ చేశారు. ఈ విషయాన్ని ఎకనామిక్‌ టైమ్స్‌, రాయిటర్స్‌ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా రిపోర్ట్‌ చేశాయి. ఈ విషయాన్ని పార్టీ ఫౌండర్‌ అభిజీత్‌ దిప్కే స్వయంగా ప్రకటించారు కూడా.

అభిజీత్‌ దిప్కే ఎవరు?

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ (పాత ఔరంగాబాద్‌)కు చెందిన 30 ఏళ్ల అభిజీత్‌ దిప్కే.. పొలిటికల్‌ కమ్యూనికేషన్‌, సోషల్‌ మీడియా స్ట్రాటజీస్ట్‌గా పనిచేశారు. గతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సోషల్‌ మీడియా వాలంటీర్‌గా కూడా పనిచేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్(Boston University)లో పబ్లిక్‌ రిలేషన్స్(Public Relations)‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జాబ్స్‌కు అప్లై చేస్తున్న సమయంలోనే కాక్‌రోచ్‌ జనాతా పార్టీ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు.

కాక్‌రోచ్‌ జనాతా పార్టీకి పాకిస్థాన్‌ నుంచి కూడా ఫాలోవర్లు ఉన్నారా?

సోషల్‌మీడియాలో ఈ ఉద్యమానికి భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల యువత కూడా స్పందిస్తున్నట్లు పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే అధికారికంగా ఫాలోవర్ల దేశాల వారీ పూర్తి డేటాను పార్టీ విడుదల చేయలేదు.

కాక్‌రోచ్‌ జనాతా పార్టీ రాజకీయ పార్టీనా.. లేక సోషల్‌మీడియా ఉద్యమమా?

ప్రస్తుతం ఇది అధికారికంగా ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ కాదు. యువత నిరుద్యోగం, ఖరీదైన జీవన వ్యయం, వ్యవస్థపై అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్న డిజిటల్ ఉద్యమంగా కనిపిస్తోంది.

యువతలో నిరాశకు కారణాలేంటి?

2014లో ఒక అమెరికన్‌ డాలర్‌ విలువ దాదాపు 58 నుంచి 62 రూపాయల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు 2026 మే నాటికి ఫారెక్స్‌ మార్కెట్‌ డేటా ప్రకారం డాలర్‌ విలువ 95 నుంచి 96 రూపాయల రేంజ్‌ను దాటింది. కొన్ని ట్రేడింగ్‌ సెషన్లలో అది 96.7 వరకు వెళ్లిందని రాయిటర్స్‌ మార్కెట్‌ రిపోర్టులు చెబుతున్నాయి. RBI జోక్యం చేసుకోకపోతే అది 97 దాటేదని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

రూపాయి ఎందుకు పడిపోతోంది…?

ఇండియా తన అవసరమైన చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగితే ఇండియా ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. డాలర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. రూపాయి బలహీనపడుతుంది. అంతేకాదు విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. RBI డాలర్లు అమ్మి రూపాయిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా… మార్కెట్‌ ఒత్తిడి తగ్గడం లేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

క్రూడ్‌ ధరల పెరుగుదల:

2014లో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర సుమారు 71 రూపాయల దగ్గర ఉండేది. ఇప్పుడు అనేక నగరాల్లో అది 108 నుంచి 112 రూపాయల మధ్య తిరుగుతోంది. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం తాజా ధరల ప్రకారం మెట్రో నగరాల్లో పెట్రోల్‌ 100 రూపాయల మార్క్‌ దాటింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర కొన్ని రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు దాటింది. వంటనూనె ధర పెరిగింది. పాల రెట్లు పెరిగాయి. ఇంటి రెంట్లు పెరిగాయి. స్కూల్‌ ఫీజులు పెరిగాయి. మెడికల్‌ ఖర్చులు పెరిగాయి. కానీ జీతాలు అదే వేగంతో పెరగలేదు. ఉద్యోగాలు అదే స్థాయిలో రావడం లేదు.

దేశంలో నిరుద్యోగ సమస్య:

ఇక నిరుద్యోగ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (PLFS), CMIE, ప్రభుత్వ లేబర్‌ డేటా ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం 10 నుంచి 15 శాతం మధ్య తిరుగుతోంది. అర్బన్‌ ఏరియాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. అంటే ప్రతి 100 మంది యువతలో కనీసం 10 నుంచి 15 మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ వస్తే లక్షల అప్లికేషన్లు పడుతున్నాయి. రైల్వే జాబ్స్‌కు బీటెక్‌ గ్రాడ్యుయేట్లు అప్లై చేస్తున్నారు. గ్రూప్స్‌ పరీక్షలకు పీహెచ్‌డీలు చేసినవారు లైన్‌లో నిలబడుతున్నారు. ఇక IT రంగం పరిస్థితి మరింత భయంకరంగా మారింది. Layoffs.fyi , Nasscom, అంతర్జాతీయ టెక్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది టెక్‌ ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురయ్యారు. AI వస్తోందనే పేరుతో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసిన యువకుడు… ఇప్పుడు EMIలు కట్టలేక ఇంట్లో కూర్చున్న పరిస్థితి నెలకొంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ కోసం చదివిన స్టూడెంట్‌ ఇప్పుడు డెలివరీ జాబ్స్‌ చేస్తూ బతికే పరిస్థితి.

ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటన్న ప్రశ్న కూడా యువతలో పెరుగుతోంది.
ఆర్థిక సంక్షోభం పెరుగుతుంటే ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప… వ్యవస్థలో మార్పులు ఎక్కడ…? అని ప్రశ్నిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే దానికి కారణాలు చెప్పి..బాధ్యత వహించి.. సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. అసలు పెట్రోల్‌, డీజిల్‌ వాడొద్దని స్వయంగా పీఎంగారే సోది సలహాలు ఇస్తున్నారు. నిరుద్యోగం పెరిగితే స్టార్టప్‌లు పెట్టుకోవచ్చు కదా అని మతిలేని మోటివేషన్లు ఇస్తున్నారు. ఇక రూపాయి పడిపోతుంటే దేశభక్తి ప్రసంగాలు చెప్పి మ్యాటర్‌ను డైవర్ట్ చేస్తున్నారు. కానీ కోట్ల మంది యువతకు మూల సమస్య అయిన ఉద్యోగ భద్రతపై స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు రాజకీయ చర్చలలో మతం, ప్రాంతం, భావోద్వేగాలు… ఎన్నికల నినాదాలు మాత్రం తగ్గడం లేదు. ఆకలితో ఉన్న యువకుడికి మత రాజకీయాలు కాదు… ఉద్యోగం కావాలి. EMI కట్టలేని కుటుంబానికి ఆలయాల కట్టడాలు కాదు…మూడుపూటలా కడుపు నింపే ఆదాయం కావాలి.
భవిష్యత్తు కనిపించని తరానికి హ్యాష్‌ట్యాగ్‌లు కాదు… అవకాశాలు కావాలి. అందుకే ఇప్పుడు ఈ తరం కూడా అదే భాషలో సమాధానం చెబుతోంది. మీరు మమ్మల్ని బొద్దింకలు అంటారా…?
సరే… అదే పేరుతో ఉద్యమం చేస్తామంటోంది. ఎందుకంటే బొద్దింక ఒక విషయం నేర్పుతుంది. అదే
సర్వైవల్‌..!

దాన్ని నొక్కేయొచ్చు. స్ప్రే కొట్టొచ్చు. గోడల నుంచి తరిమేయొచ్చు. కానీ అది మళ్లీ వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అకౌంట్లు నిలిపివేయవచ్చు. ట్రెండ్స్‌ను ఆపొచ్చు.
పోస్టులను తొలగించొచ్చు కానీ ఈ దేశ యువతలో పేరుకుపోయిన నిరాశను… ఆకలిని… కోపాన్ని మాత్రం ఆపలేరు. ఇప్పుడా ఆ కోపమే కాక్‌రోచ్‌ జనాతా పార్టీ రూపంలో కనిపిస్తోంది. సీజేఐ అయినా ప్రధాని అయినా ఆ కోపాన్ని మరింత రెచ్చగొట్టేలా చేస్తే వారి సీన్‌ సీతార్‌ కాకతప్పద్దు!

ALSO READ: ఓవెన్‌లోంచి వస్తున్న వేడి ఆవిరిలా మగ్గిపోతున్న భారతం.. ఈ భారీ ఉష్ణోగ్రతలకు కారణాలేంటి?


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *