Menu

Jeffrey Epstein: ఎప్‌స్టీన్ ఎవరు? ప్రపంచంలోని బడాబాబులు ఎందుకు వణికిపోతున్నారు?

Tri Ten B (Triya) 2 months ago
who is jeffrey epstein explained in telugu

కోర్టు వరకు వెళ్లాల్సిన నిజాలు. ఫైల్స్‌లో పడి నిద్రపోయాయి. పోలీసు అడగాల్సిన ప్రశ్నలు భయంతో ఆగిపోయాయి. ఎందుకంటే ఈ కథలో సాధారణ నిందితులు లేరు. ప్రెసిడెంట్లతో భోజనం చేసినవాళ్లు ఉన్నారు. రాజకుమారులతో ఫొటోలు దిగినవాళ్లు ఉన్నారు. బిలియనీర్లతో దీవుల్లో గడిపినవాళ్లు ఉన్నారు. శక్తి కాపలాగా నిలిచినప్పుడు నేరం చీకట్లో నవ్వుతుందని చెబుతుంటారు. అలాంటి ఒక చీకటి గదిలో పుట్టిన పేరే జెఫ్రీ ఎప్‌స్టీన్…!

ఇది ఒక వ్యక్తి కథ కాదు. ఇది ఒక వ్యవస్థ. ప్రైవేట్ జెట్లు ఆకాశంలో ఎగిరిన కథ. సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో చట్టం పనిచేయని రాత్రుల వ్యధ. పిల్లల నవ్వులు భయంగా మారిన గాధ. ఇంతకీ ప్రపంచాన్ని పాలించే పేర్లు ఒకే ఫైలులో ఎలా చిక్కుకున్నాయి? ఎప్‌స్టీన్‌ ఫైల్స్ ప్రపంచాన్ని ఎందుకు షేక్ చేస్తున్నారు? అసలు ఈ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు?

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఒక రాజకీయ నాయకుడు కాదు. ఒక సెలబ్రిటీ కాదు. ఒక ప్రభుత్వ అధికారి కూడా కాదు. కానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల మధ్య తిరిగిన పేరు. న్యూయార్క్‌లో ఫైనాన్స్ ప్రపంచంలో తన ప్రయాణం మొదలుపెట్టిన ఎప్‌స్టీన్‌.. అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ ప్రభావం ఉన్న వర్గంలోకి చేరాడు. ఆయన ఉద్యోగమేంటో కూడా స్పష్టంగా ఎవరికీ అర్థం కాదు. కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం ప్రపంచాన్ని నడిపేవారు. ప్రైవేట్ జెట్లు, బిలియనీర్ల ఇళ్లు, రాజకీయ నేతల విందులు, రాజకుటుంబాలతో స్నేహం ఎప్‌స్టీన్‌కి మాత్రమే సాధ్యమైంది. ఒక సాధారణ వ్యాపారవేత్త జీవితంలోకి ఇంతమంద ఎలా ఎలా వచ్చారన్నది మొదటి ప్రశ్న. కానీ ఆ ప్రశ్నను ఎప్పుడూ, ఎవరూ బహిరంగంగా అడగలేదు. ఎందుకంటే ఎప్‌స్టీన్‌ దగ్గర ఉన్నది డబ్బు మాత్రమే కాదు.. రహస్యాలు కూడా. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో వెలుగుచూస్తున్న పెద్దపెద్ద రాజకీయనాయకులు, వ్యాపారవేత్తల పేర్లు వింటుంటే ఎవరైనా షాక్‌ అవ్వక తప్పదు.


అమెరికా, యూరప్, కరీబియన్ ప్రాంతాల్లో ఎప్‌స్టీన్‌కు ఇళ్లున్నాయి. కానీ ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకుంటోంది మాత్రం ఒక చిన్న దీవి గురించి. అదే లిటిల్ సెంట్ జేమ్స్. బయటకు చూస్తే అది ఒక ప్రైవేట్ రిసార్ట్‌లా కనిపిస్తుంది. లోపల మాత్రం చట్టం అడుగుపెట్టని ప్రపంచం ఉంటుదట. అక్కడ చిన్నపిల్లలపై లైంగిక నేరాలు జరిగినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి.

బాధితులు చెప్పిన కథలన్నీ ఒకేలా ఉన్నాయి. మొదట చిన్న పని ఆఫర్ చేస్తారు. తర్వాత నెమ్మదిగా పనికి ఒప్పుకున్నవాళ్లని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. చివరకు భయం రాజ్యమేలుతుంది. లోపల జరిగిన విషయాన్ని బయట చెప్పాలంటే బెదిరింపులు వస్తాయి. మాట్లాడితే చంపేస్తామన్న హెచ్చరికలు వినిపిస్తాయి.

మైనర్లను లక్ష్యంగా చేసుకొని, వారిని తన ప్రైవేట్ దీవులకు, లగ్జరీ ఇళ్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఎవరు ఎదురు తిరిగినా, ఎప్‌స్టీన్ చుట్టూ ఉన్న శక్తివంతమైన పేర్లే రక్షణగా నిలిచాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎప్‌స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడు..ఆయన్ను కాపాడడానిక ఒక వ్యవస్థ పనిచేసిందని ఇప్పుడు ప్రపంచం గట్టిగా నమ్ముతోంది. ఇక ఈ ఎప్‌స్టీన్‌ ఫైల్స్ డాక్యుమెంట్లను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టీస్‌ విడుదల చేసింది. ఇవి ప్రభుత్వం అధికారికంగా బయటపెట్టిన రికార్డులు. ఇందులో వేల సంఖ్యలో సెలబ్రిటీల పేర్లు ఉండడం సంచలనంగా మారింది.

నిజానికి 2005లోనే ఎప్‌స్టీన్‌పై మొదటి ఫిర్యాదు నమోదైంది. ఫ్లోరిడాలో ఒక మైనర్ బాలిక తనపై లైంగిక దుర్వినియోగం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే దర్యాప్తు మొదలైంది. సాక్ష్యాలు బయటపడ్డాయి. మరికొందరు బాలికలు కూడా ముందుకు వచ్చారు.

కానీ ఆశ్చర్యంగా, 2008లో ఎప్‌స్టీన్‌కు భారీ నేరాల నుంచి తప్పించుకునే అవకాశం లభించింది. సాధారణంగా మైనర్లపై లైంగిక నేరాలకు జైలు శిక్ష తప్పదు. కానీ ఎప్‌స్టీన్‌ మాత్రం కేవలం కొన్ని నెలలు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. అదే సమయంలో రోజుకు ఆరు రోజులు బయట పని చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ప్లీ డీల్‌గా చెబుతారు. అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. చట్టం ఎందుకు ఇలాంటి పని చేసింది? ఎవరు ఒత్తిడి చేశారు? బాధితులకు ఎందుకు న్యాయం దక్కలేదనే ప్రశ్నలను అప్పట్లో ఎవరూ సమాధానం చెప్పలేదు.

ఇక 2019లో పరిస్థితి మారింది. అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మరోసారి కేసు నమోదు చేశారు. ఈసారి ఆరోపణలు మరింత తీవ్రమైనవి. దశాబ్దాలుగా మైనర్లను రవాణా చేసి, లైంగికంగా వేధించాడన్న ఫెడరల్ ఛార్జీలు పెట్టారు.

ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టి ఒక్కసారిగా ఆయనపై పడింది. ఈసారి తప్పించుకోలేడన్న భావన బలపడింది. కానీ కేసు కోర్టుకు వెళ్లకముందే ఒక షాక్. 2019 ఆగస్టులో జైలు సెల్‌లో ఎప్‌స్టీన్ చనిపోయాడు. అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ వెంటనే అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఆ రోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. కాపల ఉండే గార్డులు నిద్రపోయారు.

వాస్తవానికి ఎప్‌స్టీన్ బతికుంటే చాలామంది పేర్లు బయటకు వచ్చేవి. అందుకే ఆయన మరణం కేసును ముగించలేదు. అనేక అనుమానాలను శాశ్వతంగా మిగిల్చింది.

ఆయన మరణం తర్వాత అసలు తుఫాను మొదలైంది. బాధితులు కోర్టులను ఆశ్రయించారు. సివిల్ కేసులు తెరపైకి వచ్చాయి. వాటితో పాటు ఎప్‌స్టీన్ డైరీలు, ఫ్లైట్ లాగ్స్, ఈమెయిల్స్, కాంటాక్ట్ లిస్టులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆయన ప్రైవేట్ జెట్‌లో ఎవరు ప్రయాణించారు? ఎవరు ఆ దీవికి వెళ్లారు? ఎవరు ఆయనతో సన్నిహితంగా ఉన్నారన్న వివరాలు కోర్టు రికార్డుల్లోకి వచ్చాయి. ఇక్కడే ప్రపంచ నేతలకు భయం మొదలైంది. ఎందుకంటే ఇది ఆరోపణల జాబితా కాదు. ఇది సాక్ష్యాల ఆధారంగా ఉన్న పరిచయాల జాబితా. పేరు రావడమే నేరమని కాదు కానీ.. ఆ పేర్లు ఎందుకు అక్కడ ఉన్నాయన్న ప్రశ్న తప్పించుకోలేని విధంగా మారింది. అందుకే రాజకీయ నాయకులు, బిలియనీర్లు, సెలబ్రిటీలు మౌనంగా ఉండిపోయారు.ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి కారణం ఇదే.

ఎందుకంటే ఇది ఒక్క నేరస్థుడి కథ కాదు. శక్తివంతులు ఒకరినొకరు ఎలా కాపాడుకుంటారన్న కథ. డబ్బు ఉంటే చట్టం ఎలా మౌనంగా మారుతుందన్న నిజాన్ని ఎప్‌స్టీన్‌ ఎపిసోడ్‌ గుర్తుచేస్తోంది.

ALSO READ: ఇవి ప్రభుత్వ హ*త్యలేనా..? పని ఒత్తిడితో నేల రాలుతున్న సచివాలయ ఉద్యోగులను పట్టించుకునే వారే లేరా?