Menu

Gulf War: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!

Lakshmi Aruna 3 weeks ago
iran vs israel war gulf in crisis

మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో చిక్కుకుందా…? ఒకప్పుడు కలిసి నిలిచిన గల్ఫ్ దేశాలు… ఇప్పుడు ఒకదానికొకటి దూరమవుతున్నాయా…? ఇరాన్ యుద్ధం కేవలం బాంబులు, క్షిపణుల వరకే పరిమితం కాకుండా… ఇప్పుడు గల్ఫ్ దేశాల ఐక్యతనే చీల్చేస్తోందా…? ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఇదే పెద్ద చర్చగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ దాడుల తర్వాత యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గల్ఫ్ దేశాల నాయకులకు వరుసగా ఫోన్ కాల్స్ చేశారు. ముఖ్యంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడి… ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని కోరారు.

✨ Quick Read

  • ఇరాన్ యుద్ధంతో GCCలో విభేదాలు
  • సౌదీ-యూఏఈ మధ్య వ్యూహాత్మక దూరం
  • హోర్ముజ్ సంక్షోభంతో చమురు ఆందోళనలు

AI-assisted summary, newsroom reviewed

యూఏఈ మదిలో ఏముంది?

యూఏఈ ఆలోచన ఏంటంటే… గల్ఫ్ దేశాలు మొత్తం కలిసి ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొస్తే… భవిష్యత్తులో మరిన్ని దాడులను అడ్డుకోవచ్చని. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతాలపై వందల సంఖ్యలో డ్రోన్‌లు, క్షిపణులు ప్రయోగించింది. కొన్ని దాడులు ఓడరేవులు, విమానాశ్రయాలు, హోటళ్లు, నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది హోర్ముజ్ జలసంధి సమస్య. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూసివేతతో గల్ఫ్ దేశాలు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి రావడంతో ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడింది.

ఇది కేవలం ఒక దేశంతో వివాదం కాదని… మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతకు సంబంధించిన అంశమని యూఏఈ అధ్యక్షుడు ఇతర దేశాలకు వివరించినట్టు సమాచారం. ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకే 1981లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే GCC ఏర్పడిందని కూడా గుర్తు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడే కథలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. యూఏఈ ఆశించినట్టుగా సౌదీ అరేబియా ముందుకు రాలేదు. పరిస్థితి మరింత యుద్ధ వాతావరణంగా మారడం సౌదీ నాయకత్వం కోరుకోలేదని సమాచారం. ప్రత్యక్ష సైనిక చర్యలకు దూరంగా ఉండి… భద్రత, రక్షణపైనే దృష్టి పెట్టాలని సౌదీ భావించింది.

హోర్ముజ్ జలసంధి ఎందుకు ప్రపంచానికి అంత కీలకం?

ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం హోర్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు, గ్లోబల్ ఎకానమీపై వెంటనే ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

GCC అంటే ఏమిటి.. ఇందులో ఏ దేశాలు ఉన్నాయి?

GCC అంటే Gulf Cooperation Council. 1981లో ఏర్పడిన ఈ కూటమిలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… యూఏఈ తీసుకుంటున్న కఠిన వైఖరి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోందని సౌదీ అనుమానించింది. ఇప్పటికే యెమెన్, సూడాన్ అంశాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో… ఈ యుద్ధం ఆ సంబంధాలను ఇంకా దెబ్బతీసినట్టు చెబుతున్నారు. అంతేకాదు… మార్చి, ఏప్రిల్ నెలల్లో యూఏఈ ఒక్కటే ఇరాన్‌పై కొన్ని పరిమిత దాడులు చేసినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో యూఏఈ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెక్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీని వెనుక ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలే ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక యుద్ధ సమయంలో యూఏఈ ప్రధాన టార్గెట్‌గా మారినట్టు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం… ఇరాన్ యూఏఈపై దాదాపు 3 వేల డ్రోన్‌లు, క్షిపణులు ప్రయోగించింది. అయితే వాటిలో చాలా వరకు వాయు రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డుకోబడ్డాయని సమాచారం. గత వారం ఫుజైరా చమురు ఓడరేవుపై కూడా దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సమయంలో యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసి పనిచేశాయి. నిఘా సమాచారాన్ని పంచుకున్నాయి. అంతేకాదు… ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వాయు రక్షణ వ్యవస్థలను, సైనిక బలగాలను కూడా యూఏఈకి పంపినట్టు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ మాత్రం ఈ ఘర్షణలో నేరుగా పాల్గొనకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ముఖ్యంగా ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై దాడి జరిగిన తర్వాత మొదట ప్రతీకారం గురించి ఆలోచించినా… తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే దిశగా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక విషయాన్ని గమనిస్తోంది. ఇది కేవలం ఇరాన్ వర్సెస్ అమెరికా లేదా ఇజ్రాయెల్ యుద్ధం మాత్రమే కాదు. ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్యే విభేదాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు కలిసి నిలిచిన దేశాలు… ఇప్పుడు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ చీలికలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో… మధ్యప్రాచ్య భవిష్యత్తును ఎలా మార్చబోతాయో అన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: ఒక చిన్న దేశం అగ్రరాజ్యం అమెరికాను ఎలా ఓడించింది?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *