అమెరికా…! ప్రపంచానికి భయం అనే పదానికి అర్థం చెప్పిన దేశం. అమెరికా సీన్‌లో ఉందంటే యుద్ధ ఫలితం ముందే తెలిసిపోతుందని ఇప్పటికీ అంతా నమ్ముతుంటారు. అయితే ప్రతీసారి అలా జరగలేదు..! చరిత్రలో అమెరికాను గజగజా వణికించిన దేశముంది. అది కూడా చాలా చిన్న దేశం. మూడు రోజుల్లో ముగించేస్తామని భావించిన అమెరికా అహంకారం కూలిపోయింది. సైన్యం చిక్కుకుంది.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన ఆ దేశం క్యూబా..! ఇప్పుడు సీన్ మరోసారి అదే దిశలోకి కదులుతుందా అనే అనుమానం కలుగుతోంది.
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా వెనుకంజలో ఉంది. ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇప్పటికే హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు సార్లు డెడ్‌లైన్లు మార్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ గతంలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది? క్యూబా మట్టికరిపించిన చరిత్రను ఇరాన్ తిరిగి రాస్తుందా?
1961లో అమెరికా ఒక భారీ నిర్ణయం తీసుకుంది. క్యూబాలో అధికారంలోకి వచ్చిన ఫిడెల్ కాస్ట్రోను తొలగించాలనే పట్టుదలతో ముందుకు వచ్చింది. అప్పటికి కాస్ట్రో ఒక సాధారణ నాయకుడు కాదు. 1959 విప్లవంతో అమెరికా మద్దతు ఉన్న బాటిస్టాను గద్దె దించి, దేశాన్ని పూర్తిగా మార్చేసిన నాయకుడు. క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలు, షుగర్ ఫ్యాక్టరీలు, రిఫైనరీలను స్వాధీనం చేసుకున్నాడు.
అటు అమెరికా ప్రత్యర్థి సోవియట్ యూనియన్‌తోనూ బలమైన సంబంధాలు పెంచుకున్నాడు. ఇది అమెరికాకు మరింత కోపాన్ని తెప్పించింది. తన భూభాగానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న దేశం ఇలా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సీక్రెట్ ప్లాన్‌ను తీసుకొచ్చాడు. సుమారు 1400 మంది క్యూబా ప్రవాసులను ట్రైన్ చేసి, ఆయుధాలు ఇచ్చారు. దీనికి బ్రిగేడ్ 2506 పేరు పెట్టారు. ముందుగా వైమానిక దాడులతో క్యూబా ఎయిర్‌ఫోర్స్‌ను బలహీనపరచాలని ప్రణాళిక రచించారు. తర్వాత సముద్ర మార్గం ద్వారా సైన్యాన్ని దింపాలి. అలా క్యూబా లోపలికి వెళ్లగానే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అమెరికా నమ్మింది. ఏప్రిల్ 17, 1961న బే ఆఫ్ పిగ్స్ అనే ప్రాంతంలో దాడి ప్రారంభమైంది. సముద్ర మార్గం ద్వారా సైన్యం దిగింది.
ఇంతలోనే కథ మారిపోయింది. కాస్ట్రో వేగంగా స్పందించాడు. వేల సంఖ్యలో సైన్యాన్ని పంపించాడు. పాత విమానాలే ఉన్నా, వాటితోనే ఎదురుదాడి చేశాడు. దీంతో లోపలికి వెళ్లిన బలగం ఒంటరిగానే మిగిలిపోయింది.
ఓవైపు ఆహారం లేదు మరోవైపు చుట్టూ శత్రువులు. బయటకు వచ్చే మార్గం లేదు. ఇలా మూడంటే మూడు రోజుల్లో యుద్ధం ముగిసింది. వందల మంది అమెరికా సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. వెయ్యికి పైగా సైనికులు బందీలయ్యారు. ప్రపంచం మొత్తం ఈ ఘటనను చూసింది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం.. ఒక చిన్న కంట్రీ ముందు ఎలా కూలిపోతుందో ప్రత్యక్షంగా చూసింది. ఈ ఘటన తర్వాత క్యూబాలో క్యాస్ట్రో ప్రభావం పెరిగింది. అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి బందీలను విడుదల చేయించుకోవడానికి కూడా భారీ ధర చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఒక చిన్న దేశపు సంకల్పం అమెరికా లెక్కలను పూర్తిగా తారుమారు చేసింది. యుద్ధం అంటే కేవలం ఆయుధాలతోనే జరగదు.. నేలపై ఉన్న మద్దతు, నాయకత్వం, ప్రజల నమ్మకమే అసలు శక్తి. పెద్ద దేశం అయినా.. ఈ అంశాలను తప్పుగా అంచనా వేస్తే ఫలితం ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఇదే చరిత్ర మరోసారి కనిపిస్తోంది. ఇరాన్‌ను కూడా ఒత్తిడితో వెనక్కి తిప్పగలమనే అంచనా వేసింది అమెరికా. కానీ అక్కడ కూడా పరిస్థితి అదే దిశలో కదులుతోంది. భౌగోళిక ప్రయోజనం, మానసిక స్థైర్యం, వ్యూహాత్మక నియంత్రణ లాంటివి ఒక పెద్ద శక్తిని ఆపే స్థాయికి తీసుకెళ్తున్నాయి.
ప్రపంచానికి ఐదోవంతు చమురును సరఫరా చేసే హార్ముజ్‌ను పూర్తిగా ఇరాన్ తన అండర్‌లో పెట్టుకుంది. దీంతో అమెరికా మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకప్పుడు క్యూబా అమెరికాను ఆపింది. మరి ఇప్పుడు ఇరాన్ కూడా అదే చేస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ALSO READ: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు.. సమస్యను అంచనా వెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?

Capital Punishment: నా మనసంతా ప్రశ్నల వలలో చిక్కుకుంది.. ఒక హత్యకు శిక్షగా మనం ఇంకో హత్య చేస్తున్నామా?