Menu

Cylinder Shortage: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు.. సమస్యను అంచనా వెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?

Praja Dhwani Desk 3 months ago
indian cylinder crisis

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఇండియాలో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది. ఇరాన్‌ వార్‌ సెగలు వంటింట్లో చెమటలు కక్కిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల రెస్టారెంట్లు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి.

వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాల కారణంగా హోటళ్లలో ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మెను ధరలు కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే దేశంలోని దాదాపు 75 శాతం రెస్టారెంట్లు వంట కోసం ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడి ఉంటాయి. సరఫరా అంతరాయం కొనసాగితే రోజుకు వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఒక్క రెస్టారెంట్లకే పరిమితం కాదు. ఎల్పీజీ సిలిండర్ కోట్లాది కుటుంబాల రోజువారీ జీవితానికి అవసరమైన వంట ఇంధనం. ఇటు ఇండియా ఏమో ఎల్పీజీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్‌ కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై అనిశ్చితి పెరగడంతో ఇండియా కూడా సమస్యను ఫేస్ చేస్తోంది.

భారత్ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. దేశానికి అవసరమైన చమురు సరఫరా ఎక్కడా ఆగిపోకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు 27 దేశాల నుంచి మాత్రమే చమురు కొనుగోలు చేసిన భారత్.. ఇప్పుడు తన సరఫరా వ్యవస్థను విస్తరించనుంది. దాదాపు 40 దేశాల నుంచి ఇంధన వనరులను పొందేలా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ప్రపంచ మార్కెట్లో ఎక్కడైనా అంతరాయం వచ్చినా దేశానికి అవసరమైన ఇంధన అవసరాలు నిలిచిపోకుండా ఉండటమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఇక ఎల్పీజీ విషయంలో భారత్ ఎంతగా దిగుమతులపై ఆధారపడుతోందనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అవసరాల్లో సుమారు 66శాతం ఎల్పీజీ దిగుమతులే ఉన్నాయి. అంటే దేశంలో వినియోగించే ప్రతి మూడు సిలిండర్లలో రెండు విదేశాల నుంచి వచ్చే గ్యాస్‌తోనే నింపుతున్నారు. ఇందులో మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ దిగుమతుల్లో అధిక భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే రావడం.

2024-25 మధ్య కాలంలో దిగుమతి చేసుకున్న ఎల్పీజీలో దాదాపు 92 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వచ్చింది. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుమారు 40 శాతం సరఫరా చేసింది. ఖతర్ నుంచి దాదాపు 22 శాతం వచ్చింది. సౌదీ అరేబియా, కువైట్ ఒక్కోటి 15 శాతం చొప్పున సరఫరా చేశాయి. అంటే మధ్యప్రాచ్యంలో ఏదైనా ఉద్రిక్తతలు పెరిగితే భారత్ ఇంధన సరఫరాపై వెంటనే ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఇదే సమయంలో ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ప్రయాణిస్తుంది. అక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లపై వెంటనే ప్రభావం కనిపిస్తుంది. అందుకే చమురు సరఫరాపై అనేక దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ ప్రభావం మొదటగా ఎల్పీజీ ధరల్లో కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల కంటే ఎల్పీజీ ధరలు ముందుగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు కూడా ప్రారంభించింది. వంటగ్యాస్ సరఫరా నిలకడగా ఉండేలా ఎస్సెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని ఉపయోగిస్తోంది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ ప్లాంట్లు ఎల్పీజీని ముడి పదార్థంగా వినియోగించడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. అదే సమయంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది.

నిల్వలు ఎంత ఉన్నాయి? ఎక్కడ ఎంత సరఫరా జరుగుతోందనే వివరాలను కూడా ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా దిగుమతి దారులకు సూచనలు జారీ అయ్యాయి. ఈ చర్యలన్నింటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఒకటే. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం సాధారణ భారతీయుడి వంటింటిపై పడకూడదనే ప్రయత్నమే ఇది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా దేశానికి అవసరమైన ఇంధన భద్రతను కాపాడేందుకు భారత్ ముందుగానే చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ALSO READ: ఆ 6 దేశాల్లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? గల్ఫ్‌ దేశాలను వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ వార్..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *