Menu

Investment News: యుద్ధ సమయంలో పెట్టుబడి పెట్టకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Praja Dhwani Desk 3 months ago
Geopolitical tensions involving Iran, the US, and Israel have unsettled global and Indian financial markets, leading to FII sell-offs and declines in indices like Sensex and Nifty. Experts advise investors to avoid panic selling, continue SIPs for rupee-cost averaging, and stagger lump sum investments to mitigate volatility. Safe-haven assets such as gold and debt provide portfolio stability, while sectors like defence, energy, and pharma show resilience. Long-term discipline, diversification, and quality stocks remain key amid short-term market corrections.

ప్రపంచంలో ఏ మూలలో యుద్ధం మొదలైనా దాని ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. అది ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కూడా కుదిపేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగింది. ఆ ప్రభావం దలాల్ స్ట్రీట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పడిపోవడంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు డేంజర్‌ మార్క్‌లోకి వెళ్లాయి.

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తాత్కాలిక నష్టాలవైపు ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పెట్టుబడిదారులను ఓ ప్రశ్న వేధిస్తోంది. మార్కెట్ పడిపోతే ఏం చేయాలి? భయంతో షేర్లు అమ్మేయాలా? కొంతకాలం పెట్టుబడులు ఆపేయాలా? మార్కెట్ నిపుణులు ఇలాంటి సమయంలో ఏం సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం!

ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. అదే ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. సెన్సెక్స్ సుమారు 2.17 శాతం వరకు పడిపోయింది. నిఫ్టీ కూడా దాదాపు 2.13 శాతం వరకు తగ్గింది. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే విదేశీ పెట్టుబడిదారులు దాదాపు 15,800 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. చమురు ధరల పెరుగుదల, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం, గ్లోబల్ అనిశ్చితి లాంటి కారణాలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం.. ఇలాంటి సమయంలో భయపడటం పెట్టుబడిదారులకు మంచిది కాదట. మార్కెట్ పడిపోయినప్పుడు వెంటనే షేర్లు అమ్మేయడం పెద్ద పొరపాటు అవుతుందంటున్నారు. ఎందుకంటే యుద్ధ పరిస్థితుల తర్వాత మార్కెట్లు తిరిగి కోలుకున్న ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకే తాత్కాలిక ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకోవడం కంటే లాంగ్ టర్మ్ టార్గెట్లను గుర్తుంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

భారత్‌లో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే SIPల ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు SIPలను ఆపేయాలా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. కానీ నిపుణులు మాత్రం SIPలను కొనసాగించడం మంచిదని చెబుతున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు అదే SIP ద్వారా తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని రూపీ కాస్ట్ అవరేజింగ్ అంటారు. లాంగ్ టర్మ్‌లో ఇది పెట్టుబడిదారులకు లాభాన్ని అందిస్తుంది. అందుకే మార్కెట్ పడిపోయినప్పుడు SIPలను ఆపడం కంటే కొనసాగించడం మంచిది. ఇక ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం డబ్బును ఒక్కసారిగా పెట్టుబడి పెట్టడం కంటే దాన్ని దశలవారీగా పెట్టడం మంచిది. దీన్ని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌గా పిలుస్తారు.

ఇక మార్కెట్ ఎప్పుడు కనిష్ట స్థాయికి చేరుతుందో ముందుగా చెప్పడం చాలా కష్టం. అందుకే దశలవారీ పెట్టుబడి మంచి వ్యూహం. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా బంగారం, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు పెట్టుబడిదారులకు భద్రతను ఇస్తాయి.

ప్రస్తుతం గ్లోబల్ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు యుద్ధ పరిస్థితుల్లో కొన్ని రంగాలు మాత్రం స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీలకు పెద్దగా సమస్య లేదు . ఎందుకంటే యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు రక్షణ ఖర్చులను పెంచుతాయి. అలాగే ఎనర్జీ, మెటల్స్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలు కూడా కొంత స్థిరత్వాన్ని చూపే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రంగాలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల వల్ల విమానయాన, లాజిస్టిక్స్ రంగాలపై ప్రభావం పడుతుంది. పెయింట్స్, స్పెషాలిటీ కెమికల్స్, టైర్లు లాంటి రంగాల్లో కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అలాగే ఇంధన ధరలు పెరిగితే ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ కూడా మందగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సమస్య తాత్కాలికమేనన్నది నిపుణుల మాట. అయితే పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం అన్నిటికంటే ముఖ్యమని మర్చిపోవద్దు.

ALSO READ: 70:30 రూల్‌ ఫాలో అవ్వండి.. లేదంటే మీకు శాలరీ ఎంత భారీగా వచ్చినా వెంటనే అయిపోతుంది!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *