ఒక యుగం ముగిసింది.. ఇరాన్ రాజకీయ వ్యవస్థకు కేంద్రబిందువుగా నిలిచిన అయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆయన మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ధృవీకరించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఏర్పడిన వ్యవస్థకు రెండో అత్యంత కీలక నేతగా, 1989 నుంచి దాదాపు మూడు దశాబ్దాలకుపైగా సుప్రీం లీడర్‌గా అధికారాన్ని కేంద్రీకరించిన ఖమేనీ మరణం కేవలం వ్యక్తిగత ఘటన కాదు.. ఇది మధ్యప్రాచ్య శక్తిసమీకరణాన్ని కదిలించే పరిణామం.
ఇరాన్‌లో అత్యున్నత సైనికాధికారాలపై నియంత్రణ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌పై ప్రభావం, అణు విధానాలపై తుది నిర్ణయం, న్యాయవ్యవస్థపై పరోక్ష ఆధిపత్యం లాంటి అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉండేవి. ఇప్పుడు ఆ స్థానంలో శూన్యం ఏర్పడింది. ఇరాన్ భవిష్యత్తు ఏ దిశలో కదులుతుంది? ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతాయా?
అలీ ఖమేనీ 1939లో ఇరాన్‌లోని మష్హద్ నగరంలో జన్మించారు. మతపరమైన విద్యతో ప్రారంభమైన ఆయన ప్రయాణం, తక్కువకాలంలోనే రాజకీయ దిశగా మలుపు తిరిగింది. 1979 ఇస్లామిక్ విప్లవ సమయంలో అయతుల్లా రుహొల్లా ఖొమేనీకి అత్యంత సమీపంగా పనిచేసిన మతనేతల్లో ఆయన ఒకరు. విప్లవం తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆయన వేగంగా ఎదిగారు.
1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖమేనీ, 1989లో ఖొమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాల పాటు ఆయన ఇరాన్ రాజకీయ, సైనిక, మత వ్యవస్థలపై తుది నిర్ణయాధికారిగా కొనసాగారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని అత్యున్నత అధికార స్థానం సుప్రీం లీడర్‌దే. సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్, న్యాయవ్యవస్థ, రాష్ట్ర మీడియా, కీలక నియామకాలన్నీ ఆయన ఆమోదం లేకుండా కదలవు.
ఖమేనీ పాలనలో ఇరాన్ ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించింది. లెబనాన్‌లో హిజ్బుల్లా, సిరియాలో అసాద్ ప్రభుత్వానికి మద్దతు, ఇరాక్‌లో షియా మిలీషియాలకు సహాయం లాంటి వ్యూహాలతో ఇరాన్ మధ్యప్రాచ్యంలో ప్రభావాన్ని పెంచుకుంది. అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పాశ్చాత్య దేశాలపై వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగించింది.
కఠిన ఆర్థిక ఆంక్షల మధ్య కూడా వ్యవస్థను నిలబెట్టిన నాయకుడిగా ఆయనకు పేరుంది. అయితే విమర్శలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. 2009 గ్రీన్ మూమెంట్ నుంచి 2022 మహిళా నిరసనల వరకు అనేక ప్రజా ఉద్యమాలపై కఠిన చర్యలు తీసుకున్నారని మానవహక్కుల సంస్థలు ఆరోపించాయి. నిరసనకారుల అరెస్టులు, మీడియా నియంత్రణ, మరణశిక్షల అమలు, రాజకీయ విపక్షాల అణచివేత లాంటి అంశాలు అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీశాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న వారసత్వంపై ఉంది.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్‌కు ఉంటుంది. కానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ పాత్ర కూడా కీలకమవుతుంది. వ్యవస్థ అంతర్గతంగా ఏకాభిప్రాయం సాధిస్తుందా లేక అధికార పోరు ప్రారంభమవుతుందాన్నది కీలకం.
దేశంలో రాజకీయ స్థిరత్వం నిలబడుతుందా అన్నది కూడా అదే నిర్ణయిస్తుంది. అంతర్జాతీయంగా ఈ పరిణామం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇప్పటికే ఉన్న ఉద్రిక్త సంబంధాలు మరింత కఠినమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న ప్రాంతీయ గుంపులు ఎలా స్పందిస్తాయన్నది కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చమురు మార్కెట్లు, సముద్ర మార్గాలు, ప్రాంతీయ భద్రత లాంటివి వీటిపై ఆధారపడి ఉన్నాయి.
దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ రాజకీయ వ్యవస్థను ఒకే వ్యక్తి చుట్టూ కేంద్రీకరించిన యుగం ముగిసింది. ఇప్పుడు ఇరాన్ ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఈ మార్పు దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్తుందా లేదా మరింత అనిశ్చితిలోకి నెడుతుందా అన్నది రాబోయే రోజులు నిర్ణయిస్తాయి.
ALSO READ: ‘చంపేస్తానని బెదిరించాడు.. వాడోక సైకో..’ ఎప్‌స్టీన్ బాధితురాలి కన్నీటి వేదన!

Iran Human Rights Violation: ప్రశ్నిస్తే ఉ*రి! టీనేజర్లపై ఇరాన్ క్రూరత్వం
Cylinder Shortage: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు.. సమస్యను అంచనా వెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?
Hostel Cylinder Crisis: సిలిండర్ షార్టెజ్..! మూతపడుతున్న హాస్టల్స్.. టెన్షన్లో స్టూడెంట్స్..!
Iran war: ఇరాన్‌లో భారతీయ వైద్యుల భవిష్యత్తు ఏంటి? కలలు చెదిరినట్టేనా?
Investment News: యుద్ధ సమయంలో పెట్టుబడి పెట్టకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారు?
America Vs Iran: ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన సైనిక ఉద్రిక్తత!