Menu

UN Report: 50లక్షల మంది పిల్లలను చంపేశారా? ఐక్యరాజ్యసమితి రిపోర్టులో నమ్మలేని నిజాలు!

Praja Dhwani Desk 3 months ago
war crisis in telugu

 

పుట్టిన వెంటనే నవ్వాల్సిన ఓ బిడ్డ.. కొన్ని రోజులకే మౌనంలో సమాధి అవుతున్న దుస్థితి. అడుగులు వేయాల్సిన వయసులో శ్వాస కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇళ్లలో జరుగుతున్న మౌన విషాదమిది. 2024లో ఐదేళ్లు కూడా నిండని దాదాపు 49 లక్షల పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి రిపోర్టు చెబుతోంది.

అంతేకాదు ఐదేళ్లు దాటిన 21 లక్షల మంది పిల్లలు, యువత కూడా మరణించారు. ఇది వ్యాధుల వల్ల మాత్రమే కాదు.. చికిత్స అందక, పోషకాహారం లేక, జీవించేందుకు అవసరమైన కనీస సంరక్షణ దొరక్క చనిపోయారు. మరింత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ మరణాల్లో చాలా వరకు నివారించదగినవే అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇంతకీ.. బతికే అవకాశమున్నా కూడా ఈ చిన్న ప్రాణాలు ఎందుకు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి?

పుట్టిన వెంటనే చనిపోతున్న పిల్లల్లో ఎక్కువ మంది ప్రీమెచ్యూర్ బర్త్, ప్రసవ సమయంలో సమస్యలు, మొదటి కొన్ని రోజుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన వైద్య సేవలు, నిపుణుల పర్యవేక్షణ, ప్రసవానంతర సంరక్షణ ఉంటే ఈ ప్రాణాల్లో చాలా వరకు కాపాడుకోవచ్చు. కానీ ఆ అవకాశమే అందరికీ దక్కడం లేదు. ఒక నెల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లల పరిస్థితి కూడా అంతే బాధాకరం.

న్యూమోనియా, డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ఇప్పటికీ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇవి వినిపించడానికి సాధారణంగా అనిపించినా సరైన ఆహారం లేకపోతే, శరీరానికి బలం లేకపోతే ఇవే ప్రాణాలను తీస్తున్నాయి. 2024లో తీవ్ర పోషకాహార లోపం కారణంగానే లక్షకు పైగా చిన్న పిల్లలు మరణించినట్టు అంచనా. అంటే ఆకలి కూడా ఒక మౌన హంతకుడిగా మారింది. ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. ఒక బిడ్డ ఎక్కడ పుడుతుందో.. అదే అతని జీవితాన్ని నిర్ణయిస్తోంది. ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పేదరికం, ఆస్పత్రుల లేమి, స్వచ్ఛమైన నీరు లేకపోవడం, విద్యా లోపం..లాంటివి కలిసి ఒక చిన్న ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. యుద్ధాలు, ఘర్షణలు ఉన్న ప్రాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ బతకడం కూడా ఒక పోరాటమే.

పిల్లలు పెద్దవాళ్లయ్యాక ప్రమాదం ఆగిపోదు. వయస్సు పెరిగే కొద్దీ సమస్యలు మారిపోతాయి. వ్యాధులతో పాటు ప్రమాదాలు, గాయాలు, మానసిక ఒత్తిడి కూడా కారణాలుగా మారుతున్నాయి. అంటే జననం నుంచి యువ స్థితి వరకు ప్రతి దశలోనూ ఒక బిడ్డకు భద్రతా అనే హామీ లేదు.
ఇన్ని సమస్యల మధ్య ఒక ఆశ కూడా ఉంది.

1990 నుంచి ఇప్పటివరకు ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు దాదాపు 60 శాతం తగ్గాయి. వ్యాక్సిన్లు, మెరుగైన పోషణ, ప్రాథమిక ఆరోగ్య సేవలు ఈ మార్పుకు కారణం అయ్యాయి. కానీ ఇప్పుడు అదే వేగం తగ్గిపోతోంది. కొన్నిచోట్ల పరిస్థితి పూర్తిగా ఆగిపోయినట్టే ఉంది. ఇక్కడే అసలు భయం మొదలవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 4ఏళ్లలో మరో 2 కోట్ల మంది పిల్లలు ఐదేళ్లు కూడా నిండకముందే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. అందులో దాదాపు కోటి 30లక్షల మంది పుట్టిన కొద్ది రోజుల్లోనే మరణించే అవకాశం ఉంది. వీటికి పరిష్కారం ఉన్నా.. అందరికీ అవి చేరడం లేదు. టీకాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, వైద్య విధానాలు ఉన్నాయి కానీ అవి అత్యవసరంగా అవసరమైన పిల్లల దగ్గరకు చేరడం లేదు.

యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక సమస్యలు లాంటి అంశాలు ఈ గ్యాప్‌ను ఇంకా పెంచుతున్నాయి. ఇలా బతికే అవకాశం ఉన్నా కూడా ఈ చిన్న ప్రాణాలను కాపాడలేకపోతే.. మన అభివృద్ధి అనే మాటకు అర్థమేముందో మీరే చెప్పండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!

ALSO READ: పిల్లల ఆకలి తీరడం పైన ఏడుపులు ఏంటి ‘గరికపాటి ? గడ్డిపోచ లాంటి మాటలతో పేదల కడుపు కొట్టాలా? ఇదేనా నీ చదువు, సంస్కారం?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *