Menu

Parenting: భావోద్వేగ నిర్లక్ష్యం… ఈ గాయలు కనిపించవు కానీ.. పిల్లల జీవితాన్నే నాశనం చేస్తాయ్!

Lakshmi Aruna 8 months ago
telugu news emotional support for kids

చిన్నప్పుడే పిల్లల మనసు ఎంత సున్నితమో మనందరికీ తెలుసు. వాళ్లు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో, ఎలాంటి మాటలు వింటారో, ఎంత ప్రేమను అనుభవిస్తారో లాంటివి వారి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. చాలాసార్లు మనం దృష్టి పెట్టేది శారీరక దాడి, దౌర్జన్యం లాంటి విషయాలపై. కానీ అసలు కనిపించని పెద్ద గాయం భావోద్వేగ నిర్లక్ష్యం వల్ల వస్తుంది. పిల్లాడికి తల్లిదండ్రులు సమయం ఇవ్వకపోవడం, అతని భావాలను పట్టించకపోవడం, తన అభిప్రాయాలు చెప్పనివ్వకపోవడం లాంటివి బయటికి పెద్ద సమస్యలా కనిపించకపోయినా, లోపల మాత్రం బలమైన ముద్ర వేసేస్తాయి. ఒక చిన్నారి తన ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడం, తాను ఏడుస్తున్నప్పుడు ఎవ్వరూ ఆదరించకపోవడం లాంటివి అతనిలో ఒకరకమైన ఖాళీని సృష్టిస్తాయి. ఈ ఖాళీ వల్ల నెమ్మదిగా ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, తన భావాలు వ్యక్తపరచడంలో ఇబ్బంది పడటం, ఇతరులతో కలిసిపోవడంలో వెనుకబడటం లాంటి సమస్యలకు దారి తీస్తుంది.

సమస్యలు తప్పవు

ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు, పెద్దయ్యాక తమ మనసులో ఒక ఖాళీ ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుందో అర్థం చేసుకోలేరు. భావోద్వేగ నిర్లక్ష్యం అనుభవించిన వారు భయపడే మనస్తత్వం కలిగి ఉండొచ్చు, ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకోవచ్చు, లేదా కొన్నిసార్లు అవసరం లేని చోట కూడా మరీ ఎక్కువగా స్నేహం చేయాలనుకోవచ్చు. వారి మెదడు అభివృద్ధిపైనా దీని ప్రభావం పడుతుంది. భావాలను గుర్తించడంలో, నియంత్రించడంలో కష్టాలు వస్తాయి. ఫలితంగా ఆందోళన, డిప్రెషన్, తక్కువ ఆత్మవిశ్వాసం, సంబంధాలను కొనసాగించడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి.

ఎదుర్కోవడం ఎలా?

అయితే దీన్ని ఎదుర్కోవడం అసాధ్యం కాదు. చిన్నప్పుడే పిల్లలతో మాట్లాడటం, వాళ్ల మాటలు వినటం, వారి భావాలను అంగీకరించడం చాలా అవసరం. పెద్దవాళ్లు కూడా తమలో చిన్ననాటి నిర్లక్ష్యం గాయాలను గుర్తించి, అవసరమైతే సైకలాజికల్ సపోర్ట్ లేదా థెరపీ తీసుకుంటే ఆ గాయాల నుండి బయటపడవచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. పిల్లలకు ప్రేమ, సమయం, ఆప్యాయత ఇవ్వడం ఎప్పుడూ చిన్న విషయం కాదు. ఇవి వాళ్ల భవిష్యత్తుకు పునాది. శారీరక హింస కంటే కూడా కనిపించని భావోద్వేగ నిర్లక్ష్యం జీవితాంతం మచ్చలు మిగల్చుతుంది. కాబట్టి మనం ప్రతి చిన్నారికి ఆత్మీయతతో, అర్ధంతో, మనసారా తోడుగా ఉండాలి.

మీరు మీ పిల్లలకు ఈ రోజు కాసేపు సమయం ఇచ్చి వారి మాటలు వింటే, వాళ్లు రేపు జీవితాన్ని ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కొనే శక్తి పొందుతారు. ఇదే మనం వారికిచ్చే అతి పెద్ద బహుమతి.

ALSO READ: పిల్లల బ్యాగ్‌ల్లో కత్తులు, రాడ్లు.. పసిమనసులను హంతకులగా చేస్తుంది ఎవరు?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *