Menu

Strict Parenting: పిల్లల పట్ల కఠినంగా ఉంటున్నారా? సైకాలజిస్టులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

Lakshmi Aruna 3 months ago
what is strict parenting

మనలో చాలామంది చిన్నప్పటి నుంచి ‘ఇది చేయొద్దు… అక్కడికి వెళ్లొద్దు… ఇలా మాట్లాడొద్దు…’ ఇలాంటి మాటలే వింటూ పెరుగుతారు… చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలను చాలా కఠినంగా పెంచుతారు. వారి ఉద్దేశం చెడు కాదు. పిల్లలు తప్పు దారిలో పోకూడదనే ఆలోచనతోనే వారు కఠినంగా ఉంటారు. కానీ సైకాలజీ నిపుణులు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చలో ఉంది. అదేంటో తెలుసా? చాలా స్ట్రిక్ట్ గా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక సంబంధాల్లో ‘బౌండరీస్’ పెట్టడంలో ఎందుకు ఇబ్బంది పడతారో అని.

బౌండరీ అంటే ఏమిటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే… మనకు నచ్చని విషయాలకు “నో ” చెప్పడం. మన భావాలను స్పష్టంగా చెప్పడం. మనకు అనుకూలం కాని పరిస్థితుల్లో మన స్థానం చెప్పడం. ఇవి ఆరోగ్యకరమైన సంబంధాలకి చాలా అవసరం. కానీ చిన్నప్పటి నుంచి కఠిన నియమాలతో పెరిగిన పిల్లలకు ఇది కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. ఎందుకంటే అలాంటి కుటుంబాల్లో చాలాసార్లు ఒక పద్ధతి ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ప్రశ్నలు అడగకూడదు. తల్లిదండ్రుల మాటే చివరి మాట. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ‘వాదించకపోవడం మంచిది’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు.

అంటే తమ అభిప్రాయం చెప్పడం కంటే మౌనం వహించడం బెటర్ అని అనిపిస్తుంది. ఇదే అలవాటు పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. స్నేహితులతో, భాగస్వామితో లేదా పని చేసే చోట… తమకు నచ్చని విషయం జరిగినా కూడా వారు చాలాసార్లు “నో ” అని చెప్పలేరు. దీనిని సైకాలజీలో ‘పీపుల్ ప్లీజింగ్’ అని కూడా అంటారు. అంటే ఇతరులను సంతోషపరచడానికి మన అవసరాలను పక్కన పెట్టడం.

స్ట్రిక్ట్ పేరెంట్స్ వద్ద పెరిగిన పిల్లలు పెద్దయ్యాక సంబంధాల్లో హద్దులను నిర్ణయించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సైకాలజిస్టులు దీన్ని ఆథరిటేరియన్ పేరెంటింగ్ స్టైల్‌గా వివరిస్తారు.

ఇంకో సమస్య కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటే… పిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నేర్చుకోరు. దాంతో పెద్దయ్యాక కూడా “నేను ఏమి కోరుకుంటున్నాను?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టంగా అనిపించవచ్చు. అయితే దీని అర్థం కఠినమైన పెంపకం పూర్తిగా తప్పు అని కాదు. చాలా తల్లిదండ్రులు ప్రేమతోనే నియమాలు పెడతారు.

మరో ముఖ్యమైన అంశం నియంత్రణను ప్రేమగా భావించే మానసిక ధోరణి. ప్రతి విషయాన్ని పర్యవేక్షించే వాతావరణంలో పెరిగినప్పుడు కంట్రోల్‌ను కూడా రక్షణగా భావించే భావన ఏర్పడుతుంది. సంబంధాల్లో జెలెస్‌, అధిక జోక్యం లేదా కంట్రోల్‌ ఉన్నప్పటికీ అది సమస్యగా కనిపించకపోవచ్చు. కొందరు పరిశోధకులు దీన్ని ఎమోషనల్ బౌండరీ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు.

క్రమశిక్షణ కూడా జీవితంలో అవసరం. కానీ అదే సమయంలో పిల్లలకు ఒక అవకాశం కూడా అవసరం. తమ భావాలు చెప్పే అవకాశం. ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ. కొన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకునే అనుభవం. ఇవి ఉంటే పిల్లలు పెద్దయ్యాక తమ సంబంధాల్లో కూడా ఆరోగ్యకరమైన బౌండరీస్ పెట్టగలుగుతారు. కాబట్టి ఈ విషయం మనకు ఒకటే గుర్తు చేస్తుంది. పిల్లలను కాపాడటం ముఖ్యమే… కానీ వారి మాటను కూడా వినడం కూడా అంతకన్నా ముఖ్యం.

ALSO READ: ఈ దేశాల్లో మహిళలకు నెలసరి సెలవు.. లిస్ట్‌లో మీరు ఊహించని పేరు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *