Menu

ఆమె నడిచిన దారి..! కొన్ని పరిచయాలు జీవితానికి కొత్త అర్థాన్ని నేర్పుతాయి

Tri Ten B (Triya) 3 months ago
journalist aruna writings story

కొన్నిసార్లు జీవితంలో కొన్ని పేజీలు మెల్లగా మూసుకుపోతాయి. ఒకప్పుడు మనకు ఎంతో ముఖ్యంగా అనిపించిన బంధాలు, కలలు, నమ్మకాలు కాలం గడుస్తుండగా దూరమవుతాయి. జీవితం మాత్రం ఆగదు. అది ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ మనలో ఏదో మారిపోతుంది. ఒకప్పుడు సాధారణంగా వచ్చిన నవ్వు తగ్గిపోతుంది. కన్నీళ్లు కూడా రావడం ఆగిపోతుంది. భావాలు ఉన్నా అవి బయటకు కనిపించవు. మనిషి బతుకుతూనే ఉంటాడు కానీ బతుకుపై ఎలాంటి ఆశా ఉండదు.

రోజులు ఒకేలా గడుస్తుంటాయి. ఉదయం లేవడం, పని చేసుకోవడం, తిరిగి ఇంటికి రావడం, నిద్రపోవడం. మన ప్రపంచం మనకే పరిమితమైపోతుంది. ఎవరి కోసం మారాల్సిన అవసరం లేకుండా జీవించడం ఒక స్వేచ్ఛలా అనిపిస్తుంది. ఒంటరిగా ఉండటం కూడా ఒక అలవాటుగా మారిపోతుంది. కాలం నెమ్మదిగా ముందుకు సాగుతుంటుంది. మనం కూడా దాని వెంట నడుస్తూ ఉంటాం.

అలాంటి సమయంలో కొన్నిపరిచయాలు జీవితంలోకి వస్తాయి. రోజులు గడుస్తుండగా మనకు తెలియకుండానే కొన్ని విషయాలను నేర్పుతాయి. ఆ పరిచయం మనం మర్చిపోయిన జీవితాన్ని, బంధాలను, భావోద్వేగాలను గుర్తుచేస్తాయి. ఒక ఒంటరి మహిళను దగ్గరగా గమనించినప్పుడు జీవితమే మారిపోవచ్చు. ఆమె జీవితం బయటికి చూస్తే సాధారణంగానే కనిపించవచ్చు కానీ లోపల చూస్తే అది ఒక గొప్ప పోరాటం. ఇద్దరు చిన్న పిల్లల్ని చేతుల్లో పెట్టుకుని ముందుకు నడుస్తున్న జీవితం. ప్రతి ఉదయం ఆమెకు కొత్త బాధ్యతతో మొదలవుతుంది. ప్రతి రోజు ఆమెకు ఒక పరీక్షలా ఉంటుంది. అయినా ఆమె ఆగదు. ఆమె నవ్వుతుంది. అలసట ఉన్నా నవ్వుతుంది. గుండెల్లో ఎన్నో భారాలు ఉన్నా నవ్వుతుంది. ఎందుకంటే ఆమెకు ముందుకు నడవడానికి కారణం స్పష్టంగా ఉంటుంది. అదే.. ఆ ఇద్దరు పిల్లలు..వాళ్ల భవిష్యత్తు..! ఆ బాధ్యత ఆమెకు బలాన్ని ఇస్తుంది. జీవితం ఎన్ని కష్టాలు చూపించినా కూడా వెనక్కి తగ్గకుండా నిలబడే ధైర్యం ఆమె అడుగుల్లో కనిపిస్తుంది.

ఒంటరిగా జీవించే మహిళను ప్రపంచం ఎప్పుడూ వేరే కోణంలోనే చూస్తుంటుంది. కొందరు అనుమానంతో చూస్తారు. కొందరు దగ్గరికి వచ్చి సాయాన్ని ఆశబెడతారు. తమకేదో దక్కుతుందో అనుకుంటారు. ఇంకొందరు దూరంగా నిలబడి మాట్లాడుతారు. కానీ ఆమె ఆ చూపులన్నింటినీ చాలా ప్రశాంతంగా దాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఆమెకు ఒక విషయం తెలుసు. తన జీవితం తన పిల్లలు మాత్రమేనని. వారి కోసమే ఈ బతుకు అని..!

ఆమె నడకలో ఒక గౌరవం ఉంటుంది. ఒక స్వాభిమానం ఉంటుంది. తన పిల్లల భవిష్యత్తు మీద ఉన్న నమ్మకం ఆమెను నిలబెడుతుంది. అలాంటి మహిళని దగ్గరగా చూస్తూ ఉండటం ఒక అనుభవం. అలాంటి మనిషి ప్రయాణానికి సాక్షిగా ఉండటం కూడా ఒక అదృష్టం.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా మనలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. మనం మళ్లీ మనల్ని చూసుకోవడం మొదలుపెడతాం. ఇంతకాలం పట్టించుకోని విషయాలు కూడా ముఖ్యంగా అనిపిస్తాయి. నెత్తిపై కనిపించే జుట్టు నుంచి మనసులో లోలోపాల దాగిన భావాల వరకు ప్రతీది మార్చుకోవడం మొదలువుతంది. జీవితమంటే కేవలం రోజులు గడపడం మాత్రమే కాదని అర్థమవుతుంది.

ఉదయం లేచినప్పుడు మనకు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ల ముందే ప్రతి రోజు పోరాడుతూ నిలబడే ఆమె జీవితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు కూడా అదే ఆలోచన మనసులో ఉంటుంది. జీవితం అంటే కేవలం మనకోసం మనమే గడపడం,బతకడం కాదనే భావన మనలో మెల్లగా పెరుగుతుంది. వోల్గా రాసిన ‘స్వేచ్ఛ’ నవల సారాంశం ఇదేనేమో అనిపిస్తుంది. ఇతరుల స్వేచ్ఛకోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేమి ఉండదని తెలిసి వచ్చింది. మనకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి.. మన ఉనికివల్ల సమాజానికేదో చలనం ఉండాలి. ఆ పనిలో మనల్ని మనం నిరూపించుకోవాలి. దానివల్ల మనకెంతో తృప్తి. మన జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కూడా!

మనకు తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ల కోసం మనం బతుకుతాం. కానీ కొన్నిసార్లు జీవితం మనకు ఇంకొక కుటుంబాన్ని కూడా చూపిస్తుంది. రక్త సంబంధం లేకపోయినా కూడా మనసుకు దగ్గరయ్యే ఒక కుటుంబం. ఆ పరిచయం నెమ్మదిగా ఒక బంధంగా మారుతుంది. ఆ బంధం మాటల్లో చెప్పలేని దగ్గరితనంగా మారుతుంది. ఒక సంవత్సరం గడిచేలోపే మన జీవితం ఎంత మారిపోతుందో అప్పుడు అర్థమవుతుంది. ఎన్నో సంవత్సరాలు మారని మన అలవాట్లు కూడా మారిపోతాయి. మనం మనల్ని కొత్తగా చూసుకోవడం మొదలుపెడతాం. మనలో మళ్లీ జీవితం కనిపించడం మొదలవుతుంది.

ఒక మనిషి ధైర్యం పట్ల కలిగే గౌరవం, ఒక తల్లి తన పిల్లల కోసం నిలబడే శక్తి పట్ల కలిగే గౌరవం. ఆ గౌరవం మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తుంది. కొన్ని పరిచయాలను నిర్వచించడం చాలా కష్టం. అవి మన జీవితంలోకి వచ్చి ఒక నిజాన్ని గుర్తు చేస్తాయి.మనిషి జీవితాన్ని మార్చేది కేవలం పెద్ద పెద్ద ఘటనలే కాదు. ఒక మనిషి ధైర్యం చాలు. ఒక మనిషి బాధ్యత చాలు. ఒక మనిషి గౌరవంగా నిలబడే నడక చాలు. అందుకే కొన్ని పరిచయాలు ప్రత్యేకం. అవి మనిషిని మళ్లీ జీవితంపైవు నడిపిస్తాయి.

ALSO READ: ‘ఓ స్త్రీ నీవెక్కడ..’? బంధనాల నుంచి విప్లవాల వరకు సాగిన మహిళా చరిత్రలో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు!


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *