సాంకేతికంగా ప్రపంచం ఎంత అభివృద్ది చెందిందని చెప్పుకున్నా, స్త్రీ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. పుట్టిన క్షణం నుంచే ఆమెపై సమాజం ఎన్నో అంచనాలు పెడుతుంది. ఆమె ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అనే నియమాలను కూడా అదే సమాజం నిర్ణయిస్తుంది.
చిన్నపాపగా ఉన్నప్పుడు బాధ్యతగా చూసుకునే మనుషులు.. వయసు పెరిగేకొద్దీ భారంగా మారిందని భావించే సమాజం..ఇదే ఇప్పటికీ కనిపించే వాస్తవం. చదువు, ఉద్యోగం, కలలు ఉన్నా కూడా ఆమెకు నిజమైన గుర్తింపు దొరకని సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అదే జీవితంలో మరో నిజం కూడా ఉంది. ఎన్నో బాధలు, ప్రశ్నలు, పరిమితుల మధ్య కూడా స్త్రీ తనలో ఒక అపారమైన శక్తిని మోస్తుంది. ఆ శక్తి ఒక్క కుటుంబానికే కాదు, సమాజానికే ఆధారం అవుతుంది. ఈ ఆలోచనల మధ్య నుంచి పుట్టే ఒక ప్రశ్నే.. ‘ఓ స్త్రీ… నీవెక్కడ?’
ఓ స్త్రీ నీవెక్కడ?
పుట్టగానే గొంతు నులిమి చంపేసే రాక్షస చేతుల్లోనా..
నెలల వయసునుండే నిన్ను కామంతో చూసే కామాంధుల కళ్లలోనా?
ఓ స్త్రీ నీవెక్కడ?
ఎంతో ఇష్టంగా పెంచుకున్నా వయసు పెరిగే సరికి
తల్లిదండ్రులకి భారమైన ఇంట్లోనా
లేక వాళ్ళు కట్టబెట్టీ తరిమేసే
ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి చేతిలోనా?
ఓ స్త్రీ నీవెక్కడ?
ఇష్టపడి చదివి.. కష్టపడి ఉద్యోగం చేసినా
నీకంటూ ఒక గుర్తింపు లేని అత్తగారి ఇంట్లోనా?
అలసిపోయి సొలసిపోయినా
నీకంటూ ఒక రోజు లేని నిరంతర పని దినాలలోనా?
ఓ స్త్రీ నీవెక్కడ?
రాత్రిళ్ళు కనపడకుండా వెక్కివెక్కి ఏడ్చి
బాధ్యతల నడుమ బందీగా మారి
అందరితో మాటలు పడుతూ
ఇంకెందరికోసమో కాలం వెళ్లదీస్తూ
ఎదుటివారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ గడిపే
నీ జీవితానికి గుర్తింపెక్కడ?
ఆడది అంటే ఇలానే ఉండాలి అని
తలరాత రాసిన ఆ బ్రహ్మకైనా
కనీసం జాలి కలగలేదా?
నీ రాత రాసినప్పుడు అయ్యో అని అనిపించలేదా?
అయితే విను ప్రపంచమా…
ఆడది బలహీనత కాదు
ఆడది బాధల ప్రతిరూపం కాదు
ఆడది సహనం మాత్రమే కాదు
ఆడది ఒక శక్తి.
అమ్మగా జన్మనిచ్చేది ఆమె
చెల్లిగా ఆప్యాయత పంచేది ఆమె
భార్యగా జీవితాన్ని నిలబెట్టేది ఆమె
కూతురుగా ఇంటికి వెలుగు తెచ్చేది ఆమే.
ఆమె ఏడుపులో బాధ ఉంది
ఆమె నవ్వులో ప్రపంచం ఉంది
ఆమెను బంధించాలనుకునే ప్రతి గొలుసు
ఏదో ఒక రోజు తెగిపోతుంది.
ఆమెను చిన్నచూపు చూసే ప్రతి చూపు
ఒక రోజు తలవంచుతుంది.
ఎందుకంటే…
ఆమె కేవలం ఒక స్త్రీ కాదు
ఆమె ఒక సృష్టి
ఆమె ఒక పోరాటం
ఆమె ఒక విప్లవం
ఓ స్త్రీ.. నీవెక్కడ ? అని అడిగే రోజులు పోయాయి..
నీ వల్లే ఈ ప్రపంచం నిలిచింది అనే రోజులు రాబోతున్నాయి.
స్త్రీ జీవితాన్ని చాలా కాలంగా బాధలు, బాధ్యతలు, త్యాగాల కోణంలో మాత్రమే చూసే అలవాటు సమాజానికి ఉంది. కానీ అదే జీవితంలో మరో ముఖం కూడా ఉంది.. అది ధైర్యం, సహనం, నిలబడి పోరాడే శక్తి. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. ప్రతి పాత్రలో ఆమె కేవలం బాధ్యతలు మాత్రమే కాదు, ఒక కుటుంబానికి బలం కూడా అవుతుంది. అందుకే స్త్రీ గురించి అడిగే ప్రశ్నలు కేవలం ఆమె ఎక్కడ ఉందనే దానికే పరిమితం కాకూడదు. ఆమె చేసిన పోరాటం, ఆమె నిలబెట్టిన ప్రపంచాన్ని కూడా సమాజం గుర్తించాలి. లేదంటే ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా వ్యర్థమే!

Women’s Day: ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిన మహిళల నిరసనలు.. విమెన్స్ డే హిస్టరీ ఇదే!
Women’s Day 2024: ఒక్క రోజు ఆరాటం.. ఆసాంతం అణచివేత.. ఆడవాళ్లు తెలుసుకోవాల్సిందదే!