Menu

Garikapati Controversy: పిల్లల ఆకలి తీరడం పైన ఏడుపులు ఏంటి ‘గరికపాటి ? గడ్డిపోచ లాంటి మాటలతో పేదల కడుపు కొట్టాలా? ఇదేనా నీ చదువు, సంస్కారం?

Tri Ten B (Triya) 3 months ago
garikipati narasimha rao egg mid day meals controversy

‘కళ్ళముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం..’ అంటాడు సిరివెన్నెల..! ‘కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే.. గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే’ అంటూ రుద్రవీణ సినిమాకు ఓ మంచి పాటనిచ్చారాయన..! ఈ అక్షరాలు, మాటలు అచ్చుగుద్దినట్టు సరిపోయే ఓ బ్రాహ్మణ ఛాందస్సవాది గరికపాటి నరసింహారావుని తెలుగు సమాజం అక్కున చేర్చుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. యూట్యూబ్‌లో షార్ట్స్‌ నుంచి ఇన్‌స్టా రీల్స్‌ వరకు ప్రతీ చోటా ఉపన్యాసాలు దంచే ఈ వేద పండితుడికి ఆకలితో బాధ పడే పిల్లాడికి, శోభనానికి తయారయ్యే పెళ్లికొడుక్కి పోలికలు కనిపించడం దుర్మార్గం.

చిన్న వయసులోనే చేతికి పుస్తకం కాకుండా పనిముట్లు పట్టుకోవాల్సిన పరిస్థితి. అలాంటి ఇంట్లో పుట్టిన బిడ్డకి పాఠశాల అంటే పాఠాలు కాదు, ఒక పూట తిండి దొరికే చోటు.

33 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని బడాయికి పోయే ఈ పుణ్య, పవిత్ర భారతదేశంలో కోట్ల మందికి పూట గడవడం కూడా ఒక పోరాటమే. ఉదయం లేవగానే చదువు కాదు… ముందుగా కడుపు గురించే ఆలోచించే పిల్లలు ఉన్న దేశం ఇది. అలాంటి దేశంలో పిల్లలు స్కూల్‌కి రావడానికి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంపైనా అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం గరికపాటికే చెల్లుతుంది. వారు తినే భోజనంలో బల్లి పడినా, పిల్లి పడినా పిల్లలు ఏం మాట్లాడకూడదట.. ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి తినాలట..! గరికపాటికేం పోయింది.. ఎక్కడకు వెళ్లినా నైవేద్యాలు, పులిహారాలు మెక్కే వృత్తి ఉంది. దేశానికి పైసా ప్రయోజనం లేని పనితో నోటికి వచ్చిన సొల్లు పురాణం మాట్లాడుకునే స్వేచ్ఛను ఈ రాజ్యాంగం ఆయన లాంటి వారికి కట్టబెట్టింది.

ఆకలి ఎలా కడుపు లోపల మండుతుందో ఎప్పుడైనా అనుభవించారా? పుస్తకం తెరిచి కూర్చున్నా అక్షరాలు కనిపించకుండా కడుపు శబ్దమే వినిపించే స్థితి ఎలా ఉంటుందో తెలుసా? గిన్నెలో పడే ఒక్క మెతుకు అన్నం కూడా ఒక పిల్లవాడికి గౌరవం లాంటిదే. అలాంటి సమయంలో పిల్లలు కేవలం తినడానికి మాత్రమే వస్తున్నారని చెప్పే దౌర్భాగ్యమైన ధోరణి బయటపడుతుంది. ఇది జ్ఞానం కాదు, ఇది మనిషి బాధని అర్థం చేసుకోలేని అహంకారం.

వేదాలు చదవడం, శ్లోకాలు చెప్పడం ఏదో గొప్ప విషయం కాదు. మన ముందున్న మనిషి కడుపు ఖాళీగా ఉందని గుర్తించే మనసు ఉండాలి. ఆ బాధను అర్థం చేసుకునే చైతన్యం ఉండాలి. అది లేకపోతే నీ వేద చదువు మొత్తం దండగ. ఒక పూట తిండి కోసం పాఠశాలకు వచ్చే పరిస్థితిని సృష్టించిన సమాజం అదే పిల్లలకు తిండి పెట్టాల్సిన బాధ్యత వహించాలి. ఇదేదో ఉపకారం కాదు, ఇదే న్యాయం.

కరుణ లేకుండా పెరిగిన చదువు గుండెను రాయి చేస్తుంది, ఇతరుల బాధను చిన్నచూపు చూస్తుంది. ఇక్కడ సమస్య ఒక్క మాటలో కాదు, ఆ మాట వెనుక ఉన్న భావజాలంలో ఉంది. గుడ్డు గురించి మాట్లాడితే అపవిత్రం అంటారు, కానీ పోషకాహారం గురించి మాత్రం ఒక్క మాట ఉండదు. పిల్లవాడి శరీరం బలంగా ఉండాలా, లేదా నీ నమ్మకం గెలవాలా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేని స్థితి నీది. నీ కులం వాళ్లు ఏం తింటారో అందరూ అదే తినాలనుకునే నీచమైన బుద్ధి నీది. ఇది వ్యక్తిగత ఇష్టం కాదు.. ఇది తరతరాలుగా పెరిగిన అధికారం మాట్లాడుతున్న స్వరం.

చదువుకున్నోళ్లంతా సంస్కారవంతులని ఎవరన్నారు…నూటికి తొంభై తొమ్మిది మంది సంస్కారహీనులే!

ఈ ధోరణి ఎక్కడి నుంచి వస్తుందో వెనక్కి వెళ్లి చూస్తే కులంతో కట్టిపడేసిన ఒక పాత నిర్మాణం కనిపిస్తుంది. ఎవరు శ్రమ చేయాలి, ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరి మాటే తుదిమాట అవ్వాలి అనే అంశాలను ముందుగానే నిర్ణయించేసిన వ్యవస్థ ఇది. భూమి మీద చెమటోడ్చే చేతులు కింద ఉండాలి, మాటలతో బ్రతికే వర్గం పైకి ఉండాలన్న భావం ఇక్కడే పుట్టింది. అదే భావం ఇప్పటికీ మారలేదు. పని చేసే వాడి కడుపు గురించి కాదు, అతను ఏం తినాలన్నది కూడా బలిసిన కులాలే చెబుతుండడం వారి అహంకారానికి అద్దం పడుతోంది. కష్టంతో బ్రతికే మనిషి జీవితాన్ని చిన్నచూపు చూడటం, అతని ఆహారంపై కూడా హక్కు చూపించడం వ్యక్తిగత అభిప్రాయం కాదు, కులాధిపత్యం ఇంకా బ్రతికే ఉందని చెప్పే నిజం.

శోభనానికి సిద్ధమయ్యే పెళ్లికొడుక్కి, ఆకలితో స్కూల్‌కి వచ్చే పిల్లాడికి పోలిక పెట్టడం ఎంత దారుణమైన విషయమో కదా! ఒకరి ముందు విందు, మరొకరి ముందు కడుపు నింపే అన్నం. ఒకరు సంప్రదాయం పేరుతో అలంకరించబడతారు, మరొకరు ఆకలితో కూర్చుంటారు. ఈ రెండింటిని ఒకే తూకంలో తూచే ఆలోచన ఎంత క్రూరమో అర్థం చేసుకోవాలి. అది సరదా పోలిక కాదు, అది పేదరికాన్ని ఎగతాళి చేసే చూపు.

మధ్యాహ్న భోజనంలో నాసిరకమైన ఆహారం తిని ఆస్పత్రుల పాలైన విద్యార్థుల గురించి తరుచు వింటుంటాం. బల్లి పడితే, పురుగు పడితే ఎవరూ తినరు. పిల్లలు కూడా తినరు. వాళ్లు మనుషులే. కానీ ఆ లోపాన్ని సరిచేయాల్సిన చోట, పిల్లలనే మౌనంగా తినమని చెప్పడం దారుణం. సమస్య ఆహారం నాణ్యతలో ఉంటే దాన్ని మెరుగుపరచాలి. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి తినాలనే భావం గరికపాటి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

కరుణ లేకుండా పెరిగిన విద్య సమాజాన్ని చీల్చుతుంది.

ఇక్కడే బ్రాహ్మణిజం అనే భావజాలం లోపలి రూపం బయటపడుతుంది. పవిత్రం, అపవిత్రం అనే పేర్లతో మనుషుల జీవితాల్ని కొలవడం.. ఆహారంలో ఎక్కువ, తక్కువులను చూడడం ఎంత మూర్ఖమైన ఆలోచనో! శ్రమతో బతికే మనిషిని దిగజార్చి, మాటలతో బ్రతికే వర్గాన్ని పైకి ఎత్తే దారి ఇది. దీన్నే చాందసం అంటారు. మానవత్వాన్ని మర్చిపోయిన అహంకారమంటారు. ఆకలి ముందు నీ సంస్కారం నిలబడదు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నీ పవిత్రతకు విలువ ఉండదు. మనిషి బతకడం కంటే పెద్ద ధర్మం ఏదీ లేదు. ఆ బతుకును అవమానంగా మార్చే ప్రతి ఆలోచన, ప్రతి మాట ఈ సమాజం మీద మచ్చలా మిగిలిపోతుంది. గరికపాటికి ఈ విషయం ఇప్పటికైనా బోధపడితే చాలా మంచిది.

ALSO READ: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!

 


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *