Menu

Madvi Hidma: మనిషి చనిపోయినా ఆశయం చనిపోదు.. హిడ్మా జీవితం చెబుతున్న పాఠమిదే!

Lakshmi Aruna 5 months ago
who is hidma

అది ఒక దండకారణ్యం… రాత్రి 12 దాటిన తర్వాత అడవి మొత్తం శవాన్ని కప్పిన చీకటిలా ఉంది. పొదలు కదిలితే.. గాలివల్లనా? లేదా నీడల్లో దాక్కొని ఎవరైనా ఊపిరి బిగపట్టుకున్నారా? అలాంటి రాత్రుల్లో భద్రతా బలగాల మెదడులో మెరిసేది ఒక్క రూపమే… అతనే.. ‘హిడ్మా’.

ఏంటి?
హిడ్మా వచ్చాడా?’ అనే ఒక భయం. ఎందుకంటే..?
అతడు ఒక వ్యక్తి కాదు… పేదవారి నీడ.

నిన్నమొన్నటి వరకు భారత దళాలు పట్టుకోలేని అత్యంత ప్రమాదకర మావోయిస్టు కమాండర్ హిడ్మా.. చివరకు అడవి తల్లి ఒడిలోనే కన్నుమూశాడు.

ఇంతకి అసలు ఎవరీ హిడ్మా?

భారత ఇంటెలిజెన్స్ డైరెక్టరీలో అతడి గురించి వచ్చే తొలి మాటే..’No Confirmed data..’
అతని అసలు పేరు తెలియదు, వయసు కూడా కచ్చితంగా లేదు. ఫోటో కూడా 100శాతం నమ్మదగినది కాదు. అతని కమ్యూనికేషన్ మొత్తం కోడ్ భాషలోనే ఉంటుంది. అడవిలో మార్గాలు… అతడికి మాత్రమే తెలిసిన రహస్య ట్రైల్స్. అంటే అతని ఉనికి పొగలా కనిపిస్తుంది, మాయం అవుతుంది.

బాలుడు నుంచి బ్లడీ కమాండర్ వరకు..:

అతను ఒక చిన్న ఆదివాసి గ్రామంలో జన్మించాడు. ఇదే తెలిసిన ఒకే ఒక లైన్. తర్వాత అడవిలో పెరిగాడు. అక్కడే అతనికి శిక్షణ, ఆయుధాలు, గెరిల్లా టాక్టిక్స్ అన్నీ నేర్పించారు. నీళ్లు లేకుండా మూడు రోజులపాటు బ్రతకగల సత్తా వున్నవాడు. ఒకే రాత్రిలో 25-30 కిలోమీటర్లు నడవడం, శబ్దాలను నిశితంగా గుర్తించి పోలీసులు ఉన్నారో లేదో చెప్పడం, బాంబులు ఎక్కడ పెడితే.. వందల మంది చిక్కుకుంటారో అంచనా వేయడం…ఇవి అన్నీ అతడికి సాధారణ శిక్షణ. 25 ఏళ్లకే ఏరియా కమాండర్ స్థాయికి వెళ్ళాడు. 30 ఏళ్లకు..ఆపరేషన్స్ బ్రెయిన్, ఇప్పుడు దండకారణ్యంలోనే అత్యంత శక్తివంతమైన కమాండర్.

హిడ్మా “దాడులు”… భయానకమైన ప్లానింగ్

హిడ్మా దాడుల్లో ముఖ్యంగా కనిపించేది అతని ప్లానింగ్. ఒక అంబుష్ జరుగుతుందంటే అది నెలల తరబడి జరుగుతున్న రికనైసెన్స్ తర్వాతే. గ్రామాల్లో ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్, అడవిలో రహస్య క్యాంపులు, పోలీసుల కదలికలను గమనించి సరిగ్గా దాడి జరిగే స్థలాన్ని ఖరారు చేయడం…ఈడీ హిడ్మా వ్యూహం. దాడి జరిగిన తర్వాత అతడు, అతని గ్రూప్ అడవిలో కరిగిపోయినట్టే మాయం అయిపోతారు. ఈ తప్పించుకునే నైపుణ్యం వల్లే అతడి మీద ఎన్ని ఆపరేషన్లు జరిపినా విఫలమవుతాయి. ఈ టాక్టిక్స్ వల్లనే అతడిని ఘోస్ట్ కమాండర్ అంటారు. హిడ్మా అనేక మారణహోమాలకు నేతృత్వం వహించినట్లు భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి.

వాటిలో కొన్ని:
2010 దంతెవాడ దాడి: 76 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘోరమైన దాడి.
2013 దర్భా లోయ దాడి: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకున్న దాడి.
2017 సుక్మా దాడి: 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు.
2021 టెకల్గూడ-జగరగుండం దాడి: 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.

భద్రతా బలగాల్లో హిడ్మా ఫోబియా :

CRPF, COBRA, DRG వంటి ఫోర్సులలో హిడ్మా పేరు అంటే ఒక సైలెంట్ ఫోబియా లాంటిది. అడవిలో ఆపరేషన్‌కు వెళ్లే ప్రతి జవాన్ మనసులో ఒక తెలియని భయం ఉంటుంది. ఏ చెట్ల వెనక అతడి మనుషులు దాగి ఉన్నారో, ఏ దారిలో పేలుడు పదార్థం ఉందో చెప్పలేని భయం. భద్రతా బలగాల్లో చాలామంది ‘అడవి అంటే భయం కాదు… అడవిలోని నిశ్శబ్దమే భయం. ఎందుకంటే ఆ నిశ్శబ్దం వెనుక హిడ్మా దాడి దాగి ఉండొచ్చు.’ అనే చెబుతారు.

హిడ్మా అనేది ఒక మనిషా? లేక కోడ్ పేరా?:

అతడు నిజంగా ఒక మనిషి పేరేనా? లేక ‘హిడ్మా’ అనేది ఒక పెద్ద మావోయిస్టు ఆపరేషన్ టీమ్‌కి పెట్టిన కోడ్ పేరా అన్న అనుమానం చాలా కాలంగా ఉంది. ఎందుకంటే అతడి గురించి ఉన్న సమాచారం అతి తక్కువ.. అతడి ఫోటోలు అస్పష్టంగా ఉన్నాయి.. అతడి కదలికలు పూర్తిగా ఊహకందని. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం హిడ్మా అనే వ్యక్తి ఒక మనిషి కాకపోవచ్చు. ఆ వ్యక్తిత్వం ఒక ప్రణాళిక, ఒక శైలి, ఒక అడవి గెరిల్లా సిస్టమ్ కూడా కావచ్చు. అదే అయితే, అతడిని పట్టుకోవడం అంటే..ఒక్క మనిషిని కాదు, ఒక ఆలోచనను, ఒక వ్యవస్థను ఆపడం. కానీ అది ఒక వ్యక్తి పేరే అని నిర్ధారించుకుని భద్రతాబలగాలు వేట మొదలుపెట్టాయి.

చివరికి మారేడుమిల్లి అడవుల్లో ముగిసిన హిడ్మా జీవితం :

ఈ కథలో అత్యంత వ్యంగ్యమైన విషయమేమంటే.. అతని చేతుల్లో వందలాది మంది భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయినా, పలుచోట్ల గ్రామస్తులకు మాత్రం అతను న్యాయం చెప్పే పెద్ద, సమస్యలు పరిష్కరించే నాయకుడిలా కనిపించేవాడు. ఒకే వ్యక్తి… రెండు పూర్తిగా భిన్న రూపాలు. ఇదే హిడ్మాను మరింత ప్రమాదకరుడిని చేసింది.

కానీ ఎంత పెద్ద నీడయినా ఒకరోజు తొలగిపోతుంది. నవంబర్ 18, 2025 ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి దట్టమైన అడవులు ఒక్కసారిగా తుపాకీ గోలలతో మోగాయి. రాష్ట్ర గ్రేహౌండ్స్, ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సంయుక్త దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. గంటల పాటు సాగిన కాల్పుల్లో చివరకు దేశ భద్రతా సంస్థలు సంవత్సరాలుగా వెంబడించిన లక్ష్యం నేలకొరిగింది. అధికారులు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు కమాండర్ మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని భార్య సహా పలు కీలక మావోయిస్టు సభ్యులు కూడా అక్కడే మృతి చెందారు.

ఆ వార్త దేశమంతటా ఒకే షాక్‌ వేవ్‌లా వ్యాపించింది. బస్తర్‌లో నక్సల్ ఉద్యమానికి ఇది ఒక మలుపు. హిడ్మా మరణంతో PLA నిర్మాణం, భూ రూట్ నెట్వర్క్, గ్రామాలపై ఉన్న ప్రభావం.. ఇవన్నీ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి. అయితే ఈ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు, లేదా మావోయిస్టు ఉద్యమం ఇదే బిందువులో నెమ్మదిగా కూలిపోతుందా లేక మరో మావో హిడ్మా స్థానాన్ని భర్తీ చేయనున్నారా అనే విషయాన్ని కాలమే నిర్ణయించాలి.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. బస్తర్ అడవుల్లో “నీడ”గా తిరిగిన హిడ్మా అధ్యాయం ముగిసింది. ఆ నీడ దశాబ్దాలుగా దేశాన్ని వెంబడించినప్పటికీ..వరకు ఆ నీడకూడా ఆ అడవుల్లోనే చీకటిగా కలిసిపోయింది.

ALSO READ: ఫేవరటిజం, పక్షపాతం, కార్పొరేట్‌ ఆఫీసుల్లో టాక్సిక్‌ వర్క్ కల్చర్..! పెద్దల అహంకారానికి హద్దే లేదా?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *