Menu

Gulf War: ఆ 6 దేశాల్లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? గల్ఫ్‌ దేశాలను వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ వార్..!

Praja Dhwani Desk 3 months ago
Six Gulf autocracies, one war: What data says about a region with no room for dissent

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు ప్రాంతీయ శక్తిసమీకరణాలను కదిలించాయి. కానీ ఈ పరిణామంపై పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న దేశాల ప్రభుత్వాలు దాదాపు మౌనంగా ఉన్నాయి. ఈ మౌనం కోఇన్సిడెన్స్ కాదు. ఆ ప్రాంతపు రాజకీయ వ్యవస్థల స్వభావం దీనికి కారణం.

పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న 8 దేశాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. వాటిలో ఆరు దేశాలు పూర్తిగా నియంత్రిత రాజకీయ వ్యవస్థలతో నడిచే ఆటోక్రసీలు. మిగిలిన రెండు దేశాలు ఇరాక్‌, ఇరాన్‌. అక్కడ ఎన్నికలు నిర్వహించినా అవి ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగవు. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో కొన్ని ఇక్కడే ఉన్నా, రాజకీయ స్వేచ్ఛ మాత్రం అక్కడ చాలా తక్కువ.

ఇంతకీ ఇంత సంపద ఉన్న ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఎందుకు కనిపించదు? ఆరు గల్ఫ్ రాజ్యాలు ఎలా నియంత్రిత రాజకీయ వ్యవస్థలుగా మారాయి. ఇరాన్‌, ఇరాక్‌ ఎందుకు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యాలుగా మారలేకపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే గల్ఫ్ ప్రాంతపు రాజకీయ నిర్మాణాన్ని ముందుగా అర్థంచేసుకోవాలి.

పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న దేశాలను చూస్తే ఒక విషయం వెంటనే అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో ఐదు దేశాలు ప్రత్యక్ష రాజ్యపాలనలో ఉన్న మోనార్కీలు. సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్ పూర్తిగా అబ్సల్యూట్ మోనార్కీలు. అక్కడ రాజు లేదా పాలక కుటుంబం చేతుల్లోనే శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలు ఉంటాయి. ఎన్నికలు అనే వ్యవస్థ అక్కడ అసలు ఉండదు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఏడు వారసత్వ ఎమిరేట్ల సమాఖ్య. అక్కడ ఉన్న ఫెడరల్ నేషనల్ కౌన్సిల్‌లో కొంతమంది ఎన్నికైన సభ్యులు ఉన్నప్పటికీ అసలు చట్టాలు చేయడానికి వారికి అధికారమే ఉండదు. చివరికి నిర్ణయం పాలక కుటుంబాలదే. కువైట్, బహ్రెయిన్ దేశాల్లో రాజ్యాంగ వ్యవస్థ ఉన్నప్పటికీ అక్కడి పార్లమెంట్లకు పరిమిత అధికారాలే ఉన్నాయి.

కువైట్‌లో ఎన్నికైన నేషనల్ అసెంబ్లీ ఉన్నా 2024లో దాన్ని రద్దు చేశారు. అంటే ఎన్నికల వ్యవస్థ ఉన్నట్టే కనిపించినా అసలు అధికార సమీకరణ మాత్రం రాజ కుటుంబాల చేతుల్లోనే ఉంటుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్య స్థాయిని కొలిచే ప్రముఖ అధ్యయనం వీడెమ్ డేటాను పరిశీలిస్తే ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పాలిఆర్కీ ఇండెక్స్ అనే స్కేల్‌లో 0 అంటే పూర్తిగా నియంత్రిత పాలన, 1 అంటే సంపూర్ణ ప్రజాస్వామ్యం. 2024 డేటా ప్రకారం సౌదీ అరేబియా స్కోర్ కేవలం 0.02. ఖతర్ 0.09. యుఏఈ 0.10. బహ్రెయిన్ 0.12. రెండు దశాబ్దాలుగా ఈ స్కోర్లు దాదాపు మారలేదు. అంటే ఈ దేశాల్లో రాజకీయ స్వేచ్ఛ స్థాయి చాలా కాలంగా స్థిరంగా కంట్రోల్‌గా ఉంది.

ఇరాన్ పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది కానీ అసలు నిర్మాణం మాత్రం అదే తరహాలో ఉంటుంది. అక్కడ అధ్యక్షుడు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఆ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో చివరికి నిర్ణయించే అధికారం సుప్రీం లీడర్‌కు అనుకూలంగా ఉన్న వ్యవస్థల చేతుల్లో ఉంటుంది. గార్డియన్ కౌన్సిల్ అనే సంస్థ అనేక అభ్యర్థులను ముందే అనర్హులుగా ప్రకటిస్తుంది. దీనికారణంగా ఎన్నికలు జరిగినా నిజమైన రాజకీయ పోటీ జరగదు. వీడెమ్ ఇండెక్స్ ప్రకారం ఇరాన్ స్కోర్ కేవలం 0.17 మాత్రమే. దీన్ని ఎలక్టోరల్ ఆటోక్రసీగా వర్గీకరించారు. ఇరాక్ మాత్రం ఈ ప్రాంతంలో కొంత భిన్నమైన ఉదాహరణ. అక్కడ ఎన్నికైన పార్లమెంట్ ఉంది. రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా ఉంటుంది. అయినప్పటికీ దేశంలో మిలీషియా గుంపులు, విదేశీ ప్రభావం, రాజకీయ అస్థిరతలు వ్యవస్థను బలహీనంగా మార్చాయి. అందుకే ఇరాక్ స్కోర్ 0.35 వద్దే నిలిచిపోయింది.

అది కూడా పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం సంపద, ప్రజాస్వామ్యం మధ్య ఉన్న విరుద్ధ సంబంధం. ఖతర్ ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. వ్యక్తి ప్రాతిపదికన జీడీపీ 80 వేల డాలర్లకు పైగా ఉంటుంది. కానీ రాజకీయ స్వేచ్ఛ స్కోర్ మాత్రం 0.09 మాత్రమే.

యుఏఈలో జీడీపీ వ్యక్తికి దాదాపు 50 వేల డాలర్లు. అయినప్పటికీ ప్రజాస్వామ్య సూచిక చాలా తక్కువ. అదే సమయంలో ఇరాక్, ఇరాన్ లాంటి దేశాల్లో ఆదాయం తక్కువ అయినప్పటికీ ఎన్నికల వ్యవస్థ మాత్రం కొంతవరకు ఉంది. పర్షియన్ గల్ఫ్ రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి రాజకీయ శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. దాన్ని ఆథారిటేరియన్ బార్గెన్ అంటారు. ఈ ఒప్పందంలో ప్రభుత్వాలు ప్రజలకు ఆర్థిక స్థిరత్వం, ఉపాధి, భద్రత అందిస్తాయి. అందుకే అక్కడ ప్రజలు రాజకీయ హక్కులు లేకపోయినా పెద్దగా ప్రశ్నించరు.

దశాబ్దాలుగా ఈ సమీకరణ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్‌లో నాయకత్వ మార్పు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఈ సమీకరణాన్ని పరీక్షించే పరిస్థితిని తీసుకొచ్చాయి. ముఖ్యంగా షియా జనాభా ఎక్కువగా ఉన్న బహ్రెయిన్, సౌదీ అరేబియా తూర్పు ప్రాంతాల్లో ఈ పరిణామాలు ఎలా ప్రభావం చూపుతాయన్నది ఆ దేశాల పాలక వర్గాలను ఆలోచించేలా చేస్తోంది.

మొత్తానికి పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచానికి ఒక విభిన్న రాజకీయ నమూనాను చూపిస్తోంది. సంపద ఉంది, వ్యూహాత్మక శక్తి ఉంది, కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం పెద్దగా స్థానం లేదు. ఖమేనీ మరణం తర్వాత ఈ వ్యవస్థల్లో మార్పు వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం గమనిస్తున్న పెద్ద అంశం.

ALSO READ: యుద్ధ సమయంలో పెట్టుబడి పెట్టకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారు?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *