సరిహద్దు అనేది ఏదో సాధారణ గీత కాదు. అక్కడ జీవితం ఉంటుంది. పంట పొలాలు, నీటి బావులు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నేల మీద నీరు కాదు విషం పడుతోంది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న బ్లూ లైన్ వద్ద మనుషులు మళ్లీ భయంతో జీవించాల్సిన దుస్థితి దాపరించింది.
కంటికి కనిపించని రసాయనం సరిహద్దు భూమిని చంపుతోంది. పంటలు మొలకెత్తకుండా చేస్తోంది. ఇలా జీవనాధారాన్ని నెమ్మదిగా ఖాళీ చేస్తోన్న ఈ ఘోరాన్ని చూసి ప్రపంచం మౌనం వహిస్తోంది. యుద్ధం పేరుతో సాగుతున్న ఈ చర్యలు తరతరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఈ పరిణామాన్ని తీవ్ర మానవతా ప్రమాదంగా ప్రకటించింది. ఇంతకి ఒక సరిహద్దు వెంట నడుస్తున్న ఈ విషపు మబ్బు ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాన్ని ఎలా చీకట్లోకి నెడుతోంది?
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకారం ఇది సాధారణ పర్యావరణ సమస్య కాదు. ఇది నేరుగా పౌరుల జీవన హక్కును ప్రభావితం చేసే అంశం.
లెబనాన్ అధికారులు సేకరించిన నమూనాల ప్రకారం సరిహద్దు ప్రాంతంలో పిచికారీ చేసిన పదార్థాన్ని హెర్బిసైడ్ గ్లైఫోసేట్‌గా గుర్తించారు. ఆ రసాయన స్థాయి సిఫార్సు చేసిన మోతాదుకంటే 20 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇది కలుపు మొక్కలను మాత్రమే చంపే స్థాయిలో కాదు. నేల స్వభావాన్ని మార్చేంత తీవ్రంగా ఉందన్న మాట.
ఈ రసాయన ప్రభావం వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో పంట భూములను పూర్తిగా నాశనం చేస్తుంది. మట్టిలోని సూక్ష్మజీవులను చంపేస్తుంది. నీటి వనరుల్లోకి చేరి తాగునీటిని కలుషితం చేస్తుంది. ఒకసారి ఇలా భూమి పాడైతే మళ్లీ సాగుకు రావడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు రావాలంటే భయపడుతున్నారు. ఇళ్లు ఉన్నా భూమి లేకపోతే జీవితం నిలబడదు. ఇదే అసలు మానవతా సంక్షోభం.
బ్లూ లైన్ అనేది లెబనాన్ – ఇజ్రాయెల్ మధ్య ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉపసంహరణ రేఖ. ఈ రేఖకు ఉత్తరంగా జరిగే ఏ సైనిక చర్య అయినా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701కు విరుద్ధమని UN స్పష్టం చేస్తోంది. రసాయనాల పిచికారీ కూడా ఆ పరిధిలోనే వస్తుందని మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జీవన వనరులను ధ్వంసం చేస్తోంది. ఈ పరిస్థితి ఒక్క లెబనాన్ సరిహద్దుతోనే ఆగడం లేదు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 2025 ఇక్కడ వేలాది పాలస్తీనియన్లు బలవంతంగా తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. జెనిన్, టుల్కరెం, నూర్ షామ్స్ లాంటి శరణార్థ శిబిరాల నుంచి 32వేల మందికి పైగా ప్రజలు వెళ్లిపోయారు.
ఇక తూర్పు జెరూసలేం పరిసరాల్లో పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్లు జరిగాయి. షుఫాత్ శరణార్థ శిబిరంలో ఇళ్లు, దుకాణాలను తనిఖీ చేయగా… పలువురు నిర్బంధానికి గురయ్యారు. మరోవైపు కఫ్ర్ అకబ్, ఖలాందియా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్ నిర్మాణాలను కూల్చివేశారు. ఇవన్నీ భవిష్యత్తు కాలనీల విస్తరణకు మార్గం వేస్తున్న చర్యలుగా UN మానవ హక్కుల కార్యాలయం హెచ్చరిస్తోంది.
ఒక్క డిసెంబరులో మాత్రమే 3వేలకుపైగా కొత్త సెటిల్‌మెంట్ యూనిట్ల నిర్మాణానికి టెండర్లు కోరినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇది తూర్పు జెరూసలేం, రామల్లా, బెత్లహెమ్ మధ్య ఉన్న పాలస్తీనియన్ ప్రాంతాలను విడదీసే ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ విభజన జరిగితే భవిష్యత్తులో స్వతంత్ర పాలస్తీనియన్ రాష్ట్రం సాధ్యమేనా అనే ప్రశ్నను నిపుణులు లేవనెత్తుతున్నారు. ఇక ఈ మొత్తం అంశాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం భద్రతా చర్యల సమస్య కాదు.
ఇది భూమి, నీరు, నివాసం, జీవనాధారంపై జరుగుతున్న దాడి. బుల్లెట్లు ఆగినా రసాయనాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇళ్లు కూలినా భయం మిగులుతుంది. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే. ఈ చర్యలు ఆగకపోతే ఇది తాత్కాలిక సంక్షోభంగా కాదు. తరతరాల మానవ హక్కుల విషాదంగా మిగిలిపోవడం ఖాయం!
ALSO READ: ఎప్‌స్టీన్ ఎవరు? ప్రపంచంలోని బడాబాబులు ఎందుకు వణికిపోతున్నారు?

Hostel Cylinder Crisis: సిలిండర్ షార్టెజ్..! మూతపడుతున్న హాస్టల్స్.. టెన్షన్లో స్టూడెంట్స్..!
Gulf War: ఆ 6 దేశాల్లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ వార్..!
నెతన్యాహు UN ప్రసంగానికి దేశాల ప్రతినిధులు నిరసనగా వాకౌట్
అమెరికా ద్వంద్వ నీతి: ఇజ్రాయెల్‌కు వేల కోట్లు, భారత్‌పై ఆంక్షలు… లెక్కలేమి చెబుతున్నాయి?
Gaza Famine: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ
Gaza Hunger Crisis: నాలో ఇంకిపోయిన సముద్రాలు.. చితా భస్మమైన ఆకాశాలు.. గాజా గాయబ్!