ఇండియా మండిపోతోంది…సలసలా కాలిపోతోంది.. మనిషి తట్టుకోలేని స్థాయికి వేడి చేరుకుంటోంది. కాలుతున్న ఓవెన్‌లోంచి వస్తున్న వేడి ఆవిరిలా అనిపించే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బాండా పట్టణంలో థర్మామీటర్ ఒక్కసారిగా 47.6 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆగిపోయింది. అది కూడా వరుసగా రెండో రోజు ఈ స్థాయిలో నమోదైంది. ఢిల్లీలో 44 డిగ్రీలు, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లలో 43 డిగ్రీలు… జైపూర్, లక్నోల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై లాంటి దక్షిణ నగరాలు కూడా 40కు దగ్గరలోనే కాలిపోతుండగా… ముంబైలో తేమతో కూడిన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే అసలు భయం పగటి వేడి కాదు… రాత్రిపూట కూడా భూమి చల్లబడకపోవడమే అసలు సమస్య.
✨ Quick Read
- ఉత్తర భారతంలో 47.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
- ఎల్‌నినో, క్లైమేట్ చేంజ్‌తో వేడి తీవ్రత మరింత పెరిగింది
- హీట్‌వేవ్‌తో నీటి, విద్యుత్, ఆరోగ్య సంక్షోభ హెచ్చరికలు
AI-assisted summary, newsroom reviewed
కాలిపోతోన్న ఉపఖండం:
సాధారణంగా సాయంత్రం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గాలి. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్ వరకూ అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే… మనిషి శరీరం లోలోపలే నెమ్మదిగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. నిజానికి ఏప్రిల్, మే నెలల్లో సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయి. రాజస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాల్లో లో-ప్రెజర్ హీట్ జోన్లు ఏర్పడతాయి. పొడి గాలులు వీచడం వల్ల సాధారణంగా వేడి పెరుగుతుంది. కానీ ఈసారి కనిపిస్తున్న తీవ్రత మాత్రం సాధారణం కాదు. ఉపగ్రహ చిత్రాల్లో భారత ఉపఖండం మొత్తం మంటల్లో కాలిపోతున్న నారింజ, గోధుమ రంగుల మ్యాప్‌లా కనిపిస్తోంది.
మానవ తప్పిదమేనా?
ఈ భయంకర వేడికి కారణాల్లో మొదటిది మనమే నిర్మించుకున్న నగరాలు. దీన్నే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఒకప్పుడు చెట్లు, నేల, పచ్చదనం ఉన్న ప్రదేశాల్లో ఇప్పుడు కాంక్రీట్ అడవులు పెరిగిపోయాయి. గ్లాసు బిల్గింగులు, సిమెంట్ రోడ్లు, ఇనుప నిర్మాణాలు సూర్యుడి వేడిని పీల్చుకుని రాత్రివరకు దాచుకుంటాయి. అందుకే నగరాల్లో చుట్టుపక్కల గ్రామాల కంటే 10 డిగ్రీల వరకూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకో కారణం… ఈసారి సాధారణానికి తగ్గ ప్రీ-మాన్సూన్ వర్షాలు. ఆకాశం పూర్తిగా క్లియర్‌గా ఉండటం వల్ల సూర్యకాంతి నేరుగా భూమిని తాకుతోంది. సముద్రాల నుంచి లోపలికి రావాల్సిన చల్లని గాలులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వాతావరణ చలనం స్తంభించిపోవడంతో వేడి గాలులు ఒకే ప్రాంతంలో చిక్కుకుపోతున్నాయి. కానీ వీటికంటే ప్రమాదకరమైన బ్యాగ్రౌండ్ పవర్ ఇంకోటి ఉంది. అదే క్లైమేట్ చేంజ్.. మనుషులు వదులుతున్న గ్రీన్‌హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక కనిపించని వేడి దుప్పటిలా మారిపోయాయి.
భారత్‌లో ఈసారి హీట్‌వేవ్ ఎందుకు తీవ్రంగా మారింది?
క్లైమేట్ చేంజ్, ఎల్‌నినో ప్రభావం, తగ్గిన ప్రీ-మాన్సూన్ వర్షాలు, నగరాల్లో పెరిగిన కాంక్రీట్ నిర్మాణాలు కలిసి ఈసారి హీట్‌వేవ్‌ను మరింత ప్రమాదకరంగా మార్చాయి.
ఎల్‌నినో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు మాన్సూన్ బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వర్షాలు తగ్గి నీటి కొరత, పంట నష్టం, విద్యుత్ సంక్షోభం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
కార్లు, ఫ్యాక్టరీలు, బొగ్గు విద్యుత్ కేంద్రాలు విడుదల చేస్తున్న కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన వేడిని తిరిగి లోపలే బంధిస్తున్నాయి. ప్రతి వేసవి గత వేసవికంటే ఇంకా భయంకరంగా మారుతోంది. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతున్న పేరు ఒక్కటే…ఎల్‌నినో.
ఎల్‌నినో అంటే ఏంటి?
మహాసముద్రం మధ్య భాగంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగితే దాన్ని ఎల్‌నినో అంటారు. స్పానిష్ భాషలో దాని అర్థం లిటిల్ బాయ్. దీనికి వ్యతిరేక పరిస్థితిని లా-నినా అంటారు. అంటే లిటిల్ గర్ల్. ఈ రెండు ప్రకృతి చక్రాలు ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ ఎల్‌నినో వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేడి తీవ్రత పెరుగుతుంది. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం… మే నుంచి ఆగస్టు మధ్య 62 నుంచి 80 శాతం అవకాశాలతో ఎల్‌నినో పరిస్థితులు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. గతేడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైంది. దానికి ప్రధాన కారణాల్లో ఒకటి కూడా ఇదే ఎల్‌నినో. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడుతున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ ఎల్‌నినో భారత్‌కు మరొక పెద్ద ప్రమాదాన్ని తీసుకురావచ్చు. అదే బలహీనమైన రుతుపవనాలు.. సాధారణంగా భారత్‌కి వర్షాలు తీసుకొచ్చే మాన్సూన్ గాలులు పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడతాయి.
పవర్ గ్రిడ్లపై ఒత్తిడి:
ఎల్‌నినో సమయంలో వేడి నీళ్లు తూర్పు దిశగా కదిలిపోవడంతో ఆసియా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోతుంది. ఇప్పటికే ఐఎండీ 2026 నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే కేవలం 92 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే ప్రమాదం కేవలం వేడి మాత్రమే కాదని అర్థమవుతుంది.
నీటి కొరత, పంటల నష్టం, విద్యుత్ సంక్షోభం, ఆరోగ్య విపత్తు అన్నీ కలిసి రావచ్చు. ఇప్పటికే ఆస్పత్రుల్లో హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 ఫారన్‌హీట్ దాటితే మెదడు, గుండె, కిడ్నీలు పనిచేయడం ఆపేస్తాయి. బయట పని చేసే కార్మికులు, రైతులు, ట్రాఫిక్ పోలీస్‌లు, చిన్న పిల్లలు, వృద్ధులు అత్యంత ప్రమాదంలో ఉన్న వర్గాలుగా మారుతున్నారు. విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఒకేసారి నడవడంతో పవర్ గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతోంది. గ్రామాల్లో పశువులు వేడిని తట్టుకోలేక కుప్పకూలుతున్నాయి. నేలలో తేమ ఆవిరైపోవడంతో పంటలు కాలిపోతున్నాయి.
ప్రస్తుతం అందరి చూపు ఒక్కటిపైనే ఉంది… పశ్చిమ అలజడులు ఎప్పుడు వస్తాయి? మాన్సూన్ ఎప్పుడు దూసుకొస్తుంది? ఎక్కడైనా భారీ ఉరుములు, వర్షాలు ఏర్పడి ఈ వేడి గోడను పగలగొడతాయా? అంతవరకు మాత్రం ఇండియా ఒక నెమ్మదిగా మరిగిపోతున్న భూమిలా మారుతోంది. బయటకు కనిపించేది కేవలం ఎండ మాత్రమే.. కానీ ఆ ఎండ వెనుక దాగి ఉన్నది. భవిష్యత్తులో మరింత భయంకరమైన వాతావరణ యుగానికి సంకేతం.

Ebola outbreak: ఎబోలా వ్యాప్తికి కారణమైన అమెరికా? ట్రంప్ నిధుల కోతతో మరణాల మోత
Karnataka Politics: సీఎం పదవి నుంచి దిగిపోయిన సిద్ధరామయ్య.. దీని వెనుక ఉన్న కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
Petrol Price Hike:10 రోజుల్లో నాలుగో సారి పేలిన బాం*బు..కోట్లాది భారతీయులపై ధరల పిడుగు!
Cockroach Janata Party: కాక్రోచ్‌లతో పాటు పెంటపురుగులు కూడా ఏకం కావాల్సిందే! మీ బయాలజీ క్లాసులు తగలయ్యా..!
IRAN VS AMERICA: గోడకేసి కొట్టిన బంతిలా లేచిన ఇరాన్.. మరోసారి వార్‌కు రెడీ!
Gulf War: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!