Menu

CJP: బీజేపీ, కాంగ్రెస్‌లను దాటేసింది..! కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బ మాములుగా లేదు భయ్యా

Lakshmi Aruna 3 weeks ago
what is cockroach janata party in india

ఒక మీమ్… ఒక సెటైర్… ఒక సరదా కామెంట్… ఇవన్నీ కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఇప్పుడు కామన్. కానీ అదే ట్రెండ్ ఒక రాజకీయ ఉద్యమంగా మారితే…? అదే ఇప్పుడు దేశంలో జరుగుతోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న పేరు “కాక్రోచ్ జనతా పార్టీ”. మొదట ఇది ఒక వ్యంగ్య పేజ్‌లా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇది దేశ రాజకీయ వ్యవస్థపై యువత అసహనానికి ప్రతీకగా మారిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పార్టీ సృష్టించిన రికార్డులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక ఖాతాలకు ఉన్న ఫాలోవర్లను కేవలం ఐదు రోజుల్లోనే దాటేసి డిజిటల్ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపింది.

✨ Quick Read

  • 5 రోజుల్లో BJP, కాంగ్రెస్‌ ఫాలోవర్లకు షాక్
  • CJP X అకౌంట్‌ భారత్‌లో బ్లాక్
  • మీమ్స్‌ నుంచి డిజిటల్ ఉద్యమంగా మారిన CJP

AI-assisted summary, newsroom reviewed

ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తోంది. ఇటీవల నిరుద్యోగ యువతపై “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలను యువత తమపై జరిగిన అవమానంగా భావించింది. మొదట మీమ్స్ రూపంలో రియాక్షన్ ఇచ్చిన నెటిజన్లు… తర్వాత అదే భావోద్వేగాన్ని ఉద్యమంగా మార్చేశారు. అలా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. “మీరు మమ్మల్ని బొద్దింకలంటారా…? అయితే మేమే ఆ బొద్దింకలం” అన్నట్లుగా వ్యంగ్యంతోనే కౌంటర్ ఇచ్చారు యువత. ఇదే ఈ పార్టీకి భారీ పాపులారిటీ తీసుకొచ్చింది.

ఇది కేవలం ట్రోలింగ్ పేజ్ మాత్రమే కాదు. ఆశ్చర్యకరంగా ఒక రాజకీయ పార్టీలా మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. రిటైర్డ్ జడ్జీలకు రాజ్యసభ పదవులు ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. పెద్ద కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ఉన్న మీడియా వ్యవస్థను విమర్శిస్తూ స్వతంత్ర మీడియాకు మద్దతు ప్రకటించింది. బయటికి సెటైర్‌లా కనిపించినా… లోపల మాత్రం యువతలో పేరుకుపోయిన నిరాశ, అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.

కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల సంఘంలో నమోదైన అధికారిక రాజకీయ పార్టీ కాదు. ఇది సోషల్ మీడియాలో యువత అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న డిజిటల్ ఉద్యమంగా కొనసాగుతోంది.

CJP అకౌంట్‌ను ఎందుకు withheld చేశారు?

ఎక్స్‌ (Twitter) వేదికపై CJP ఖాతా భారత్‌లో కనిపించకుండా నిలిపివేయబడింది. అయితే దీనిపై అధికారిక కారణాలను ఎక్స్‌ సంస్థ పూర్తిగా వెల్లడించలేదు.

దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న నిరుద్యోగం కూడా ఈ డిజిటల్ ఉద్యమానికి ప్రధాన కారణంగా మారింది. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేస్తున్నా… వారికి సరిపడా ఉద్యోగాలు దొరకడం లేదు. ముఖ్యంగా 25 నుంచి 29 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఐటీ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో యువత భవిష్యత్తుపై భయంతో జీవిస్తోంది. ఇదే సమయంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, జీవన వ్యయం, అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం యువతలో మరింత అసహనాన్ని పెంచుతున్నాయి.

ఇప్పుడు నిరసనలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే కొత్త యుద్ధరంగంగా మారింది. మీమ్స్, వైరల్ రీల్స్, సెటైరికల్ పోస్టులతో యువత తమ కోపాన్ని వ్యక్తం చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే డిజిటల్ నిరసనకు ప్రతీకగా మారింది. ఈ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేసినా… వెంటనే మరో కొత్త ఖాతా తెరిచి మళ్లీ ప్రచారం ప్రారంభించింది. అంటే ఈ ఉద్యమాన్ని ఆపడం అంత ఈజీ కాదని స్పష్టమవుతోంది.

రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే… ఇది కేవలం సరదా ట్రెండ్ కాదు. దేశంలో యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ఒక డిజిటల్ రూపం. ఉద్యోగాలు లేకపోవడం, భవిష్యత్తుపై భయం, రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గిపోవడం… ఇవన్నీ కలిసి కొత్త తరహా రాజకీయ భావజాలానికి దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు ఇప్పటికే ప్రభావం చూపించాయి. ఇప్పుడు భారత్‌లో కూడా అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌గా మిగిలిపోతుందా…? లేక నిజంగానే యువత రాజకీయ ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందా…? ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఈ డిజిటల్ ఉద్యమం వెనక దాగి ఉన్న యువత కోపాన్ని రాజకీయాలు ఇకపై అంత తేలికగా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ALSO READ: 90s కిడ్‌ మొదలుపెట్టిన ‘కాక్‌రోచ్‌’ ఉద్యమం..జెన్‌-Z మద్దతుతో ప్రభుత్వాలను ఎలా వణికిస్తోంది?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *