రాజకీయ కంపు తగిలితే నిర్ణయాలు కూడా ఊసరవెల్లి లాగే రంగును మార్చుకుంటాయి. కులాల గాలి వీచితే జాబితాలు కూడా దారి తప్పుతాయి. పార్టీల నీడ పడితే గుర్తింపులు కూడా మసకబారతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కళారత్న హంస అవార్డు జాబితాలో జర్నలిస్ట్ సతీశ్ చందర్ పేరు చేర్చి, రాత్రికి రాత్రే అదే పేరును తీసేయడం ఒక సాధారణ మార్పు కాదు.. ఇది ప్రభుత్వ వ్యవస్థల్లో నాటుకుపోయిన కుళ్లుతనానికి పరాకాష్ట!
సతీశ్ చందర్ ఒక వ్యక్తి కాదు ఒక విధానం. ఎవరి ముందూ తలవంచని స్వరం. ఎవ్వరినీ వదిలిపెట్టని ప్రశ్న. ఎన్టీఆర్ దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు, అధికారంలో ఎవరు ఉన్నా తప్పు కనిపిస్తే అదే దృఢత్వంతో ఎదురుపడ్డ కలం. పార్టీ రంగులను చెరిపేసి, కుల గీతలను దాటేసి, మత గోడలను బద్దల కొట్టి కేవలం నిజం ముందు నిలబడిన ధైర్యం. ఏ వైపు నిలబడాలో కాదు, ఏది నిజమో అదే చెప్పాలనే ధోరణి. అందుకే ఆయన ఏ ఒక్కరికి చెందినవాడు కాదు. అందరికి చెందినవాడు.
32 పుస్తకాలు రాసిన రచయితగా ఆయన ప్రయాణాన్ని కేవలం సంఖ్యలో కోలవలేము.. అది ఒక నిరంతర పోరాటం. ప్రతి పుస్తకం ఒక ప్రశ్నలా నిలబడింది, ప్రతి వ్యాసం సమాజానికి ఒక అద్దంలా పనిచేసింది. అధికారానికి నచ్చేలా రాయడం ఆయనకు చేతకాదు, సమాజానికి అవసరమైనదే రాయడమే తెలుసు. ప్రజలు వినాలనుకునేదాన్ని కాదు, వినాల్సినదాన్ని చెప్పాలనే బాధ్యత ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన రాతల్లో నేరుగా గుండెల్లో గుచ్చుకునే నిజమే ఉంటుంది.
ఆయన స్థాపించిన ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం(AP College of Journalism) కూడా అదే ఆలోచనకు విస్తరణ. అక్కడ అక్షరాలను మాత్రమే కాదు వాటి లోతులో దాగి ఉన్న అర్థాలను నేర్పిస్తారు. వార్త ఎలా రాయాలో కాదు, వార్త వెనక మనిషిని ఎలా చూడాలో చూపిస్తారు. కేవలం స్పెల్లింగులు, భాష చుట్టూ తిరిగే ఇతర జర్నలిజం స్కూల్స్‌లా కాదు. చాలా జర్నలిజం కాలేజీలు భాషను బోధిస్తాయి కానీ భావాన్ని మరిచిపోతాయి. వాక్యాన్ని మెరుగుపరుస్తాయి కానీ విలువను పెంచలేవు. కానీ ఇక్కడ మాత్రం విలువలే పాఠ్యాంశం. నిజం చెప్పే ధైర్యం, మానవీయ కోణం, ధైర్యంగా రాయగలిగే శక్తి.. ఇవే ప్రధాన పాఠాలు. అందుకే అక్కడి నుంచి వచ్చిన వాళ్లు ఉద్యోగం కోసం మాత్రమే రారు.. ఒక బాధ్యతతో బయటకు వస్తారు. అదే బాధ్యతతో పనిచేస్తారు.
ప్రజల జీవితాల మీద ప్రభావం చూపే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించడం ఆయన రచనల్లో సహజం. ప్రభుత్వాలను గుడ్డిగా నమ్మమని కాదు.. వారి నిర్ణయాల వెనుక ఉన్న కుట్రల గురించి ఆలోచించమని చెప్పే జర్నలిజం అంటే అధికారానికి ఎప్పుడూ ఇబ్బందే. ఎందుకంటే తార్కికంగా ఆలోచించే మనుషులను నియంత్రించడం అంత ఈజీ కాదు. ఇక అవార్డు అనే వ్యవస్థను ఎంత గొప్పగా చెప్పుకున్నా అది పుట్టింది శ్రమ నుంచి కాదు.. అధికారాన్ని కొలవడానికేనన్న అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎవరి చేతిలో అధికారం ఉందో, వారు ఎవరికీ ముద్ర వేయాలో నిర్ణయించే పద్ధతి అది. ప్రతిభకు ప్రమాణం అంటూ చెప్పినా, చివరికి అది దగ్గర సంబంధాల్ని, అనుకూల స్వరాల్ని, నచ్చిన దారుల్ని గుర్తించే వ్యవస్థగా మారిపోయింది. రంగనాయకమ్మ లాంటి రచయితలు కూడా ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. అవార్డు అనేది ప్రతిభను కొలిచే కొలమానం కాదని.. అది ఒక సామాజిక నిర్మాణంలో ఉన్న శక్తి సంబంధాల ప్రతిబింబమని చెబుతారు. అందుకే ఒక అవార్డు వచ్చిందని విలువ పెరగదు, రాలేదని తగ్గదు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత తీసేయడం మాత్రం గౌరవానికి సంబంధించిన అంశం.
శ్రమే విలువకు మూలం అని మార్క్స్ శతాబ్దాల క్రితమే చెప్పాడు. ఆలోచన కూడా సమాజానికి శ్రమే. ఆ శ్రమను గుర్తించని వ్యవస్థ చివరికి మౌనాన్ని పెంచుతుంది. ప్రశ్నించే వాళ్లను పక్కకు జరిపితే మిగిలేది ఒప్పుకునే వాళ్లే. అక్కడి నుంచి అసమానత బలపడుతుంది. అక్కడే ఆధిపత్యం పాతుకుపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. సామాజిక స్ప్రహ కలిగిన ఒక రచయితను ఇంతలా అవమానించడం నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటు.
ALSO READ: గణేశా.. చూస్తున్నావా? “G”old star .. “G”ole mall

ADR Report: భారీగా డబ్బులు కూడబెట్టిన టీడీపీ.. తీరిగ్గా నిధులు వదిలించుకున్న వైసీపీ.. ADR రిపోర్ట్ లెక్కలు చూస్తే అవ్వాక్కే!
Sudan Civil War: యుద్ధభూములుగా మారిన నగరాలు.. మానవతా సంక్షోభానికి దారితీసిన సూడాన్ సివిల్ వార్!
వార్తల్లో కులం పేరును ప్రస్తావిస్తే క్యాస్ట్ కార్డ్ వాడుకున్నట్టా? సనాతన వీరులు కచ్చితంగా ఇది తెలుసుకోండి!
Motherhood: ‘నా లైఫ్ నా చేతుల్లో లేదు..’ ఓ అమ్మ ఆవేదన!
AI Data centres: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. డేటా సెంటర్లతో ప్రపంచానికి ముప్పు!
Oracle’s layoffs Explained: 30వేల ఉద్యోగాలు ఊస్ట్.. దిగ్గజ కంపెనీ నిర్ణయంతో టెన్షన్లో ఐటి సెక్టర్!