Menu

Ebola outbreak: ఎబోలా వ్యాప్తికి కారణమైన అమెరికా? ట్రంప్‌ నిధుల కోతతో మరణాల మోత

Tri Ten B (Triya) 2 weeks ago
International aid cuts complicate Congo's Ebola epidemic explained

ఆఫ్రికా… ప్రపంచానికి బంగారం ఇచ్చింది. వజ్రాలు ఇచ్చింది. కోబాల్ట్ ఇచ్చింది. యురేనియం ఇచ్చింది. చమురు కూడా ఇచ్చింది. కానీ ప్రతిఫలంగా ఏం పొందింది? పేదరికం..! అవును..! యుద్ధాలు, ఆకలి, మహమ్మారులను పొందింది.

శతాబ్దాలుగా ప్రపంచ సంపదకు మూలంగా నిలిచిన ఖండం నేడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారడానికి ప్రకృతి కారణం కాదని చరిత్ర చెబుతోంది. నేడు ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తికి కూడా ప్రపంచ రాజకీయాలే కారణం. వలసవాదం మరో కారణం.. లాభాల కోసం దేశాలను పిండిపారేసిన శక్తుల ఇంకొక కారణం. ఇంతకీ ఎబోలా అవుట్‌బ్రేక్‌కి అగ్రదేశాల స్వార్థం ఎలా కారణమైంది? అసలు ఆఫ్రికాను ధనిక దేశాలు ఎలా మోసం చేశాయి?

✨ Quick Read

  • 220+ మరణాలు.. 900+ అనుమానిత కేసులు
  • వ్యాక్సిన్‌ లేని బుండిబుగ్యో స్ట్రెయిన్‌
  • నిధుల కోతలపై తీవ్ర విమర్శలు

AI-assisted summary, newsroom reviewed

స్వాతంత్ర్యం తర్వాత కూడా మారని దుస్థితి:

వందల ఏళ్ల క్రితం యూరోపియన్ వలసవాదులు ఆఫ్రికాను ముక్కలు ముక్కలగా నరికిపంచుకున్నారు. అక్కడి ప్రజలను బానిసలుగా మార్చారు. ఖనిజ సంపదను కొల్లగొట్టారు. స్థానిక వ్యవస్థలను ధ్వంసం చేశారు. వివిధ దేశాలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా మారలేదు. రూపం మాత్రమే మారింది. ప్రత్యక్ష పాలన స్థానంలో ఆర్థిక ఆధిపత్యం వచ్చింది. ఆఫ్రికా వనరులు ప్రపంచ మార్కెట్లకు ప్రవహించాయి. కానీ ఆస్పత్రులను నిర్మించలేదు. బలమైన ఆరోగ్య వ్యవస్థలు కూడా ఏర్పడలేదు.

ప్రపంచానికి సంపదను అందించిన ఖండం తన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి విదేశీ సహాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిలో పడిపోయింది. ఉదాహరణకు ఒకప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదకు నిలమైన కాంగోలో ఇప్పుడు ఎబోలా విజృంభిస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి కంటే ముందే అక్కడి ఆరోగ్య వ్యవస్థ చనిపోయింది. దీనికి కారణం నిధుల కోతలు..!

ఎబోలా వైరస్‌ ఎందుకు అంత ప్రమాదకరం?

ఎబోలా వైరస్‌ తీవ్రమైన జ్వరం, అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి కారణమవుతుంది. కొన్ని స్ట్రెయిన్‌లలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటిగా పరిగణిస్తారు.

బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్‌ ఇతర ఎబోలా వైరస్‌లతో ఎలా భిన్నం?

2007లో మొదట గుర్తించిన బుండిబుగ్యో స్ట్రెయిన్‌కు ఇప్పటికీ విస్తృతంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ లేదు. అందుకే వ్యాధి నిర్ధారణ, కాంటాక్ట్ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలే ప్రధాన రక్షణ మార్గాలుగా భావిస్తారు.

రాజకీయ నిర్లక్ష్యంతో పాటు లాభనష్టాల లెక్కలు వేసుకున్న అమెరికా ఆఫ్రికాకు నిధులు ఆపేసి అత్యంత దారుణమైన పాపానికి పూనుకుంది. 2026 మే 17న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చరిత్రలో ఇలా జరగడం ఇది తొమ్మిదోసారి మాత్రమే.

ఎబోలా కారణంగా ఎంతమంది చనిపోయారు?

అప్పటికే కాంగో, యుగాండా దేశాల్లో 900కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. 220 మందికి పైగా మరణించారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. గ్రౌండ్‌లెవల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని సమాచారం. ఆధునిక చరిత్రలో మూడో అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నేటి పరిస్థితులు నిలుస్తుండడం అత్యంత బాధాకరం. ఈసారి బుండిబుగ్యో అనే అరుదైన ఎబోలా స్ట్రెయిన్‌ మనుషులపై విరుచుకుపడుతోంది. 2007లో యుగాండాలో తొలిసారి గుర్తించిన ఈ స్ట్రెయిన్‌కు ఇప్పటికీ ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదు.. ఆఖరికి చికిత్స కూడా లేదు. ఈ స్ట్రెయిన్‌ బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోతారు. అయితే ఈసారి దుస్థితికి కేవలం స్ట్రెయిన్‌ స్వభావమే కారణం కాదు.. దాన్ని ముందే గుర్తించే వ్యవస్థలను బలహీనపరచడమే అసలు కారణం.

ఏప్రిల్ 24న తొలి అనుమానిత కేసు నమోదైంది. కానీ మే 15 వరకు వైరస్‌ను సరిగ్గా గుర్తించలేకపోయారు. దాదాపు మూడు వారాల పాటు ఎబోలా ప్రజల మధ్య తిరుగుతూనే ఉంది. ప్రారంభ పరీక్షలు ఒక రాంగ్‌ స్ట్రెయిన్‌ కోసం నిర్వహించడం కొంపముంచింది. అందుకే ఫలితాలు నెగెటివ్ వచ్చాయి.

వైరస్ మాత్రం గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకుంది. ఇటూరి, నార్త్ కివు, సౌత్ కివు ప్రాంతాల్లో పాతుకుపోయింది. తర్వాత గోమా నగరానికి చేరుకుంది. చివరకు యుగాండా రాజధాని కంపాలాలో కూడా కేసులు కనిపించాయి. ఒకవేళ ఆ మూడు వారాల ఆలస్యం జరగకపోయి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదేమో. ఎన్నో సంవత్సరాలుగా USAID ద్వారా కాంగోలో స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన సందర్భాలున్నాయి.

గ్రామాల్లో వ్యాధులను ముందుగానే గుర్తించే నిఘా వ్యవస్థలు ఉండేవి. ల్యాబ్‌లకు నిధులు వచ్చేవి. ఇటు అత్యవసర బృందాలు కూడా సిద్ధంగా ఉండేవి. కానీ తర్వాత ఈ కార్యక్రమాలను నిలిపివేశారు. భారీ కోతలు విధించారు. కాంగోకు అమెరికా అందించిన నిధులు ఒకే ఏడాదిలో దాదాపు 280 కోట్ల రూపాయల నుంచి 85 కోట్ల రూపాయలకు పడిపోయాయి. మొత్తం సహాయం సుమారు 10,200 కోట్ల రూపాయల నుంచి 5,900 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది.

దీని కారణంగా గత ఎబోలా విజృంభనను అడ్డుకున్న అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది ఇతర పనుల కోసం వెళ్లిపోయారు. ఇటూరిలోని ల్యాబ్ వద్ద బుండిబుగ్యో వైరస్‌ను పరీక్షించే సామర్థ్యం లేదు. నమూనాలను వెంటనే పంపించాల్సిన పరిస్థితి లేదు. తర్వాత కిన్షాసాకు చేరుకున్న నమూనాలు సరైన ఉష్ణోగ్రతలో లేవు. పరిమాణం కూడా తక్కువగా ఉంది. విశ్లేషణ మరింత ఆలస్యమైంది.

మహమ్మారి సమయంలో ప్రతి గంట విలువైనది. కానీ ఇక్కడ గంటలు వారాలుగా మారిపోయాయి. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ లాంటి సంస్థలు కూడా నిధుల కొరతతో తమ నిఘా కార్యక్రమాలను తగ్గించాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలను కుదించారు. ఆసుపత్రుల్లో గ్లౌజులు లేవు. మాస్కులు లేవు. రక్షణ దుస్తులు లేవు. వైద్యులు కూడా ప్రమాదంలో పడిపోయిన దయనీయ దుస్థితి దాపరించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రధాన లక్ష్యం ఆఫ్రికా ప్రజల ప్రాణాలను కాపాడడం కాదని, ఎబోలా అమెరికాలోకి ప్రవేశించకుండా చూడటమేనని ఆయన స్పష్టం చేశారు.

వందలాది మంది ఇప్పటికే మరణిస్తున్న సమయంలో మానవీయ విషాదం కంటే జాతీయ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలకు కారణమైంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే చివరికి అమెరికా అత్యవసర సహాయంగా దాదాపు 195 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

అంటే ముందుగా తొలగించిన నిధుల కంటే ఎక్కువ మొత్తాన్ని తరువాత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బుండిబుగ్యో వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది అందుబాటులోకి రావడానికి నెలల సమయం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌లో విలన్‌ ఎబోలా వైరస్ కాదు..దాని స్ట్రెయిన్‌ అంతకన్నా కాదు.. ముందే ప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థలను నిర్వీర్యం చేసిన నిర్లక్ష్యమే ఇక్కడ ప్రధాన విలన్. మానవ ప్రాణాల విలువను మర్చిపోయిన రాజకీయ నిర్ణయాలు ఆఫ్రికాతో ఇతర దేశాల కొంపకొల్లేరు చేశారు.

అందుకే మహమ్మారి వచ్చిన తర్వాత ఖర్చు చేసే వందల కోట్లు కంటే మహమ్మారి రాకముందే ఖర్చు చేసే కొన్ని కోట్లు ఎంతో విలువైనవి. ఆ పాఠాన్ని ప్రపంచం మరోసారి చాలా ఆలస్యంగా నేర్చుకుంటోంది. ఆ ఆలస్యానికి మూల్యం చెల్లిస్తున్నది మాత్రం పేద ఆఫ్రికా ప్రజలే.

ALSO READ: ఎబోలా డేంజర్ బెల్స్.. ఈ వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా…?


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *