Menu

Ebola Emergency Meeting: ఎబోలా డేంజర్ బెల్స్.. ఈ వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా…?

Praja Dhwani Desk 3 weeks ago
ebola virus explained

ఆఫ్రికా అడవుల్లో నిన్నమొన్నటివరకు కనిపించండా ఉండిపోయిన రాక్షసుడు మేల్కొని జనాలను చంపుతున్నాడా…? మనిషి శరీరాన్ని లోపల నుంచే కరిగించి… రక్తాన్నే ఆయుధంగా మార్చే ఆ వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తుందా…? కరోనా భయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచానికి ఇప్పుడు మరో అత్యవసర హెచ్చరిక వినిపిస్తోంది. ఒక్కో దేశం సరిహద్దులు మూసుకుంటోంది. ఆస్పత్రుల్లో వైద్యులు స్పేస్ సూట్‌లలా కనిపించే కిట్లతో పరుగులు తీస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వ్యాపిస్తున్న వైరస్ పేరు ఎబోలా..!

✨ Quick Read

  • కాంగోలో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో WHO అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 513 అనుమానిత కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి.
  • ప్రస్తుతం వ్యాపిస్తున్న “బుండిబుగ్యో స్ట్రెయిన్”కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ లేకపోవడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ మరణాల రేటు 50 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • ఎబోలా కరోనా లాగా గాలిలో వ్యాపించకపోయినా… రక్తం, శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో పలు దేశాలు ఇప్పటికే అప్రమత్త చర్యలు ప్రారంభించాయి.

AI-assisted summary, newsroom reviewed

ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించిన తాజా వివరాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదలైన ఎబోలా వ్యాప్తి క్షణక్షణానికి ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటివరకు 513 అనుమానిత కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పటికే 131 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ చెబుతోంది.

ఇది కేవలం ఆఫ్రికా సమస్య కాదు:

కొన్ని రోజుల క్రితం వరకు 91 మరణాలుగా ఉన్న సంఖ్య ఒక్కసారిగా పెరగడం ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ముఖ్యంగా ఈ వైరస్ ఇప్పటికే యుగాండా వరకు చేరుకోవడం WHOను అత్యవసర చర్యలకు దిగేలా చేసింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ గెబ్రేయేసస్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వ్యాప్తి వేగం, దీని తీవ్రత తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆయన స్పష్టంగా ప్రకటించారు. అందుకే దీన్ని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. అంటే ఇది ఒక్క ఆఫ్రికా సమస్య కాదని WHO తేల్చేసింది. ప్రపంచ సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆ సంస్థ స్వయంగా అంగీకరించింది. ఇంతకీ ఈ వైరస్ గురించి ప్రపంచం ఇంతలా ఎందుకు భయపడుతోందో తెలుసా…? ఎందుకంటే ఎబోలా అంటే కేవలం జ్వరం కాదు… ఇది శరీరాన్ని లోపల నుంచే ఛిద్రం చేసే వైరస్.

ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరం?

ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా WHO చెబుతోంది. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

WHO ఎందుకు అత్యవసర సమావేశం పెట్టింది?

కాంగోలో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసుల కారణంగా WHO అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది.

మొదట జ్వరం వస్తుంది… తర్వాత తీవ్రమైన బలహీనత, కండరాల నొప్పులు, వాంతులు, డయేరియా… ఆ తర్వాత శరీరంలోని రక్తనాళాలు దెబ్బతిని అంతర్గత రక్తస్రావం మొదలవుతుంది. కొంతమందిలో కళ్ల నుంచి… ముక్కు నుంచి… నోటి నుంచి కూడా రక్తం కారే పరిస్థితి వస్తుంది. అంటే వైరస్ మనిషి శరీరాన్ని జీవించి ఉన్నప్పుడే నెమ్మదిగా కూలదోస్తుంది.

ఎబోలా చరిత్రను చూస్తే ప్రపంచం ఎందుకు వణుకుతుందో అర్థమవుతుంది. 1976లో మొదటిసారి కాంగోలోని ఎబోలా నది పరిసరాల్లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఆఫ్రికాలో పలుసార్లు మహమ్మారిలా విరుచుకుపడింది. ముఖ్యంగా 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో జరిగిన ఎబోలా విపత్తు మానవ చరిత్రలోనే అత్యంత భయంకర ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది. గిని, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో వేలాది కుటుంబాలు నాశనమయ్యాయి.

బుండిబుగ్యో స్ట్రెయిన్ ప్రమాదకరమా?

WHO లెక్కల ప్రకారం ఆ మహమ్మారిలో 11 వేల మందికిపైగా మరణించారు. గత యాభై సంవత్సరాల్లో ఎబోలా కారణంగా ఆఫ్రికాలో 15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పైగా ఇప్పుడు వ్యాపిస్తున్న స్ట్రెయిన్ మరింత ప్రమాదకరం. దాని పేరు బుండిబుగ్యో స్ట్రెయిన్. దీనికి ఇప్పటివరకు ప్రపంచంలో అధికారికంగా ఆమోదించి వ్యాక్సిన్ లేదు. ఇదే ఇప్పుడు WHOను అత్యవసర సమావేశం పెట్టేలా చేసింది. ఇప్పటికే జైరే స్ట్రెయిన్ కోసం ఉపయోగించే ఎర్విబో వ్యాక్సిన్ కొంతవరకు రక్షణ ఇవ్వొచ్చని జంతువులపై చేసిన అధ్యయనాలు చెబుతున్నా… మనుషులపై పూర్తి స్థాయి రక్షణ ఉందని ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు.

ఈ వైరస్‌ మరణాల రేటు 50 శాతం వరకు ఉంది. కానీ పూర్తి స్థాయి వ్యాక్సిన్ లేదు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉన్న వైరస్ ఇప్పుడు సరిహద్దులు దాటి వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాప్తి కేంద్రం కాంగోలోని ఇటూరి ప్రావిన్స్. ఇది యుగాండా, సౌత్ సూడాన్ సరిహద్దులకు దగ్గరలో ఉంటుంది. ముఖ్యంగా ఇది బంగారు గనుల ప్రాంతం కావడంతో ప్రతిరోజూ వేలాది మంది కార్మికులు దేశాల మధ్య తిరుగుతుంటారు. అదే ఇప్పుడు వైరస్‌కు పెద్ద మార్గంగా మారింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?

WHO చెబుతున్న ప్రకారం.. వైరస్ ఇప్పటికే ప్రధాన కేంద్రం నుంచి 200 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. అంటే ఇది నియంత్రణలో లేకపోతే మరికొన్ని దేశాలకు కూడా చేరే ప్రమాదం ఉందన్న మాట. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు ఇప్పటికే అప్రమత్తమవుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కాంగో, యుగాండా, సౌత్ సూడాన్ నుంచి వచ్చే విదేశీ ప్రయాణికుల ప్రవేశాన్ని 30 రోజుల పాటు నిలిపివేసింది. మరోవైపు జర్మనీ ఒక అమెరికన్ పౌరుడిని ప్రత్యేక చికిత్స కోసం తమ దేశానికి తరలించేందుకు సిద్ధమవుతోంది. అతను కాంగోలో పనిచేస్తూ ఎబోలా బారిన పడ్డాడు. అమెరికా CDC కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించింది.

WHO భారీ స్థాయిలో వైద్య సామగ్రిని కాంగోకు పంపిస్తోంది. టన్నుల కొద్దీ రక్షణ కిట్లు, మెడికల్ సప్లైస్, ల్యాబ్ నమూనాల పరీక్ష పరికరాలు అక్కడికి చేరుతున్నాయి. ఎందుకంటే ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో చిన్న తప్పు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఎబోలా సోకిన వ్యక్తి రక్తం, చెమట, శరీర ద్రవాలు తాకినా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్యులు పూర్తి రక్షణ దుస్తులతోనే రోగులను తాకుతున్నారు.

కరోనా లాగా కాదు కానీ…:

ఇక్కడ ప్రపంచాన్ని మరో విషయం భయపెడుతోంది. కరోనా వచ్చినప్పుడు కూడా మొదట కొన్ని కేసులే వచ్చాయి. కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించింది కానీ ప్రపంచం ప్రమాదాన్ని ఆలస్యంగా అర్థం చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో మనం చూశాం.. ఇప్పుడు ఎబోలా విషయంలో WHO ముందుగానే అత్యవసర హెచ్చరికలు ఇస్తోంది. ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి వేగం పెరిగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బలహీన ఆరోగ్య వ్యవస్థలు ఉన్న పేద దేశాల్లో ఇది మరింత విధ్వంసం సృష్టించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.

ఎబోలా కరోనా లాగా గాలిలో అంత సులభంగా వ్యాపించదు. సాధారణంగా శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అందుకే త్వరగా గుర్తిస్తే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం ఈ వైరస్ మనిషి శరీరాన్ని క్షణాల్లో కూల్చివేస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం మే 31న జరగనున్న WHO అత్యవసర కమిటీ సమావేశం వైపు చూస్తోంది.

ALSO READ: యుద్ధభూములుగా మారిన నగరాలు.. మానవతా సంక్షోభానికి దారితీసిన సూడాన్ సివిల్ వార్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *