Menu

Cost of living in India: తడిసి మోపెడువుతుంది.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ఇదే సీన్!

Praja Dhwani Desk 3 months ago
hyderabad cost of living

ఒకటో తేది జీతం పడితే ఐదో తేదికి బ్యాలెన్స్‌ ఖాళీ అయిపోతుంది. EMIలు, రెంట్లు, నిత్యావసరాలు, పెట్రోల్.. ఇలా ప్రతీదీ భారంగానే మారిపోయిన రోజులివి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లోనే కాదు.. ఇన్నాళ్లు చీప్ అండ్ బెస్ట్ సిటీ అని చెప్పుకున్న హైదరాబాద్‌ కూడా ఇప్పుడు మెల్లగా ఖర్చుల నగరంగా మారుతోంది.

ఒక వ్యక్తి నెల ఖర్చు సగటున 12 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. అది కూడా రెంట్ లేకుండా. ఇంటి అద్దె జోడిస్తే.. జీతం వచ్చినా దండగే అనిపిస్తుంది. పాలు, బియ్యం.. ఇలా ప్రతి చిన్న ఖర్చు మెల్లగా పెరుగుతుంటే మన జీవితం కూడా తెలియకుండానే ఖరీదైపోతుంది. ఇంతకీ హైదరాబాద్‌లో జీవితం ఎందుకింత భారమవుతోంది?

దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక వ్యక్తి నెలకు సగటున 27 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కుటుంబం ఉంటే అదే ఖర్చు దాదాపు లక్ష రూపాయల వరకు చేరుతోంది. కానీ ఈ సంఖ్యలు నగరాన్ని బట్టి పూర్తిగా మారిపోతాయి. ముంబైలో ఒక వ్యక్తికి నెలకు 30 వేల నుంచి 60 వేల వరకు ఖర్చు అవుతోంది.

ఢిల్లీలో 22 నుంచి 50 వేల మధ్య ఉంటుంది. పుణేలో 25 నుంచి 45 వేల వరకు.. బెంగళూరులో 20 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతోంది. అంటే మెట్రో నగరాల్లో జీవితం అంటే ఖర్చు ఎక్కువ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ చూస్తే ఇక్కడ ఖర్చు తక్కువనే ఇమేజ్ ఇప్పటికీ ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మారుతోంది. 12 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు అనేది చాలా పెద్ద రేంజ్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటన్నదే ఇక్కడ కీలకం. ఐటీ ఉద్యోగం, బయట తినే అలవాటు, ట్రావెల్స్‌ చేయడం లాంటివి ఉంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్ద గేమ్ ఛేంజర్‌గా రెంట్ నిలుస్తోంది. నగరంలో ఒక 1-BHK రెంట్‌ సగటున 14 వేల రూపాయల వరకు ఉంటుంది. సిటీకి కాస్త దూరంగా వెళ్తే 8వేల నుంచి 10 వేల రూపాయల వరకు రెంట్ ఉంటుంది. అంటే చాలా మంది జీతంలో సగం కేవలం ఇంటి రెంట్‌కే వెళ్లిపోతుంది.

ఇక నిత్యావసరాల ధరలు కూడా తక్కువగా లేవు. పాలు లీటర్ 80 రూపాయలు, బియ్యం కిలో 70 రూపాయలు, బయట తింటే ఒక సాధారణ భోజనం 200 రూపాయలు. పెట్రోల్ వారానికి 100 రూపాయల కన్ఫామ్‌ అనే చెప్పాలి. నెలకు కరెంట్, నీరు, ఇతర బిల్లులు కలిపితే మరో 3 నుంచి 4 వేల రూపాయలు అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే హైదరాబాద్‌లో అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఉద్యోగ అవకాశాలూ పెరిగాయి. అందుకే పుణే, హైదరాబాద్ లాంటి నగరాలను వాల్యూ ఫర్ మనీ నగరాలుగా చెబుతుంటారు. అంటే ఖర్చు ఉన్నా దానికి తగ్గ అవకాశాలు కూడా ఉన్నాయని అర్థం.

మొత్తానికి ఒక విషయం క్లియర్.. మీ నగరం, మీ జీవనశైలి, మీ ఎంపికలే మీ ఖర్చును నిర్ణయిస్తాయి. ఇన్నాళ్లు చీప్ సిటీ అనుకున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసి ఖర్చు చేయాల్సిన నగరంగా మారిందనే చెప్పుకోవాలి.

ALSO READ: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు.. సమస్యను అంచనా వెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *