Menu

Real Estate Scams: సామాన్యులకు టోపి పెడుతున్న బడా రియల్‌ఎస్టేట్‌ కంపెనీలు.. ఈ మోసాలకు అడ్డు వేసేది ఎవరు?

Praja Dhwani Desk 2 months ago
real estate scams aditri company

జీవితాంతం కష్టపడి సంపాదించే డబ్బుతో ఒక ఇల్లు కట్టుకోవాలనే కల చాలా మందిది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆ కలను ఒక దొంగలెక్కగా మార్చేసింది. అవసరాన్ని సరుకుగా వాడేసింది. భవిష్యత్తును అడ్వాన్స్ చెల్లింపుగా తినేసింది. ఇక్కడ ఇల్లు అనేది జీవన హక్కు కాదు. ఇది లాభాల ప్రాజెక్టుగా మారింది. ఇక్కడ బ్యాంకు లోన్ తీసుకుని అడ్వాన్స్ చెల్లించిన తర్వాతే అసలు కథ మొదలవుతోంది. ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. వాగ్దానాలు గాల్లో కలిసిపోతున్నాయి. డబ్బులు తిరిగి రావడం లేదు. మోసపోతున్నది సామాన్యుడు మాత్రమే కాదు.. ఈ రంగంలో తిరుగుతున్న ఏజెంట్లు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. కమిషన్ కోసం పనిచేసిన వాళ్లకే డబ్బులు ఆగిపోతుందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ గోడలు కట్టేది సిమెంట్‌తో కాదు, ప్రజల నమ్మకంతో. ఆ నమ్మకమే కూలిపోతే మిగిలేది కాంక్రీట్ కాదు, కోపం. ఇప్పుడా కోపమే సామాన్యులతో పాటు ఏజెంట్లలోనూ కనిపిస్తోంది.

నిజానికి రియస్‌ఎస్టేట్ రంగంలో మోసాలు కొత్తవి కావు. ఇప్పటికే కొన్ని ప్రముఖ పత్రికలు వెలుగులోకి తెచ్చిన కథనాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో రేరా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నమోదు చేయని ఫ్లాట్ల ప్రచారం, ఏజెంట్లపై జరిమానాలు, లావాదేవీల్లో అస్పష్టతలపై అనేకమంది ప్రశ్నలు లేవనెత్తారు . ఇది సోషల్ మీడియాలో వచ్చిన రూమర్ కాదు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న విషయం.

ఒకవైపు భారీ ప్రకటనలు. లగ్జరీ అన్న మాట. గేటెడ్ కమ్యూనిటీ అన్న ట్యాగ్. మరోవైపు అనుమతులపై సందేహాలు, ఏజెంట్లతో లావాదేవీలపై వివాదాలు. ఇక ఇల్లు కొనేవాడు బ్రోచర్ చూస్తాడు. బ్యాంకు లోన్ సాంక్షన్ అయ్యిందా అని చూస్తాడు కానీ అసలు ఒప్పందాల లోపలి షరతులు చదివే అలవాటు చాలామందికి ఉండదు. అందుకే రిస్క్ మొత్తం కొనుగోలుదారుడి భుజాల మీద పడుతోంది.

అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. తాజాగా ఒక మీడియా వర్గానికి చెందిన వ్యక్తి ఈ రంగంలో ఏజెంట్‌గా పనిచేస్తూ 2లక్షల 50వేల రూపాయలు కోల్పోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్ సంబంధిత లావాదేవీలో కంపెనీకి అనుబంధంగా పనిచేస్తున్న అకౌంటెంట్ డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రూఢిగా ప్రవర్తించాడట. కమిషన్ కోసం ప్రాజెక్టులు అమ్మిన వాడికే డబ్బు రాలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇల్లు కొనే వ్యక్తి తన జీవిత పొదుపు పెడుతున్నాడు. ఏజెంట్ తన సమయం, శ్రమ పెడుతున్నాడు. కానీ లాభం ఎవరి చేతిలోకో వెళ్తోంది. ముందే అడ్వాన్స్ తీసుకోవడం, తర్వాత ఆలస్యం చేయడం, మధ్యలో షరతులు చూపించడం, చివరికి బాధ్యతను తప్పించుకోవడం. ఇది ఒక వ్యక్తి తప్పు కాదు. ఇది నిర్మాణాత్మక సమస్య. డబ్బు ఉన్నవాడు నియమాలు రాస్తున్న వ్యవస్థ.

మరోవైపు న్యాయం కోసం రేరా ఉందంటారు. చట్టాలు ఉన్నాయంటారు. అయితే ఈ వివాదాలు ఎందుకు రిపీట్‌ అవుతున్నాయనే దానికి మాత్రం సమాధానం ఉండదు. వాస్తవానికి ఇల్లు ఒక హక్కు కావాలి. కానీ అది పెట్టుబడి సరుకుగా మారింది. భూమి ఒక అవసరం కావాలి. కానీ అది లాభాల యంత్రంగా మారింది. కొనుగోలుదారుడు నష్టపోయినా, ఏజెంట్ నష్టపోయినా అవి మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా వరకు వెళ్లడంలేదు.

ఇది ఒక కంపెనీ గురించి మాత్రమే కాదు.. రియల్‌ఎస్టేట్‌ వ్యవస్థ నడుస్తున్న తీరు. ప్రజల డబ్బుతో సామ్రాజ్యాలు కట్టుకుంటున్న వాళ్లు చివరకు సామాన్యుల నోట్లో మట్టికొట్టడం ఎంత ఘోరమైన విషయమో కదా!

ALSO READ: గణేశా.. చూస్తున్నావా? “G”old star ⭐.. “G”ole mall


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *