ఒక ప్లేట్ బిర్యానీ.. ఒక చిన్న బిల్.. ఒక డిలీట్ చేసిన ఎంట్రీ వేల కోట్ల స్కామ్‌ను బయటపెట్టిందంటే నమ్మగలరా? హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్‌కి ఆదాయపన్ను అధికారులు సాధారణ తనిఖీకి వెళ్లారు. లోపల కిటకిటలాడే జనాలు.. టేబుళ్లు ఫుల్.. పార్సెల్ కౌంటర్ వద్ద క్యూ. కానీ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తున్న బిల్లుల సంఖ్య మాత్రం తక్కువ. అక్కడే మొదలైంది అనుమానం.
ఒక రెస్టారెంట్ లెక్కల్లో తేడా అనుకున్న విషయం, కాసేపట్లో దేశవ్యాప్త డిజిటల్ వలగా మారింది. ఒకే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్.. ఒకే తరహా డిలీషన్ ప్యాటర్న్.. ఆ డేటా ట్రేస్ చివరకు వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని చూపించింది. బిర్యానీ బిల్లుల నుంచి మొదలైన ఈ దర్యాప్తు, దేశవ్యాప్తంగా దాదాపు 70,000 కోట్ల రూపాయల మేర దాచిన టర్నోవర్‌ను వెలికితీసే స్థాయికి వెళ్లింది. ఒక డిలీట్ చేసిన బిల్… దేశంలోనే అతిపెద్ద డిజిటల్ పన్ను దర్యాప్తుకు నాంది పలికింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు కథేంటి?
అధికారులు మొదటగా ఇది లోకల్ ట్రిక్ అనుకున్నారు. క్యాష్ బిల్లులు కొన్ని తీసేసి ఉండొచ్చని భావించారు. కానీ అన్ని అవుట్‌లెట్లు ఒకే సాఫ్ట్‌వేర్ వాడుతున్నాయని తెలిసిన క్షణం కేసు దిశ మారిపోయింది.
ఆ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌ఎండ్ సర్వర్లు అహ్మదాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి దాదాపు లక్షకు పైగా రెస్టారెంట్ల బిల్లింగ్ డేటా ఆనవాళ్లు బయటపడ్డాయి. మొత్తం డేటా పరిమాణం సుమారు 60టెరాబైట్లకు చేరింది. హైదరాబాద్‌లోని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అధికారులు డిలీట్ చేసిన బిల్లులను తిరిగి బ్యాక్‌అప్ చేయడం ప్రారంభించారు. కంప్యూటర్‌లో బిల్ తీసేసినా, సిస్టమ్‌లో చిన్నచిన్న డిజిటల్ గుర్తులు మిగిలిపోతాయి. ఆ గుర్తులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో విశ్లేషించారు. అప్పుడు బయటపడిన లెక్కలు భారీగా ఉన్నాయి. గత ఆరు సంవత్సరాల్లో ఈ సాఫ్ట్‌వేర్ వాడిన రెస్టారెంట్లు కలిపి సుమారు 2లక్షల43వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులు జెనరేట్ చేసినట్టు రికార్డులు చూపించాయి. అందులో 13వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులు రికార్డు చేసిన తర్వాత డిలీట్ చేసినట్టు గుర్తించారు. కొన్ని చోట్ల రోజుకు కొన్ని క్యాష్ బిల్లులు తీసేసిన ఆనవాళ్లు కనిపించాయి. మరికొన్ని చోట్ల ఒకేసారి 10 నుంచి 30రోజుల వరకు మొత్తం ట్రాన్సాక్షన్ బ్లాక్స్ తొలగించినట్టు కనిపించింది.
రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో దాదాపు 2వేల కోట్ల రూపాయల మేర డిలీట్ చేసిన లావాదేవీలు గుర్తించారు. తెలంగాణలో సుమారు 1500 కోట్లగా ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా పెద్ద మొత్తాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3,734 పాన్ నంబర్లను ప్రత్యేకంగా పరిశీలించగా 5 వేల కోట్లకు పైగా దాచిన అమ్మకాలు బయటపడ్డాయి. కేవలం 40 రెస్టారెంట్ల నమూనా పరిశీలనలోనే 400 కోట్ల రూపాయల మేర అప్రకటిత టర్నోవర్ కనిపించింది. కొందరు వ్యాపారులు దాదాపు 25శాతం అమ్మకాలను ప్రకటించలేదని విశ్లేషణ చెబుతోంది.
ఇక ఇక్కడే బిర్యానీ కోణం ముందుకు వచ్చింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఒకే డిష్ బిర్యానీ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి నగరాల్లో వీకెండ్లు, పండుగలు అంటే లక్షల ప్లేట్లు అమ్ముడవుతాయి. బిర్యానీకి ఉపయోగించే బియ్యం, మాంసం కొనుగోళ్ల పరిమాణం ఒక స్థిరమైన అంచనా ఇస్తుంది. కొనుగోలు చేసిన ముడిసరుకు పరిమాణం, డెలివరీ యాప్స్‌లో కనిపించే ఆర్డర్లు, జీఎస్టీ రిటర్నులు, అంతర్గత బిల్లింగ్ లాగ్స్ మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి. ఒక ప్లేట్ ధర పెద్దది కాకపోయినా, రోజుకు వందల ప్లేట్లు డిలీట్ చేస్తే అది సంవత్సరానికి కోట్లలోకి చేరుతుంది. ఇక పరిశీలనలో మరో విషయం బయటపడింది. 2019 నుంచి 1.77 లక్షల రెస్టారెంట్ల డేటాను విశ్లేషించగా సగటున 27 శాతం వరకు అమ్మకాలను అణిచివేసినట్టు నమూనాలు చూపించాయి.
మొత్తం కలిపితే దాదాపు 70,000 కోట్ల రూపాయల టర్నోవర్ దాచినట్టు అంచనా. దీని వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్ను నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలా ఒక రెస్టారెంట్‌లో కనిపించిన చిన్న లెక్క తేడా దేశవ్యాప్తంగా డిజిటల్ పన్ను దర్యాప్తుకు దారితీసింది.
ALSO READ: వెస్‌బ్యాంక్‌ను ఇజ్రాయెల్ కబ్జా చేయనుందా? నెతన్యాహూ కేబినెట్ నిర్ణయంపై విమర్శలు

Cost of living in India: తడిసి మోపెడువుతుంది.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఇదే సీన్!
Real Estate Scams: సామాన్యులకు టోపి పెడుతున్న బడా రియల్ఎస్టేట్ కంపెనీలు.. ఈ మోసాలకు అడ్డు వేసేది ఎవరు?
Numaish: జేబుకు చిల్లు..ఫుడ్ కంపు.. అడుగడుగునా దోపిడి.. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మోసాలివే!
Humanity: సికింద్రాబాద్‌లో మొదలైన జార్జ్ నిశ్శబ్ద విప్లవం.. ఆకలిని గౌరవంగా ఎదుర్కొన్న ఒక ఆలోచన!
Manikonda: మణికొండ కాదు అనకొండ, దోమల కొండ.. అధికారులు నిద్రపోతున్నారా? ఈ వాటర్ లీకేజీకి పరిష్కారం లేదా సార్?
Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?