Menu

Israel-Westbank: వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్‌ కబ్జా చేయనుందా? నెతన్యాహూ కేబినెట్‌ నిర్ణయంపై విమర్శలు

Praja Dhwani Desk 2 months ago
west bank annexation

పశ్చిమ తీర ప్రాంతంలో యుద్ధ గాలులు భీకరంగా వీస్తున్నాయి. 1967 యుద్ధం తర్వాత సైనిక నియంత్రణలో ఉన్న వెస్ట్ బ్యాంక్ భూభాగంపై ఇజ్రాయెల్ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. వెస్ట్ బ్యాంక్‌లో భూములను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ కేబినెట్ అనుమతి ఇచ్చింది.

బయటకు చూస్తే ఇది కేవలం పరిపాలనా చర్యలా కనిపించవచ్చు కానీ విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఈ నమోదు ప్రక్రియ ద్వారా ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ పూర్తి హక్కు ప్రకటించడానికి పునాది వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది భవిష్యత్తులో వెస్ట్ బ్యాంక్‌ను అధికారికంగా ఇజ్రాయెల్‌లో కలుపుకునే దిశగా కనిపిస్తోంది. 30 లక్షలకు పైగా పాలస్తీనియన్లు నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 7 లక్షలకుపైగా ఇజ్రాయెలీ సెట్లర్లు స్థిరపడ్డారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ఇజ్రాయెల్‌ వేగంగా అడుగులు వేస్తుందని సమాచారం!

1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తున్నారు.

అయినా కూడా అక్కడ దశాబ్దాలుగా ఇజ్రాయెలీ నివాసాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం కలిపి సుమారు 250కు పైగా సెటిల్‌మెంట్లు, ఔట్‌పోస్టులు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2023 చివరి నాటికి సుమారు 7 లక్షల వరకు ఇజ్రాయెలీ సెట్లర్లు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ తాజా నిర్ణయం ప్రకారం భూముల అధికారిక నమోదు కూడా నెతన్యాహు నియంత్రణలోనే జరుగుతుంది. ఇప్పటి వరకు వెస్ట్ బ్యాంక్‌లో భూస్వామ్య రికార్డుల పెద్ద భాగం ఒట్టోమన్, బ్రిటిష్ మాండేట్ కాలం లేదా జోర్డాన్ పరిపాలన కాలం నాటి పాత రికార్డులపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ కొత్త నమోదు ప్రక్రియ ద్వారా ఎవరి భూమి ఎవరిదో ఇజ్రాయెల్ వ్యవస్థే నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీని వల్ల పాలస్తీనియన్లు సాంప్రదాయంగా సాగు చేస్తున్న భూములను కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.

ఇటు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ ఈ నిర్ణయాన్ని సెటిల్‌మెంట్ విప్లవానికి మరో ముందడుగుగా అభివర్ణించారు. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దీన్ని భద్రతా అవసరంగా సమర్థించారు. కానీ పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం దీన్ని కబ్జాగా ఆరోపిస్తోంది. ఇక సెటిల్‌మెంట్ పర్యవేక్షణ సంస్థ పీస్ నౌ అంచనా ప్రకారం ఈ చర్యతో వెస్ట్ బ్యాంక్ భూభాగంలో సగం వరకు ప్రాంతాలు పాలస్తీనియన్ల నియంత్రణ నుంచి జారిపడే అవకాశం ఉంది.

ఇటు నాల్గో జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఆక్రమిత భూభాగంలో ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న దేశం తన పౌరులను అక్కడికి మార్చి నివాసాలు ఏర్పాటు చేయకూడదు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం సెటిల్‌మెంట్ల నిర్మాణం ఆగలేదు, సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మరోవైపు అమెరికా అధికారికంగా వెస్ట్ బ్యాంక్ అనెక్సేషన్‌కు వ్యతిరేకమని తెలిపినా, సెటిల్‌మెంట్ విస్తరణను అడ్డుకునే కఠిన చర్యలు తీసుకోలేదు. ఇదే అంశం అరబ్ దేశాలతో పాటు యూరప్ దేశాల్లో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే వెస్ట్ బ్యాంక్ అనేది భవిష్యత్ పాలస్తీనా స్వతంత్ర రాష్ట్రానికి కీలక భూభాగం. రెండు దేశాల పరిష్కారానికి అది కేంద్రబిందువు కూడా.

ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ మూడు పరిపాలనా ప్రాంతాలుగా విభజించి ఉంది. ఏరియా-A పూర్తిగా పాలస్తీనా అధికార పరిధిలో ఉంటుంది. ఏరియా-B సంయుక్త నియంత్రణలో ఉంటుంది. ఏరియా-C సుమారు 60 శాతం భూభాగాన్ని కలిగి ఉండి పూర్తిగా ఇజ్రాయెల్ సైనిక, పరిపాలనా నియంత్రణలో ఉంది. కొత్త భూముల నమోదు ప్రక్రియ ప్రధానంగా ఈ ఏరియా-Cలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇది కేవలం భూముల రికార్డుల వ్యవహారం మాత్రమే కాదు. ఇది జనాభా గణాంకాలు, భూస్వామ్య హక్కులు, భవిష్యత్ సరిహద్దులుతో కలిసిన సున్నితమైన అంశం. వెస్ట్ బ్యాంక్‌ను అధికారికంగా ఇజ్రాయెల్‌లో విలీనం చేస్తే ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే గాజా యుద్ధం కారణంగా 70వేలకు పైగా సామాన్యులు బలయ్యారు.ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో మరో మంట రాజేసే అవకాశాలను మరింత పెంచిందని చెప్పవచ్చు.

ALSO READ: 2026లో సూర్యుడి నుంచి భారీ ముప్పు! ప్రపంచం సిద్ధంగా ఉందా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *